Road accident : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. రహదారిపై ఆగి ఉన్న ఒక ట్రక్కును కారు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లంతా టెన్నిస్ క్రీడాకారులు (Tennis Players) గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అయోధ్య పరిధిలోని 97.500 మైలురాయి వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లక్నోలో నిర్వహించిన ఒక టెన్నిస్ ఈవెంట్లో పాల్గొన్న ఆరుగురు యువకులు తిరిగి దేవరియాకు కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం ధాటికి కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. వాహనంలో చిక్కుకున్న వారిని యూపీఈఐడీఏ భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు అతికష్టం మీద వెలికితీశారు.
ఈ ఘటనలో దేవరియాకు చెందిన నిత్యా ప్రజాపతి (22), ఇర్ఫాన్ అన్సారీ (20), అనికేత్ (24) మృతి చెందారు. ఆనంద్ యాదవ్ (23), రాజు (22), జయంత్ శర్మ (30) తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అయోధ్యలోని దర్శన్ నగర్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో తామందరం నిద్రలో ఉన్నామని, అసలేం జరిగిందో కూడా తెలియలేదని గాయపడిన జయంత్ పోలీసులకు చెప్పాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.