Panchayat Elections | కరీంనగర్/హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరిలోగా జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొన్నది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని గతంలోనే సుప్రీం కోర్టు తీర్పు నిచ్చింది. ఈ విషయంపై వివిధ రాష్ర్టాల్లో తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనం నిర్వహించింది. కానీ ఇంకా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరగాలంటే బీసీ కమిషన్ నివేదిక తప్పనిసరి. అలాగే, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ ప్రకారం చూసినా.. ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న బీసీ రిజర్వేసన్ 23 శాతం నుంచి 42 శాతానికి పెంచి సంబంధిత వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతామని ఆ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది. అది జరగాలంటే.. బీసీ కులగణన అయినా చేయాలి? లేదా ఓటర్ల ఆధారంగా కులగణన చేస్తే తప్ప సర్పంచ్ ఎన్నికలు సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఈ పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొన్నది. పంచాయతీ ఎన్నికలను 2019 జనవరిలో వివిధ దశల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం 2024 ఫిబ్రవరి ఒకటితో ప్రస్తుత సర్పంచులతోపాటు పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం పూర్తవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(3)(ఏ) ప్రకారం పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలను ఐదేండ్ల పదవీ కాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి మూడు నెలల్లోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది.
2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50 శాతం దాటవద్దని చెప్పింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను అప్పటి పంచాయతీ రాజ్ అధికారులు ఖరారు చేశారు. అప్పు డు బీసీలకు 22.79 శాతం, ఎస్సీలకు 20.53 శాతం, ఎస్టీలకు 6.68 శాతం చొప్పున రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. అయితే చాలా రాష్ర్టాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చారు. దీనిపై సుప్రీం కోర్టు ట్రిపుల్ టీ ఆదేశాలిచ్చింది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ డెడికేటడ్ కమిషన్ (మన రాష్ట్రంలో బీసీ కమిషన్) నియమించా లి. సదరు కమిషన్ పూర్తి అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించొద్దు. ఈ ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర బీసీ కమిషన్ వకుళాభరణం కృష్ణ మోహన్రావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు.
ఈ కమిషన్ కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడులో పర్యటించి స్థానిక సంస్థల రిజర్వేషన్లను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ర్టాల్లో బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేశారు. మరికొన్ని రాష్ర్టాల్లో ఓటరు జాబితా ఆధారంగా బీసీల సంఖ్యను గుర్తించి రిజర్వేషన్లు కల్పించారు. కమిషన్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించింది. ఈ లోగా ఎన్నికల కోడ్ రావడంతో పక్రియ ఆగిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలంటే.. ఇంటింటా తిరిగి కులగణన చేయాలి. ఇలా చేయాలంటే కనీసం రెండు మూడు నెలలైనా పడుతుంది. లేదా ఓటరు జాబితా ఆధారంగా కులగణన చేయాల్సి ఉంటుంది. కులగణన కన్నా ఓటర్ జాబితా ఆధారంగా చేయడానికి కొంత సమయం తక్కువ పడుతుంది. రెండు పద్ధతుల్లో ఏదో ఒక దానికి ప్రభుత్వం ఆమోద ముద్రవేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత సదరు గణాంకాలను బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. వాటి ప్రాతిపదికగా మాత్రమే బీసీ రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సర్పంచ్ ఎన్నికలు జరగాలంటే మరో ట్విస్టు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చింది. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని పేర్కొన్నది. తద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడమేకాకుండా.. బీసీ ఉపకులాలవారీగా వర్గీకరణ చేసి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పింది.
కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే.. కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది. అది ఇంటింటా కులగణన చేస్తారా? లేదా ఓటరు జాబితా ఆధారంగా చేస్తారా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉన్నది. ఏరకంగా చూసినా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తేలాలంటే.. కులగణన తప్పనిసరిగా జరగాల్సిందే. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే కనీసం నాలుగు నెలలైనా పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఏప్రిల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే అధికార యంత్రాంగం పనులు మొదలుపెట్టింది. ఈ పరిస్థితుల్లో బీసీ కులగనన జరుగుతుందా? లేదా? అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలొప్పుడొచ్చినా సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ఎస్ఈసీ ఇటీవలే ఆదేశించింది. వచ్చే ఫిబ్రవరి ఒకటితో పంచాయతీ పాలకవర్గాల గడువు పూర్తవుతున్న నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఎస్ఈసీ ఈ నెల 4న అన్ని జిల్లా కలెక్టర్లకు (లెటర్ నంబర్ 921/టీఎస్ఇసీ-పీఆర్/2023) ఆదేశాలు జారీచేసింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో..? వారికి తగ్గట్టుగా ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను నియమించాలో నిర్దేశిస్తూ, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని నియమించడంతోపాటు పంచాయతీ ఎన్నికల కోసం సదరు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించింది.