హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ప్రతీ పార్లమెంట్ పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని తీర్మానం చేసిన కాంగ్రెస్ దానిని అమలు చేయకపోవడం సిగ్గుచేటని, ఆ పార్టీని బీసీలు ఎట్ల నమ్ముతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ ప్రశ్నించారు. 55 మంది అభ్యర్థులతో తొలిజాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. రెడ్లకు 17 సీట్లు, వెలమలకు 7 సీట్లు, మొత్తం అగ్రకులాలకు 26 సీట్లు కేటాయించి, బీసీలకు మాత్రం 12 సీట్లు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు టికెట్లు ఇస్తామని ఉదరగొట్టి ఇప్పుడు దగా చేసిందని, దీంతో కాంగ్రెస్ కథ కంచికేనని, ఓటమి తప్పదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో ఉండి జెండా మోసిన బీసీలను కాదని, డబ్బు సంచులున్న వాళ్లకు, పార్టీ మారిన వాళ్లకు టికెట్లు ఇచ్చి బీసీ నేతలకు మొండిచేయి చూపారని ధ్వజమెత్తారు. మిగతా సీట్లలోనైనా ఓడిపోయే పాత బస్తీ లాంటి స్థానాలు కాకుండా గెలిచే స్థానాల టికెట్లు ఇవ్వాలని కోరారు.