HCU | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలిలో ప్రకృతి హననం కారణంగా జరిగిన డ్యామేజీని పూడ్చుకునేందుకు కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెరలేపింది. హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భారీగా చెట్లను కొట్టివేయడంపై, వణ్యప్రాణులకు ఆవాసం లేకుండా చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ దీనిపై స్పందించాలని పలువురు సెలబ్రిటీలు సహా సామాన్యులు సోషల్‌మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ముంబై మెట్రో రైల్ విస్తరణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్ తదితర కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నచోట పర్యావరణ విధ్వంసంపై వెంటనే స్పందించే రాహుల్‌గాంధీ.. సొంత పార్టీ సర్కారు చేస్తున్న ప్రకృతి హననంపై ఎందుకు స్పందించరని కొద్దిరోజులుగా విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ తనదైన శైలిలో డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు. హెచ్‌సీయూలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం జరిపిన విధ్వంసం, బుల్డోజర్ రాజ్‌పై స్పందించకుండానే.. హెచ్‌సీయూ ప్రస్తావన తీసుకొచ్చారు. తద్వారా కంచ గచ్చిబౌలి అంశాన్ని పక్కదారి పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ ఓ లేఖ రాశారు. తెలంగాణలో ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని రాహుల్‌గాంధీ ఆ లేఖలో కోరారు. హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ, దర్శన్ సోలంకి వంటి మంచి భవిష్యత్తు ఉన్న యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించారని ఆ లేఖలో పేర్కొన్నారు.
అలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో యువత బలవన్మరణాలను ఆపేందుకు కొత్త చట్టం తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. అంబేద్కర్, రోహిత్ వేములతోపాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కొకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని రూపొందించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’ వేదికగా రాహుల్‌గాంధీ లేఖను విడుదల చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి లేఖ రాసిన తర్వాత, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ‘రోహిత్ వేముల చట్టం’ తీసుకురావాలని కోరుతూ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో రాహుల్‌గాంధీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దశాబ్దం క్రితం జరిగిన అంశంపై మళ్లీ స్పందించే రాహుల్‌గాంధీ.. తాజాగా రేవంత్‌రెడ్డి సర్కారు చేసిన పర్యావరణ విధ్వంసంపై ఎందుకు స్పందించడం లేదని విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో ఒకలా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాల్లో మరోలా స్పందించడం ఏమిటని నిలదీస్తున్నారు.
రాహుల్‌గాంధీ రాసిన లేఖపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. విదేశీ పర్యటన నుంచి సీఎం తిరిగొచ్చాక రోహిత్ చట్టంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కాగా, 2016లో హెచ్‌సీయూలో చదువుతున్న రోహిత్ వేముల కుల వివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిన విషయం తెలిసిందే.