హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): బీజేపీ మైనార్టీ వ్యతిరేక చర్యలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నదని పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 48 గంటల్లో పడగొడతామన్న కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, బీజేపీ నేతల వ్యాఖ్యలు చూసి తెలంగాణ సమాజం విస్తుపోతున్నదని చెప్పారు.
కాంగ్రెస్‌లోకి ఎవరినీ బలవంతంగా తీసుకోవడం లేదని, తెలంగాణ పునర్నిర్మాణం కోసమే వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నట్టు తెలిపారు. కర్ణాటకలో బీజేపీకి పట్టిన గతే తెలంగాణలోనూ పడుతుందని హెచ్చరించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో లక్షల కోట్లు వృథా చేశారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏక్‌నాథ్‌షిండే అనడం విడ్డూరమన్న ఆయన.. తెలంగాణ కోసం పదవిని వదులుకున్న వ్యక్తి కోమటిరెడ్డి అని ప్రశంసించారు.