మంత్రి కొండా సురేఖ అంశంలో అధిష్ఠానం రివర్స్ గేర్ వేసిందా? నమ్మి రాష్ట్రాన్ని చేతిలో పెడితే, పాలనను పకనపెట్టి.. పార్టీ పరువు, ప్రభుత్వ ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుపై ఢిల్లీ పెద్దలు నిప్పులు చెరిగారా? ప్రభుత్వాన్ని సమర్థంగా నడుపలేక, స్వయంకృతాపరాధాలతో రోజుకో సరస్ ఫీట్ చేస్తున్నారంటూ అక్షింతలు వేశారా?
ఇంకా రాజకీయాల్లోకి అడుగు కూడా పెట్టని ఒక యువతిని కూడా మేనేజ్ చేయలేని బలహీన స్థితిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షాలను ఎలా ఎదురొంటాడని నిలదీశారా? సీఎల్పీ కేంద్రంగా సొంత పార్టీ మంత్రిపైనే ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టడంపై ఏఐసీసీ అభ్యంతరం వ్యక్తంచేసిందా? ప్రస్తుతం కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఇది. దీనికి ఏఐసీసీ వర్గాల నుంచి ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖ, ఆమె కుమార్తె సుస్మితాపటేల్పై అధిష్ఠానం సీరియస్ అయిందని, మంత్రి పదవి నుంచి సురేఖను బర్తరఫ్ చేయడం ఖాయమని ప్రభుత్వ అనుకూల మీడియా తెగ ప్రచారం చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్ పర్యటన నుంచి రాగనే కొండా కుటుంబంపై కొరఢా ఝుళిపిస్తారంటూ వార్తలు, వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కానీ, ఇదంతా ఉత్తి ప్రచారమేనని, కొండా సురేఖ అంశంలో అధిష్ఠానం రివర్స్‌లో స్పందించి షాక్ ఇచ్చిందని అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయాల్లోకి ఇంకా అడుగుపెట్టని ఒక యువతి చేసిన విమర్శను, విసిరిన చిన్నపాటి సవాల్‌ను మేనేజ్ చేయలేని నాయకత్వం, భవిష్యత్తులో ప్రధాన ప్రతిపక్షాలను ఎలా ఎదురొంటుందని ఏఐసీసీ అగ్రనేత తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిషరించడంలో, సీనియర్లను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ప్రజలు ఎంతో విశ్వాసంతో అధికారాన్ని అప్పగిస్తే, పాలనపై పట్టు సాధించకుండా రోజుకో సర్కస్ ఫీట్‌తో ప్రభుత్వం పరువు తీస్తున్నారని సీరియస్ అయినట్టు చెప్తున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సమన్వయంపై దృష్టి సారించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సదరు అగ్రనేత స్పష్టం చేసినట్టు తెలిసింది.
సీఎల్పీ కార్యాలయంలో కొందరు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించి, మంత్రి కొండా సురేఖపై బహిరంగంగా విమర్శలు చేయడంపై ఏఐసీసీ పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసినట్టు సమాచారం. సొంత ప్రభుత్వంలోని బీసీ మంత్రి, పైగా మహిళను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయడం, దీనికి సీఎల్పీ ప్రాంగణాన్ని వేదికగా చేసుకోవడం పార్టీ పెద్దలకు ఏమాత్రం మింగుడు పడలేదని చెప్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సామాజిక న్యాయం, కులగణన, జనగణనతోనే న్యాయం జరుగుతుందని, బీసీ, బహుజన వర్గాలకు అధిక ప్రాధాన్యత కల్పించాలనే ప్రధాన ఎజెండాతో దేశవ్యాప్తంగా ముందుకు సాగుతున్న వేళ.. పార్టీ ఎమ్మెల్యేల చేష్టలు ఇబ్బందికరంగా మారాయని ఏఐసీసీ అగ్రనేత మండిపడినట్టు తెలిసింది. ‘బీసీల ఆత్మగౌరవం, మహిళా సాధికారత’ అనేవి కాంగ్రెస్ ప్రధాన ఎజెండా అనే విషయం మీకు తెలుసా? అని నిలదీసినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో, ఒక బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మహిళా నాయకురాలిని పదవి నుంచి తప్పిస్తే జాతీయస్థాయిలో ఎలాంటి సంకేతాలు వెళ్తాయో ఊహించారా? అని నిలదీసినట్టు చర్చ జరుగుతున్నది. మీ గ్రూపు రాజకీయాల కోసం రాహుల్‌గాంధీ సామాజిక ఎజెండాకు తూట్లు పొడిచేలా, బీసీ మహిళా నాయకత్వాన్ని అణగదొకే ప్రయత్నం చేస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల ప్రెస్‌మీట్ జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చిందని, ప్రతిపక్షాలకు అనవసరంగా అస్త్రాలు అందించినట్లయిందని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
ఈ వివాదంలో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ వంటి కఠినచర్యలు అవసరంలేదని ఢిల్లీ పెద్దలు స్పష్టంచేసినట్టు చెప్తున్నారు. ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ కుమార్తె సుస్మిత క్షమాపణ చెప్తే సరిపోతుందని సూచించినట్టు సమాచారం. కూతురు తరఫున కొండా సురేఖ క్షమాపణ చెప్పినా వివాదానికి ముగింపు పలుకాలని రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మిగిలింది పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించినట్టు తెలిసింది. తెలంగాణలో జరుగుతున్న తాజా వ్యవహారాలపై నివేదిక ఇవ్వాలని ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షీనటరాజన్ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆదేశించించినట్టు తెలిసింది. దీంతో ఆమె కొండా సురేఖ కుమార్తె చేసిన విమర్శలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సుస్మిత ఏం మాట్లాడారు? సురేఖ టీపీసీసీకి ఏమని వివరణ ఇచ్చారు? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు సీఎల్పీ వేదికగా మీడియా సమావేశం నిర్వహించారు? సొంత పార్టీ మంత్రిని బర్తరఫ్ చేయాలనే డిమాండ్ వెనుక కారణం ఏమిటి? తదితర అంశాల్లో సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత, ఆయనతో సమావేశమవుతారని చెప్తున్నారు. సురేఖ, ఆమె కూతురు ఎపిసోడ్లో సీఎం అభిప్రాయం కూడా తీసుకుంటారని అంటున్నారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ మంత్రుల అభిప్రాయాలను తీసుకొని, ఆ తరువాత తుది నివేదికను సిద్ధం చేస్తారని చెప్తున్నారు.