Congress Govt | హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో అన్ని వర్గాలకు అరచేతిలో వైకుంఠం చూపినట్టుగా కాంగ్రెస్ బీసీలకు కూడా ఆశలు చూపింది. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ నమ్మబలికింది. కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. కానీ అధికారం దక్కించుకున్న తర్వాత అన్ని డిక్లరేషన్ల లాగానే బీసీ డిక్లరేషన్ అడ్రస్ కూడా గల్లంతయింది. హామీని నెరవేర్చడంలో చిత్తశుద్ధి చూపకుండా ఉన్న రిజర్వేషన్లకే కోత పెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు పన్నింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయకుండా పాతర వేసేలా తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. రిజర్వేషన్ల స్థిరీకరణకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నయవంచక రేవంత్ రెడ్డి సర్కారు కుయుక్తులను గ్రహించిన బీసీ సంఘాల పెద్దలు, మేధావులు ఇలాంటి ఆటలు సాగనివ్వమని గళమెత్తుతున్నారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసేంత వరకు అవిశ్రాంత పోరాటం చేస్తామని తేల్చిచెబుతున్నారు.
కడుపులో కత్తులు& కంటితుడుపు చర్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు గల్లంతు చేసేందుకు రేవంత్ సర్కారు ఎత్తులు వేసింది. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ బాధ్యతలను రాష్ట్ర బీసీ కమిషన్‌కు అప్పగించడం ఇందుకు నిదర్శనం. ఇందులో దాగి ఉన్న కుట్ర బహిర్గతమవుతున్నది. సుప్రీం కోర్టు తీర్పులు, వివిధ రాష్ర్టాల ప్రభుత్వాల అనుభవాలు చూస్తుంటే కాంగ్రెస్ సర్కారు కడుపులో కత్తులు పెట్టుకుని పైకి కంటి తుడుపు చర్యలు చేపడుతున్నదని అర్థం చేసుకోవచ్చు. వాస్తవంగా బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అనేది బీసీ కమిషన్‌తో సాధ్యం కాదు. ఇందుకోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ కాం గ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వక అజ్ఞానాన్ని, అవగాహన రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నది. బీసీల రిజర్వేషన్లకు అసలుకే ఎసరు తేవడమే అసలు కుట్ర.
బీసీ కమిషన్.. డెడికేటెడ్ కమిషన్ వేర్వేరు
బీసీ స్థితిగతులపై మండల్ కమిషన్ పలు సిఫారసులను చేసింది. ఇందులో ముఖ్యమైంది బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 27శాతం రిజర్వేషన్ల అమలు. సిఫారసు అమలులో కోసం బీసీ కులాల జాబితాల్లో కులాల చేరిక, తొలగింపు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయస్థాయిలో 1993లో బీసీ కమిషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిం ది. ఆ చట్టాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు యథాతథంగా అమలు చేసేందుకు చట్టాలను రూపొందించుకున్నాయి. అయితే బీసీ కమిషన్ చట్టంలో ఎక్కడా కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించి ప్రస్తావన లేదు. చట్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోని కొన్ని రాష్ర్టాలు అసెంబ్లీల్లో తప్పటడుగులు వేసి, న్యాయస్థానాల్లో చతికిలపడ్డాయి
చట్టాన్ని అర్థం చేసుకోలేక&
కర్నాటక రాష్ట్ర సర్కారు స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించిన రిజర్వేషన్లను కేఈ కృష్ణమూర్తి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సుప్రీం కోర్టు ట్రిపుల్ టీ పేరిట మార్గదర్శకాలు జారీ చేసింది. కేవలం రిజర్వేషన్ల స్థిరీకరణకు స్వతంత్ర, డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆ కమిషనే గ్రామస్థాయిలో డాటా సేకరించి, సూక్ష్మ, సమగ్ర అధ్యయనం చేసి రిజర్వేషన్లను నిర్ణయించాలని తేల్చిచెప్పింది. ఇక మహారాష్ట్ర కూడా ఇలాగే తప్పటడుగు వేసింది. డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయకుండా 2021లో ఆ రాష్ట్ర బీసీ కమిషన్ చట్టంలో మార్పులు చేసింది. రాజకీయ రిజర్వేషన్ల స్థిరీకరణ కోసం సర్వే అధికారాలను కల్పిస్తూ సవరణలు చేసుకుంది. ఈ మేరకు 2022లో మహారాష్ట్ర బీసీ కమిషన్ రిజర్వేషన్ల స్థిరీకరణ రిపోర్టును ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. కానీ మహారాష్ట్రకు చెందిన పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు సైతం మహారాష్ట్ర సర్కారు సమర్పించిన నివేదిక చెల్లబోదంటూ తేల్చిచెప్పింది.
అసలుకే ఎసరు పెట్టేందుకు సర్కారు కుట్ర
రాజ్యాంగపరమైన హక్కులు ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లను కల్పిస్తున్నారు. ఆర్టికల్ 243డీ నుంచి డీ (5), ఆర్టికల్ 243 టీ(1) నుంచి ఆర్టికల్ టీ (5) పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను నిర్దేశిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అధికారాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పిస్తూ ఆర్టికల్ 243 డీ (6)కింద పొందుపరిచింది. అయితే ఒక్కో రాష్ట్రం ఒక్కో తీరుగా బీసీ వర్గాలకు రిజర్వేషన్లకు కల్పిస్తుండడంపై దేశవ్యాప్తంగా ఏకరూపకంగా అమలు చేసేందుకు సుప్రీంకోర్టు ట్రిపుల్ టీ పేరిట మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో భాగంగానే బీసీలకు స్థానికసంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ల కల్పనకు డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటును తప్పనిసరిచేస్తూ, మార్గదర్శకాలను జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ కలుపుకుని మొత్తంగా 50శాతం మించకూడదనే సీలింగ్‌ను సైతం విధించింది. సూటిగా చెప్పాలంటే డెడికేటెడ్ కమిషన్ సిఫారసులు లేకుండా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్లను అనేవి ఉండబోవు. బీసీ కోటా మొత్తాన్ని కూడా జనరల్ స్థానాలుగానే పరిగణించి ఎన్నికలను నిర్వహిస్తారు. గుజరాత్ రాష్ర్టానికి గతంలో సుప్రీంకోర్టు ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది. న్యాయకోవిదులు, బీసీ మేధావులు ఇంత స్పష్టంగా నొక్కిచెబుతున్నా కూడా కాంగ్రెస్ సర్కారు అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నది.
కులగణనపై పబ్లిక్ జ్యూరీ ప్యానెల్
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కులగణన అంశంపై విస్తృతంగా చర్చించేందుకు, మేధావులు, న్యాయకోవిదులతో మేధోమథనం సాగించేందుకు పబ్లిక్ జ్యూరి ప్యానెల్‌ను ఏర్పాటు చేసినట్లు పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సెస్, తెలంగాణ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్యానల్లో జస్టిస్ బీ చంద్రకుమార్, బీసీ కమిషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు ఉన్నట్లు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌కు బీసీ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశాయి.