KTR | బీసీలను కులగణన పేరుతో వంచించి.. అవమానించిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవమానించిందని తాము అనడం లేదని.. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారని.. అందుకు ఆయనను సస్పెండ్ చేశారన్నారు. మీరు బీసీల సంఖ్య ఎలా తగ్గిస్తారు? కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56శాతం ఉన్న బీసీలు.. ఈనాడు 46శాతం ఎట్ల అవుతారని ప్రశ్నిస్తే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇవాళ మేం అనడం లేదు కదా? రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు సరైనవని అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నడా? మీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలైనా ఏకీభవించే పరిస్థితి ఉందా?’ అంటూ ప్రశ్నించారు.
‘ఇవాళ కుల గణన పేరుతో బీసీలను వంచించి.. మోసం చేసి.. బీసీ సంఖ్యను తగ్గించి.. ఏదో ఉద్దరించినట్లు సోషల్ జస్టిస్ అని గవర్నర్ నోటివెంట అబద్ధాలు చెప్పించడం సిగ్గుచేటు. కాంగ్రెస్ తల్లిని తీసుకువచ్చి సెక్రటేరియట్లో పెట్టి.. రాహుల్ తండ్రి సెక్రటేరియట్ ముందు పెట్టి అదేదో గొప్ప పని చేసినట్లు.. తెలంగాణకు ఏదో ఉద్దరించినట్లు.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వానికి మేం చెప్పేది ఒక్కటే.. కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రి మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్కు మూడేళ్ల తర్వాత పంపిస్తాం. గవర్నర్ ప్రసంగం ఇవాళ పూర్తిస్థాయిలో ప్రజలను వంచించడమే కాకుండా.. మోసం చేయడమే కాకుండా.. గవర్నర్ ప్రతిష్టను సైతం తగ్గించింది’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.