కోదాడ : కాంగ్రెస్ ప్రభుత్వం ఈఆర్సీ ద్వారా ట్రూ యాప్‌తో రూ. 5,400 కోట్ల విద్యుత్ భారం ( Electricity Charges ) ప్రజలపై మోపేందుకు సిద్ధమవుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ( Bollam Mallaiah Yadav ) ఆరోపించారు. బుధవారం కోదాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడారు.
ప్రస్తుత కరువు కాలంలో సాగునీరు, కరెంటు, యూరియా, రైతుబంధు లేక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జనరేటర్లు లేకుండా, రెప్పపాటు అంతరాయం లేకుండా 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించిందని గుర్తు చేశారు. నేడు రైతులు తమ పంటను కాపాడుకోవడానికి రోజుకు వేల రూపాయలు ఖర్చు చేసి డీజిల్ పోసుకోవాల్సిన దుస్థితి దాపురించిందన్నారు.
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచితం అని చెప్పి, 201 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టించుకుంటూ సామాన్యులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బంది పెడితే ఏం జరుగుతుందో గతంలో బషీర్ బాగ్ వద్ద జరిగిన పోరాటాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పెంచిన బిల్లులను వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, కనీసం సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు మంచినీళ్ల బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించలేకపోయిందని విమర్శించారు.
కోదాడ ప్రభుత్వ పాఠశాలలో 600 మంది పిల్లలకు కనీసం వంటగది కూడా నిర్మించలేక పోయారని విమర్శించారు. కల్యాణలక్ష్మి, పెన్షన్లు వంటి పథకాలను ప్రభుత్వం అటకెక్కిం చిందని ఆరోపించారు. హిట్లర్ తరహాలో పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు నయీమ్, తొగరు రమేష్, సుంకర అజయ్ కుమార్, భూపాల్ రెడ్డి, జానకి, రామాచారి, నర్సిరెడ్డి, బత్తుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.