Congress | కేసీఆర్ పదేండ్ల పాలనలో రెండంకెల వృద్ధితో ఆర్థిక రంగంలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన ఒకప్పటి సుసంపన్న తెలంగాణ.. రేవంత్ రెండేండ్ల పాలనలోనే ఆర్థికంగా దివాలా అంచుకు చేరింది. రెవెన్యూ రాబడులు కరోనా నాటి కంటే దిగువకు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిన ప్రభుత్వ అప్పులు, తరిగిన రెవెన్యూ రాబడులు, పడిపోయిన తలసరి, నేలను చూస్తున్న జీఎస్డీపీ వృద్ధిరేటు మొత్తంగా హస్తం పాలనలో యావత్తు తెలంగాణ ఆగమాగమైపోయింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరమైన వైఫల్యం. అప్పులు చేయడంలో తిరుగులేని రికార్డు. ప్రజల తలసరి ఆదాయాన్ని అమాంతం మింగేసేలా ముందుచూపులేని విధానాలు. మిగులు రాష్ర్టాన్ని లోటు బడ్జెట్లోకి తోసేసిన చేతగానితనం.. వెరసి రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకప్పటి సుసంపన్న తెలంగాణ.. దివాలా అంచుకు చేరింది. పదేండ్ల కేసీఆర్‌పాలనలో వెలుగులీనిన బంగారు తెలంగాణ.. రెండంటే రెండేండ్ల రేవంత్ పాలనలో నుసిగా మారిపోయింది. రెండేండ్ల ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలంటూ ఆర్భాటంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసలు డొల్లతనం గణాంకాలు సహా బట్టబయలైంది.
కేసీఆర్‌పాలనలో ఆమ్దానీ భేష్
కేసీఆర్ పదేండ్లపాలనలో రెవెన్యూ రాబడుల్లో రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటును నమోదు చేసింది. 2014-15లో రాష్ట్ర సొంత పన్ను రాబడులు రూ.29,288 కోట్లుగా ఉంటే, 2022-23లో బీఆర్ఎస్ అధికారంలో నుంచి దిగిపోయేనాటికి అది రూ.1.26 లక్షల కోట్లకు చేరింది. 2016-17లో రాబడుల్లో వృద్ధి 12.37 శాతంగా నమోదైతే, 2022-23నాటికి అది ఏకంగా 25.01 శాతానికి ఎగబాకింది. కేసీఆర్ పాలనలో రాబడుల్లో ఏటికేడాది సగటున వృద్ధిరేటు 18.3 శాతంగా నమోదైంది. ఇది జాతీయ సగటు 10.9 శాతం కంటే 7.4 శాతం ఎక్కువ.
రేవంత్ హయాంలో కటకట
ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో.. సొంత పన్ను రాబడులు అమాంతం పడిపోయాయి. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ప్రతియేటా పెరిగిన రాష్ట్ర రెవెన్యూ రాబడులు కాంగ్రెస్ పాలనలో ఏటికేడూ తగ్గుముఖం పట్టాయి. కేసీఆర్ పాలనలో రాబడుల్లో వృద్ధిరేటు పదేండ్లలో మొత్తంగా 430 శాతం నమోదుకాగా, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో ఇది 0.9 శాతానికి పరిమితమవ్వడం తెలంగాణ ఎంతటి ఆర్థిక సంక్షోభంలో ఉన్నదో చెప్పకనే చెప్తున్నది. కేసీఆర్ కాలంనాటి వ్యవస్థలే ఉన్నప్పటికీ రాష్ట్ర ఆమ్దానీ మాత్రం విచిత్రంగా తిరోగమనంలో ఉన్నది.
