Harish Rao | సంగారెడ్డి, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రైతుబంధును విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్‌రెడ్డి తాజాగా రైతుభరోసాకు కోతలుపెట్టేందుకు రాత్రింబవళ్లు కుస్తీలు పడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుభరోసా కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పడమంటే రైతులను అవమానించడమేనని, అందరికీ అన్నం పెట్టే రైతులకు షరతులు పెడ్తరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి మూడుసార్లు రైతుబంధు ఎందుకు ఇవ్వరని గతంలో అడిగిన రేవంత్‌కు ఇప్పుడు మతిమరుపు వచ్చినట్టున్నదని, ప్రతిపక్షంలో నాలుకకు నరం లేనట్టే మాట్లాడిన రేవంత్, ఇప్పుడు మాట మారుస్తున్నారని ఎద్దేవాచేశారు. 11 విడతల్లో రూ.73 వేల కోట్ల రైతుబంధును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి దరఖాస్తు లేకుండా ఇచ్చిందని గుర్తుచేశారు. తమ చుట్టూ రైతులు తిరగాలని ఈ ప్రభుత్వం చూస్తున్నదని, రైతులను మళ్లీ పైరవీకారుల చుట్టూ తిరిగించేలా చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లాలో హరీశ్ బుధవారం పర్యటించారు. న్యాల్కల్ మండలం రేజింతల్ సిద్ధివినాయక ఆలయ జాతర వేడుకలు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. సదాశివపేటలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్య ప్ప పడిపూజకు హాజరయ్యారు. అనంతరం సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
భరోసాలో కోతలకు కుట్ర
ఒక్కసారి రైతుభరోసా ఇచ్చేందుకు కూడా రేవంత్ అపసోపాలు పడుతున్నారని హరీశ్ ఎద్దేవాచేశారు. భరోసాపై 4న క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్తూనే షరతులు విధించి పరిమిత సంఖ్యలో రైతులకు వర్తింపజేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని చూస్తుండటం దారుణమని, బడా పారిశ్రామికవేత్తలు, కంపెనీల వేలకోట్ల అప్పు ను రైటాఫ్ చేస్తున్న సర్కార్, రైతుల వద్దకు వచ్చేసరికి షరతులు పెట్టడం ఏమిటని నిలదీశారు. రైతులకు బేడీలు వేసి అవమానించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతుభరోసా విషయంలో రైతులను నేరస్తులుగా చూడటం దా రుణమని నిప్పులుచెరిగారు. రైతుభరోసాకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడమంటే తిరిగి రైతులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ, పైరవీకారుల చుట్టూ తిప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక్కసారికే ఇస్తమంటే కుదరదు..
‘పదెకరాలు ఉంటే రైతుభరోసా ఇవ్వం.. ఒకే పంటకు ఇస్తం.. సాగుభూమి ఉంటేనే ఇ స్తం.. అని ప్రభుత్వం లీకులు ఇవ్వటం విడ్డూరంగా ఉన్నది. ఏడునెలలు సాగు చేసే పత్తి, పసుపు, అల్లం, చెరుకు, కంది రైతులకు ఒక్కసారికే రైతుభరోసా ఇస్తమంటే కుదరదు’ అని హరీశ్ హెచ్చరించారు. ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పత్తి సాగవుతుందని, 50 లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేసే దళిత, గిరిజన, బీసీ రైతులకు భరోసా ఒక్కసారికే ఇస్తామనడమంటే వారి పొట్టగొట్టడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కేసీఆర్ రైతుబంధును విజయవంతంగా అమలు చేశారని, రైతు గౌరవాన్ని కేసీఆర్ పెంచితే వారిని కాంగ్రె స్ అడుక్కునేలా చేస్తున్నదని ఫైర్ అయ్యారు. వరంగల్ డిక్లరేషన్‌లో పేర్కొన్నవిధంగా రైతులకు, పండ్లతోటలు సా గు చేసే రైతులందరికీ ఏడాదికి రూ.15 వేల రైతుభరోసా ఇవ్వాలన్నారు. పత్తి, కంది, హార్టికల్చర్ రైతులకు అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదని, రైతుభరోసా అందరికీ వర్తింపజేయకుంటే రైతులోకం తిరగబడుతుందని, తర్వాత పర్యవసానాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
వ్యవసాయ కూలీల వడపోత
వ్యవసాయకూలీలకు ఇస్తామన్న రూ.12 వేలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టేందుకు కుట్రలు పన్నుతున్నదని హరీశ్ విమర్శించారు. ఇందులోనూ లబ్ధిదారులను వడపోసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రం లో 1.04 కోట్ల మంది వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇవ్వాల్సిందేని డిమాండ్ చేశారు. ‘వడపోతలు, పరీక్షలతో కూలీలను అవమానిస్తరా? కూలీలకు వెలకడ్తరా? ఇదేం పద్ధతి?’ అని నిలదీశారు.
