హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎన్నికల షెడ్యూల్‌కు ముందు సీఎం రేవంత్‌రెడ్డిని బీహార్ మొత్తం తిప్పుతూ ప్రచారం చేయించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇప్పుడు తత్వం బోధపడినట్టున్నది. ఆయన ద్వారా నష్టమే తప్ప.. పార్టీకి లాభం లేదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. అందుకే ఆయనను షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం నుంచి తప్పించింది. తాజాగా ప్రచారం కోసం పార్టీ తరఫున ఖరారు చేసిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సీఎం రేవంత్‌రెడ్డి పేరు చేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ నుంచి కనీసం ఒక్క మంత్రికి, ఎమ్మెల్యేకు, ఎంపీకి కూడా చోటు కల్పించలేదు.
మొత్తం 40 మందితో క్యాంపెయినర్ల జాబితా విడుదల చేయగా ఇందులో తెలంగాణ నుంచి ఒక్కరూ లేకపోవడంపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. మొదట సీఎం రేవంత్‌రెడ్డి పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పక్కాగా ఉంటుందనే ప్రచారం జరిగింది. ఇద్దరు, ముగ్గురు మంత్రుల పేర్లు కూడా ఉండొచ్చనే చర్చ జరిగింది. అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి సీఎం, ఇతర మంత్రులు వచ్చి ఇక్కడ అమలు చేస్తున్న పథకాలు, ఇతర సంక్షేమ పథకాల గురించి చెప్తే బీహార్ ప్రజల్లో పార్టీకి మైలేజ్ పెరుగుతుందని భావించారు. కానీ అది కాస్తా బెడిసికొట్టినట్టు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డి గత నెలలో బీహార్‌లో పలుమార్లు పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన గతంలో బీహార్ కూలీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ‘బీహార్ ప్రజల డీఎన్ఏలోనే కూలీ ఉన్నది’ అంటూ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. బీహార్ ప్రజలు కూలీలు అనే అర్థం వచ్చేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా మండిపడ్డారు. బీహార్ ప్రజలను కూలీలంటూ అవమానించిన రేవంత్‌రెడ్డిని బీహార్ నుంచి తరిమి కొడతామని, తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితి వచ్చినట్టయింది.
ఆ వ్యాఖ్యలతో చాలా డ్యామేజ్ అయిందని, ప్రజలు కాంగ్రెస్‌ను దోషిగా చూస్తున్నారని అక్కడి పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకోడానికి అక్కడి నేతలు, అధిష్ఠానం పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి బీహార్‌కు వచ్చి ప్రచారం చేస్తే పార్టీకి మరింత నష్టం తప్పదనే ఆందోళనలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్టు తెలిసింది. తేనె తుట్టను తట్టి లేపినట్టవుతుందని భావించినట్టుగా తెలిసింది. అందుకే మళ్లీ తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఇతర నేతలు ఎవరు వచ్చినా అది పార్టీకి నష్టమే తప్ప ఏ మాత్రం లాభం ఉండదని అధిష్ఠానం పెద్దలు స్పష్టతతో ఉన్నట్టుగా సమాచారం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తప్పించినట్టుగా చర్చ జరుగుతున్నది.
బీహార్‌తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. బీహార్‌ను వదిలిపెట్టి.. జూబ్లీహిల్స్ ఎన్నికపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్టు తెలిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం జూబ్లీహిల్స్ ఎన్నికలపై అంతర్గత సర్వేలు చేయించినట్టుగా తెలిసింది. ఈ సర్వేలన్నింటిలోనూ కాంగ్రెస్ ఓడిపోతుందనే రిపోర్ట్ వచ్చినట్టు సమాచారం. దీంతో అలర్ట్ అయిన అధిష్ఠానం ఇక్కడి నేతలను హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘బీహార్ సంగతి తర్వాత.. ముందు మీ రాష్ట్రంలోని ఉప ఎన్నికల్లో ఓడిపోకుండా చూసుకోండి’ అని హెచ్చరించినట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో పీకల్లోతూ వ్యతిరేకత ఉన్నదని, దీనికి తోడు జూబ్లీహిల్స్ ఓడిపోతే ప్రజా వ్యతిరేకత మరింత తీవ్రమవుతుందని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇదే జరిగితే ప్రభుత్వానికి కూడా తీవ్ర ఇబ్బందేనని తేల్చి చెప్పినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో బీహార్ కాకుండా జూబ్లీహిల్స్ సంగతి చూసుకోండని చెప్పడంతో సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ ప్రచారాన్ని మానుకొని జూబ్లీహిల్స్‌పై దృష్టి పెట్టినట్టు చర్చ నడుస్తున్నది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్‌లో మకాం వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాలికి బలపం కట్టుకొని జూబ్లీహిల్స్ మొత్తం తిరిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 31 నుంచి ఆరు రోజుల పాటు ఒక్క నియోజవర్గంలోనే పలు రోడ్ షోలు, సభలకు షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఒక్క నియోజకవర్గ ఉప ఎన్నికలో ఆరు రోజుల పాటు 10 రోడ్ షోలు, సభలు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.