కరోనానాటి పరిస్థితులు
రాబడుల్లో వృద్ధిరేటు కరోనా సంక్షోభ సమయంలో (-)2.57 శాతంగా నమోదైతే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా (-)0.76 శాతంగా అంటే మైనస్‌లలో నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. సొంత పన్ను రాబడుల్లో ప్రస్తుతం కొవిడ్ నాటి దారుణ పరిస్థితులు పునరావృతంకావడం రేవంత్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు. రాష్ట్రంలో రియల్ఎస్టేట్ పడిపోవడం, ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడం తదితరాల కారణంగానే ప్రభుత్వానికి రెవెన్యూ రాబడులు తగ్గినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మిగులు నుంచి లోటులోకి
కేసీఆర్ పదేండ్లపాలనలో మౌలిక వసతుల కల్పన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో జరిగాయి. అయినప్పటికీ, అప్పులు పరిమితి దాటలేదు. రెవెన్యూ మిగులు కనిపించింది. 2022-23లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయేనాటికి రాష్ట్ర రెవెన్యూ మిగులు రూ. 6,508 కోట్లుగా ఉన్నది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తొలి ఏడాదిలోనే మిగులు రాష్ట్రం లోటులోకి కూరుకుపోయింది. 2024-25లో రెవెన్యూ లోటు రూ.8,783 కోట్లుగా నమోదవ్వగా, 2025 అక్టోబర్‌నాటికి అది పెరిగి రూ.10,113 కోట్లకు ఎగబాకింది.
అప్పులకు కేరాఫ్
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో అట్టర్‌ఫ్లాప్‌గా మిగిలిన రేవంత్ ప్రభుత్వం.. అప్పులు చేయడంలో మాత్రం కొత్త రికార్డులను సృష్టిస్తున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.3.48 లక్షల కోట్ల రుణాలను సమీకరిస్తే, రెండేండ్ల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల అప్పులు చేసింది. బీఆర్ఎస్ సర్కారు ఏడాదికి సగటున రూ.34,800 కోట్ల అప్పు చేస్తే, రేవంత్ ప్రభుత్వం ఏడాదికి రూ.1.25 లక్షల కోట్ల అప్పు చేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో వార్షిక రుణ లక్ష్యం రూ.54,009 కోట్లుగా ప్రతిపాదించింది. డిసెంబర్ 2వ తేదీనాటికే రూ.66,000 కోట్ల (122.20 శాతం) అప్పు చేసింది. వార్షిక రుణ లక్ష్యాన్ని దాటి 22 శాతం అదనంగా చేసింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉన్నది.
ఈ నాలుగు నెలల్లో మరింత రుణ సమీకరణకు రేవంత్‌రెడ్డి సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నాలుగు నెలల్లో రుణ లక్ష్యం 150 శాతం నుంచి 200 శాతానికి చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రుణాల సమీకరణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు ఇలాగే కొనసాగితే, ఆర్థికంగా రాష్ట్రం మరింత ప్రమాదకరమైన స్థితిలోకి దిగజారే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర అప్పులు, వడ్డీ చెల్లింపులు నానాటికీ పెరుగుతుండటంతో ప్రజా సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల చెల్లింపు, మూలధన పెట్టుబడులకు నిధులు దొరకడం కష్టమని వాపోతున్నారు. కాగా.. తీసుకొచ్చిన అప్పుతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టులు, కార్యక్రమాలు, రైతుబంధు వంటి విప్లవాత్మకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే, రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పును ఏం చేసిందో ఇప్పటికీ ఎవరికీ అర్థంకాకపోవడం విచిత్రం.
చరిత్రలో చూడని ప్రతిద్రవ్యోల్బణం
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అక్టోబర్‌లో రాష్ట్ర ఆర్థికం నాలుగోసారి ‘డిఫ్లేషన్’ (నెగటివ్ ఇన్ఫ్లేషన్-ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఐదు నెలల వ్యవధిలో రాష్ట్రంలో ఏకంగా నాలుగుసార్లు ప్రతి ద్రవ్యోల్బణం నమోదవ్వడం ఆర్థిక నిపుణులకు ఆందోళన కలుగజేస్తున్నది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. తెలంగాణలో అక్టోబర్‌లో ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 1.16% నమోదైంది. ఇదే సమయంలో జాతీయ సగటు ద్రవ్యోల్బణం 0.25%గా రికార్డయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదకొండున్నరేండ్ల