Rythu Bharosa | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. తొలి నుంచి రైతుభరోసా ఆర్థికభారాన్ని తప్పించుకొనేందుకు సాకులు వెతుకుతూనే ఉన్న ఈ ప్రభుత్వం.. రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే చేయించిన వ్యవసాయశాఖ కోత పెట్టే విస్తీర్ణాన్ని కూడా ఖరారు చేసినట్టుగా తెలిసింది. ఈ యాసంగిలోనే దీనికి సిద్ధమవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేవలం పంటలు సాగుచేసిన భూములకే భరోసా ఇవ్వాలని, పంటలు వేయని భూములకు కోత పెట్టాలనే అంశాన్ని సర్కార్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో పంటలు వేయని భూములను లెక్కించేందుకు శాటిలైట్ సర్వేను ఎంచుకొన్నది. ఈ బాధ్యతను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగించింది. అధికారులు తొలుత వివిధ జిల్లాల్లో సర్వేను పూర్తిచేశారు. ఇందులో భాగంగానే 1.12 కోట్ల ఎకరాల్లో శాటిలైట్ సర్వే పూర్తి చేసినట్లు తెలిసింది. 11 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని సర్వేలో గుర్తించిన బృందాలు వ్యవసాయ శాఖకు నివేదిక ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో సాగుచేయని భూములకు రైతుభరోసా ఇవ్వొద్దనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటంతో ఆ భూములకు రైతుభరోసా కోత పెట్టే అవకాశం ఉన్నది.
పెట్టుబడి సాయం కోతకు ఇవీ కారణాలు
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 నుంచి 30 లక్షల ఎకరాల రైతుభరోసా సాయంలో కోత పెట్టే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకు వివిధ కారణాలను చూపుతున్నది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏటా 153 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయంగా రైతుబంధు నగదు పంపిణీ చేసేది. ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ మొన్నటి వానకాలంలో వివిధ సాకులు చూపుతూ 145.73 లక్షల ఎకరాలకే రైతుభరోసా నగదు సాయాన్ని రైతులకు పంపిణీ చేసింది. ఈ యాసంగిలోనూ ఇదే భూమికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే బీఆర్ఎస్ సర్కార్‌తో పోల్చితే కాంగ్రెస్ సర్కార్ ఇక్కడే 7.27 లక్షల ఎకరాలకు కోతపెట్టింది.
శాటిలైట్ సర్వేలో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయలేదని తేల్చింది. ఈ రెండూ కలిపి రైతుభరోసా కోత పెట్టే భూమి విస్తీర్ణం 18.27 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది మొత్తం 145.73 లక్షల ఎకరాల్లో 112 లక్షల ఎకరాల్లోనే శాటిలైట్ సర్వేచేసింది. అంటే ఇంకా సుమారు 34 లక్షల ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉన్నది. ఇందులో కనీసంగా 5 నుంచి 8 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేయలేదని తేల్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ లెక్కన పంటలు సాగులోలేని భూమి 26.27 లక్షలకు పెరుగుతుంది. ఇంకా కోత పెట్టాలనుకుంటే ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిసింది. వివిధ కారణాలు చూపుతూ దానిని 30 లక్షల ఎకరాల వరకు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఆ భూములను మళ్లీ ‘భరోసా’లో చేర్చడంలేదు
బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులోలేని భూములకు రైతుబంధు ఇచ్చిందని, వాటన్నింటినీ తాము ప్రక్షాళన చేస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్పింది. ఆ తర్వాత ఏ డాది క్రితం సాగులోలేని భూములను సర్వే చేయించింది. ఆ నాడు సుమారు 2.5 లక్షల భూమి ఉన్నట్టు గుర్తించారు. ఆ సర్వేలో కొన్నిచోట్ల కేవలం ఆ సీజన్‌కే పంట వేయని భూములను చేర్చినట్టు తెలిసింది. ఆ భూములు పంటలు సాగు చేసుకొనే భూములేనని, జాబితాలో నుంచి తొలగించొద్దంటూ బాధిత రైతులు ప్రభుత్వాన్ని వేడుకొన్నారు.
కానీ ప్రభుత్వం ససేమిరా అన్నది. ఒకవేళ పంటలు సాగుచేస్తే అప్పుడు భరోసా ఇస్తామంటూ సుద్దులు చెప్పింది. ఆ తర్వాత రైతులు ఆ భూముల్లో పంటలు వేసినా ఇప్పటివరకు రైతుభరోసా రావడం లేదు. ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు సర్కార్ ఒప్పుకోవడం లేదు. దీంతో ఇప్పటికీ బాధిత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాగుచేస్తున్న తమ భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి, రైతుభరోసా ఇవ్వాలని కోరుతున్నారు.