క్రైమ్‌లో తెలంగాణ ఎల్లోజోన్
కేసీఆర్ పాలనలో పదేండ్ల పాటు క్రైమ్ రేటులో గ్రీన్జోన్లో ఉన్న తెలంగాణ, రేవంత్ ఏడాది పాలనలోనే ఎల్లోజోన్లోకి వెళ్లిందని హరీశ్ మండిపడ్డారు. త్వరలోనే రెడ్‌జోన్‌లోకి వెళ్లే ప్రమాదం కూడా ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దక్షిణాదిరాష్ర్టాల్లో తెలంగాణ ఒక్కటే ఎల్లోజోన్లో ఉన్నదని చెప్పారు. నా డు క్రైమ్ డిటెక్షన్‌లో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు బీహార్ కంటే వెనకబడిందని వాపోయారు. రాష్ట్రంలో క్రైమ్‌రేటు గతేడాది కంటే 23 శాతం పెరిగినట్టు చెప్పారు. లైంగికదాడల కేసులు 29 శాతం, దళితులు, గిరిజనుల మీద లైంగికదాడుల ఘటనలు 12 శాతం పెరిగినట్టు తెలిపారు. కేసీఆర్ హయాం లో తెలంగాణలో క్రైమ్ డిటెక్షన్ ఎక్కువగా ఉండటంతో కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర పోలీసులు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసేవారని గుర్తుచేశారు. దేశానికి గర్వకారణంగా నిలిచిన తెలంగాణ పోలీసులను రేవంత్‌రెడ్డి ప్రభు త్వం రాజకీయ కక్ష సాధింపులకు వినియోగించుకుంటున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో పెట్రోలింగ్ వ్యవస్థ, డయల్ 100 వ్యవస్థ దెబ్బతిన్నదని తెలిపారు. కేసీఆర్‌కు పోలీసు వాహనాలు, పోలీస్టేషన్‌కు నెలనెల రూ.50 వేల అలవెన్స్ ఇచ్చారని గుర్తుచేశారు. రేవంత్ పాలనలో పోలీసుల టీఏ ఏడు రోజులకు తగ్గించారని, సరెండర్ లీవుల డబ్బులు మూడు క్వార్టర్స్వి చెల్లించాల్సి ఉన్నదని, స్టేషన్ అలవెన్సు డబ్బు ల కోసం సెక్రటేరియట్లో పైరవీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, పోలీసులకు హెల్త్ కార్డులపై ప్రైవేట్ హాస్పిటళ్లు చికిత్స చేయటంలేదని, ఈ కార్డులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ కుటుం బం నుంచి వచ్చానని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి ఏక్ పోలీసింగ్‌పై మాటమార్చారని, ఏక్ పోలీసింగ్ అమలు చేయాలని కోరిన టీజీఎస్పీ పోలీసులు పది మందిని డిస్మిస్ చేశారని, 39 మందిని సస్పెండ్ చేశారని ఇది దుర్మార్గమని మండిపడ్డారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, శివకుమార్, కాసాల బుచ్చిరెడ్డి, జైపాల్‌రెడ్డి, పట్నం మాణిక్యం, మందుల వరలక్ష్మి, మఠం భిక్షపతి, శివరాజ్ పాటిల్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలనలో అన్నీ కోతలే
కోతలు తప్ప రైతులకు కాంగ్రెస్ ఇచ్చిందే మీ లేదని హరీశ్ ఎద్దేవాచేశారు. రేవంత్ సర్కా ర్ సగం మంది రైతులకే రుణమాఫీ చేసిందని, పది రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి కేవలం సన్నబియ్యానికే అంటే 5 శాతమే ఇచ్చిందని, రైతుభరోసా అమలులోనూ షరతులు విధించి సగం మందికే వర్తించేలా కుట్ర చేస్తున్నదని, పంటల బీమా పథకాన్ని ఇంకా ప్రారంభించలేదని, వ్యవసాయ పనిముట్లు ఇవ్వలేదని, 24 గంటల కరెంట్ పేరిట 16 గంటలే ఇస్తున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రం విడుదల చేసిన రూ.858 కోట్ల ఈజీఎస్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేటాయింపులు చేయలేదని చెప్పారు.
10 పంటలకు బోనస్ అన్నరు. ఒక్క వరికే అదీ సన్నాలకే ఇస్తమన్నరు. 5 పైసలిచ్చి 95 పైసలు ఎగ్గొట్టిండ్రు. వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టి యాసంగికి షరతులు పెడుతున్నరు. పంటల బీమా గుండుసున్నా.. వ్యవసాయ పనిముట్లు ఇస్తామన్నరు అదీ సున్నా.. పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం ఇస్తామని గాడిద గుడ్డు చేసిండ్రు. 24 గంటల కరెంట్ అని చెప్పి 16 గంటలు కూడా ఇస్తలేరు. రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చిండ్రా?
-హరీశ్‌రావు
వరంగల్ డిక్లరేషన్‌లో చెప్పినట్టు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇవ్వాలి. వానకాలం, యాసంగి పంటలకు కలిపి ఒకేసారి ఎకరానికి రూ.15 వేల చొప్పున అందించాలి. పత్తి, చెరుకు, పసుపు పంటలకు ఒక్కసారికే రైతు భరోసా ఇస్త్తమంటున్నరు. కొండలు, గుట్టలు సాగుచేసే గిరిజన రైతులకు రైతు భరోసా రాదంటున్నరు. గిరిజన రైతులంటే మీకు గిట్టదా? రైతుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాపాడితే, మీరు ఇలా చేయడమేంటి?
-హరీశ్‌రావు
రైతు భరోసా కోసం రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటరట! అబద్ధాలు చెప్తే శిక్షకు సిద్ధమని రాయాల్నట! ఇది అన్యాయం. బడా కంపెనీలు, కార్పొరేట్ వ్యాపారులకు ఎలాంటి షరతులు ఉండవు. వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తరు. అందరికీ అన్నం పెట్టే రైతులకు మాత్రం షరతులు పెడుతున్నరు. ఈ ప్రభుత్వం రైతులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నది? ఇది దారుణం. షరతుల పేరిట రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాలు చేయొద్దు.
-హరీశ్‌రావు