న్యూఢిల్లీ : కృత్రిమ మేధ(ఏఐ) పనుల కోసం భారీ స్థాయి డాటా సెంటర్ల అభివృద్ధికి సంబంధించిన నగదు కొరతతో సతమవుతున్న తరుణంలో టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ తాను రూపొందించిన ప్రణాళికలో భాగంగా ఉద్యోగ కోతల పరిధిని పెంచింది. ఒరాకిల్ స్టాక్‌లో సుమారు 40 శాతం వాటాను కలిగి ఉన్న చైర్మన్ ఎల్లిసన్ కోసం కొత్త షేర్ ట్రేడింగ్ కార్యక్రమాన్ని కూడా కంపెనీ ప్రకటించింది. జూన్ 22న ఆమోదించిన ఈ ప్రణాళిక ప్రకారం అక్టోబర్ 24 వరకు 5 కోట్ల షేర్లను విక్రయించడానికి ఎల్లిసన్‌కు అనుమతి ఉందని ఒక నియంత్రణ సంస్థ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.
జూన్ 22న ఈ షేర్లు 175.07 డాలర్ల(రూ.16,728) వద్ద(అంటే 5 కోట్ల షేర్లకు 875 కోట్ల డాలర్ల విలువతో) ముగిశాయి. కంపెనీ 2026 పునర్వ్యవస్థీకరణ ప్రణాళికగా పేర్కొన్న ఒరాకిల్ ఉద్యోగాల కోతకు సంబంధించిన వ్యయం ఇప్పుడు సుమారు 280 కోట్ల డాలర్లు అంచనా వేసింది. ఇందులో ప్రధాన భాగం తొలగించిన ఉద్యోగులకు చెల్లించే పరిహారం రూపంలో ఉంది. ఈ ప్రణాళికకు సంబంధించి ఒరాకిల్ ఇప్పటికే సుమారు 210 కోట్ల డాలర్ల ఖర్చును భరించింది. ఇందులో పెరిగిన 70 కోట్ల డాలర్ల(రూ.6,688 కోట్లు) మొత్తం తాము చేపట్టాలని భావిస్తున్న అదనపు చర్యలను సూచిస్తుందని కంపెనీ పేర్కొంది.