తర్వాత గత జూన్‌లో తొలిసారిగా డిఫ్లేషన్ -0.93%గా రికార్డయ్యింది. జూలైలోనూ డిఫ్లేషన్ -0.44%గా నమోదైంది. సెప్టెంబర్‌లో మళ్లీ -0.15% గా రికార్డయ్యింది. ఇప్పుడు అక్టోబర్‌లో డిప్లేషన్ ఏకంగా -1.16%గా నమోదైంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో సాగుతున్నట్టు సూచించే ప్రమాదకర సంకేతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా రెండేండ్ల రేవంత్ పాలనలో తెలంగాణ అన్నిరకాలుగా కకావికలమయ్యిందని తెలంగాణవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్బీఐ ఈ-వేలంలో 6,000 కోట్లు
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన ఈ-వేలంలో పాల్గొన్న తెలంగాణ ఆర్థికశాఖ.. ప్రభుత్వ సెక్యూరిటీలు పెట్టి తాజాగా మరో రూ.6000 కోట్ల రుణ సమీకరణ చేసింది. ఈ విషయాన్ని ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. 14 ఏండ్ల కాలానికి 7.49 శాతం వార్షిక వడ్డీతో రూ.1,500 కోట్లు, 19 ఏండ్ల కాలానికి 7.68 శాతం వార్షిక వడ్డీతో రూ.1,500 కోట్లు, 21 ఏండ్ల కాలానికి 7.55 శాతం వార్షిక వడ్డీతో రూ.1,500 కోట్లు, 27 ఏండ్ల కాలానికి 7.52 శాతం వార్షిక వడ్డీతో మరో రూ.1,500 కోట్లు తీసుకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం రూ.2,29,720.62 కోట్లు వస్తుందని బడ్జెట్లో ప్రతిపాదించగా, అక్టోబర్ నాటికి రూ.94,555.97 కోట్లు అంటే 41.16 శాతమే వచ్చింది. ఆదాయం, వ్యయం మధ్య అంతరాన్ని పూడ్చేందుకు రేవంత్ సర్కారు అప్పులపై ఆధార పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నియమాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ రాష్ర్టానికి మారెట్ రుణాల కింద రూ.54,009 కోట్లు మాత్రమే అనుమతించింది. బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా ప్రతిపాదించింది. కానీ, తొమ్మిది నెలలు గడువక ముందే రూ.66,000 కోట్ల రుణ సమీకరణ చేసింది. అయితే, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ బడ్జెట్ ప్రతిపాదనలకు మించి రుణ సమీకరణ చేయలేదు. కానీ, ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా, ఆరు గ్యారెంటీలు అమలుచేయకుండా రేవంత్ సర్కారు అడ్డగోలు రుణ సమీకరణ చేయడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
జీఎస్డీపీ, తలసరి అధోగతి
ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే. తలసరి ఆదాయం, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) పెరుగుదలను పరిశీలిస్తే, ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అంచనా వేయవచ్చు. కేసీఆర్హయాంలో గడిచిన పదేండ్లకాలంలో తెలంగాణ ఈ అభివృద్ధి శిఖరాలను అధిరోహించింది. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో దేశంలోనే టాప్‌గా నిలిచింది. 2014-15లో రూ.5.05 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర జీఎస్డీపీ.. 2023-24నాటికి రూ.14.49 లక్షల కోట్లకు ఎగబాకింది. బీఆర్‌ఎస్‌పాలనలో ఏడాదికి జీఎస్డీపీ సగటు వృద్ధిరేటు 12.7 శాతంగా రికార్డయ్యింది. అయితే, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో జీఎస్డీపీలో వృద్ధిరేటు 10 శాతానికే పరిమితమవ్వడం గమనార్హం. ఇక, కేసీఆర్‌పాలనలో ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధిరేటు 16.2 శాతంగా ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో అది 6.59 శాతం మేర క్షీణించి 9.61 శాతానికి పరిమితమైంది.
కాంగ్రెస్‌పాలనలో ప్రతిద్రవ్యోల్బణం ఇలా..
రాష్ట్ర సొంత పన్ను రాబడులు
బీఆర్ఎస్ పాలనలో..
బీఆర్ఎస్ పాలనలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సొంతపన్ను రాబడుల్లో వృద్ధిరేటు 7.4% ఎక్కువ
కాంగ్రెస్ పాలనలో..
సొంత పన్ను రాబడులు అప్పుడు.. ఇప్పుడు..(శాతాల్లో)
రెవెన్యూ మిగులు-లోటు
అప్పులు
జీఎస్డీపీ వృద్ధిరేటు
2024-25లో కాంగ్రెస్ హయాంలో జీఎస్డీపీ వృద్ధిరేటు10 శాతం
బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ పాలనలో జీఎస్డీపీ వృద్ధిరేటులో క్షీణత 2.7 శాతం
తలసరి వృద్ధిరేటు