మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పార్టీని వీడటం, బీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించడం.. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలవరానికి గురిచేస్తున్నది. అధికారంలో ఉన్నప్పటికీ.. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి నిష్క్రమిస్తుండటంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏఐసీసీ సమావేశాలకు హాజరైన ముఖ్యనేత మీద ఇదే విషయమై ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : ‘మనం (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు అధికార పార్టీలో చేరుతారు. కానీ, తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇదేంటి? జీవన్‌రెడ్డి చాలా కీలక నాయకుడు, పెద్ద మనిషి. అలాంటి నేతను మనం వదులుకున్నాం. కాంగ్రెస్ పార్టీ గడ్డురోజులు ఎదుర్కొన్నప్పుడు కూడా మనతో ఉన్న జీవన్‌రెడ్డి ఇప్పుడెందుకు పార్టీని వీడారు? ఆయనతో మీరెందుకు మాట్లాడలేదు?’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరైన రాష్ట్ర ముఖ్యనేతను ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత పలువురు నేతలతో ముచ్చటించిన ఖర్గే.. చివరకు రాష్ట్ర ముఖ్యనేతతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి అంశాన్ని, కాంగ్రెస్‌కు ఆయన అందించిన సుదీర్ఘ సేవలను ప్రస్తావించినట్టు విశ్వసనీయ సమాచారం. జీవన్‌రెడ్డి గురించి తనకు తెలుసునని, అనేక సందర్భాల్లో ఆయన పార్టీ తరఫున గొంతు విప్పి మాట్లాడారని ఖర్గే గుర్తుచేసుకుంటూ.. అలాంటి నేత కొంత కాలంగా కాంగ్రెస్‌కు దూరంగా ఎందుకుంటున్నారని, రాష్ట్ర పార్టీ నాయకత్వం ఆయనను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించినట్టు వినికిడి. దీనికి ఆ ముఖ్యనేత స్పందిస్తూ.. జీవన్‌రెడ్డి వద్దకు ఓ ప్రతినిధి బృందం వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన వినలేదని చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ ప్రతినిధి బృందంలో ఎవరున్నారని ఆరా తీసిన ఖర్గే.. స్వయంగా మీరే జీవన్‌రెడ్డితో మాట్లాడాల్సిందని, ఎందుకు మాట్లాడలేదని నిలదీయడంతోపాటు పార్టీ అగ్రనాయకత్వం మాట్లాడకపోవడం సరికాదని, సామరస్యపూర్వకంగా పరిష్కరించకపోవడంతో సమస్య పెద్దదైందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సీనియర్ నేత పార్టీని వీడిపోవడం రాష్ట్ర ప్రజలకు, క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు ఇస్తుందని పేర్కొంటూ.. జీవన్‌రెడ్డి నిష్క్రమణను రాష్ట్ర నాయకత్వం చాలా చిన్నదిగా చూసినట్టు కనిపిస్తున్నదని, ఇదే ధోరణి కొనసాగితే వచ్చే రెండున్నరేండ్లలో మరింత మంది పార్టీని వీడుతారని, దీంతో అధికారపార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతాయని హెచ్చరించినట్టు సమాచారం. ఒక్కరు పార్టీని వీడినా ఇబ్బందేనని, పోతేపోనీ అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అనుకుంటే మొదటికే మోసం వస్తుందని .. కీలక నేతలు ఒక్కొరుగా పార్టీని వీడితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని నిలదీసినట్టు వినికిడి. ఖర్గే, రాష్ట్ర ముఖ్యనేతకు మధ్య 10 నిమిషాలపాటు జీవన్‌రెడ్డి అంశమే చర్చకు వచ్చినట్టు తెలిసింది.
పార్టీ సీనియర్లతో ఆచితూచి వ్యవహరించాలని, కాంగ్రెస్‌కు కీలకమైన తెలంగాణలో సీనియర్లను వదులుకోవద్దని ఖర్గే హితవు చెప్పినట్టు సమాచారం. దీనికి ఆ ముఖ్యనేత స్పందిస్తూ జీవన్‌రెడ్డితో మాట్లాడేందుకు పార్టీ ప్రయత్నించడంతో వేం నరేందర్‌రెడ్డికి, సింఘ్వీకి రాజ్యసభ సీట్లు ఇవ్వడంపై ఆయన ప్రశ్నించారని, దీంతో మున్ముందు ఏర్పడే ఖాళీల్లో మీకు కూడా రాజ్యసభ సీటు ఇస్తామని జీవన్‌రెడ్డికి చెప్పామని వివరించినట్టు తెలిసింది. ఖర్గే స్పందిస్తూ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలోనే జీవన్‌రెడ్డికి ఈ మాట చెప్పాల్సిందని, పార్టీ వీడుతానని ప్రకటించిన తర్వాత చెప్పడం అర్థరహితమని పేర్కొన్నట్టు వినికిడి. జీవన్రెడ్డిలాంటి సీనియర్ అసంతృప్తితో ఉన్నప్పుడు పరిస్థితి తీవ్రత గురించి అధిష్టానానికి చెప్పాల్సిందని, అలా రాష్ట్ర పార్టీ నాయకత్వం సరైన సమాచారమిచ్చి జీవన్‌రెడ్డికి రాజ్యసభ సీటు ఇద్దామని ప్రతిపాదిస్తే అధిష్టానం ఎందుకు వద్దంటుందని ఖర్గే ప్రశ్నించినట్టు తెలిసింది.