హైదరాబాద్, మే1( నమస్తే తెలంగాణ): కేసీఆర్ నిబద్ధత మీద బురద జల్లాలనే కుట్రలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో ఆడిన డ్రామాలన్నీ బెడిసికొట్టడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇక ఢిల్లీలో మరో నాటకానికి తెరలేపాలని నిర్ణయించింది. కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్‌రావుపై తదుపరి చర్యలు తీసుకోరాదని హైకోర్టు తీర్పు చెప్పినప్పటి నుంచి పాలకుల పరిస్థితి తేలు కుట్టిన దొంగలా మారింది. ఇంత దూరం వచ్చాక వదిలేస్తే ప్రజల్లో చులకన అవుతామని, అట్లాగని సుప్రీంకోర్టుకు వెళ్లి ఉన్న ఇజ్జత్ పోగొట్టుకోవడం తప్ప ప్రయోజనం లేదనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది. మధ్యేమార్గంగా బంతిని మోదీ కోర్టులోకి నెట్టివేసి రాజకీయ డ్రామాలకు తెరలేపడం మినహా మరో గత్యంతరం లేదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.
సీబీఐ విచారణ కోసం కేంద్రం మీద ఒత్తిడి తేవాలని, ఇందుకోసం సీబీఐ నుంచి అపాయింట్మెంట్ అందగానే సాగునీటి పారుదల, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో మంత్రులు, ఎంపీలతో ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటుచేసి ఢిల్లీ పంపాలని నిర్ణయించినట్టు తెలిసింది. సీబీఐ డైరెక్టర్‌ను కలిసి ఘోష్ కమిషన్ నివేదిక అందజేయడంతోపాటు ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో కాళేశ్వరం మీద జరిగిన విచారణ నివేదికలు సీబీఐకి అందజేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీంకోర్టు మీద స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే అంశంపై గత నెల 24న జరిగిన క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టుకు వెళ్లాలనుకోవడం తొందరపాటు నిర్ణ యం అవుతుందని అడ్వకేట్ జనరల్ సలహా ఇచ్చినట్టు తెలిసింది. హైకోర్టు తీర్పుతో పూర్తిగా ఇరుక్కపోయామని, అక్కడ కూడా ఇదే తరహా తీర్పు రావచ్చని అభిప్రాయపడినట్టు తెలిసింది. కోర్టులకు వెళ్లడం కంటే బంతిని మోదీ కోర్టులోకి నెట్టేస్తే రాజకీయ నాటకానికి అవకాశం ఉంటుందని మంత్రులు ఆలోచించినట్టు తెలిసింది.
ఢిల్లీ వెళ్లి సీబీఐ విచారణ కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొనిరావాలని అనుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగా సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ అడుగాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిసింది. ఆ మేరకు సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ కోరుతూ సీఎం కార్యాలయం గత వారం లేఖ రాసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నెల రెండో వా రంలో సీబీఐ నుంచి సమాధానం వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.
గత నెలలో ఢిల్లీ వెళ్లిన నీటిపారుదల శాఖ మంత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్‌తోపాటు కేంద్ర హోంశాఖ అధికారులనూ కలసినట్టుగా చెప్తున్నారు. ఈ సందర్భంగానే కాళేశ్వరంపై సీబీఐ విచారించాలనే అంశం చర్చకు వచ్చినట్టు తెలిసింది. దీనిపై ‘కాళేశ్వరంపై ఎంత మొత్తంలో అవినీతి జరిగింది? గతంలో మీరు పంపిన ఫిర్యాదులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కానీ, ఘోష్ కమిషన్ నివేదిక మాత్రం అంతా కలిసి రూ.7,500 కోట్లు మాత్రమే వృథా అయినట్టు నివేదించింది’ దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర హోం శాఖ కోరినట్టు తెలిసింది. ఆ అభ్యంతరాలనే సీబీఐ కూడా అడిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ప్రాథమిక వివరాలతో కూడిన నివేకలు పంపాలని గతంలోనే సీబీఐ కోరినట్టు సమాచారం.
తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నట్టు తెలిసింది. తాను నేరుగా వెళ్తే ఒత్తిడి పెరుగుతుందని, సీబీఐ అనివార్యంగా విచారణకు అంగీకరిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నట్టు సమాచారం. సీఎం ప్రతిపాదన పట్ల నీటిపారుదల శాఖ మంత్రి అభ్యంతరం వ్యక్తంచేశారని తెలిసింది. మనం ఊహించినంతగా సీబీఐలో జరుగదని, సీఎం స్థాయిలో ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలిసిన తరువాత కూడ వారు స్పందించకపోతే ఉన్న పరువు పోతుందని సదరు మంత్రి తేల్చి చెప్పినట్టు తెలిసింది. దీంతో రేవంత్‌రెడ్డి వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఆయన బదులుగా మంత్రులు, ఎంపీలు, సాగునీటి, న్యాయశాఖ అధికారులను ఢిల్లీకి పంపించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించడం, పీసీ ఘోష్ కమిషన్‌ను వేయడం కేవలం కక్ష సాధింపు చర్యలో భాగమేనని, ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో ఇరకాటంలో పడ్డ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో నాటకానికి తెర లేపిందని ‘నమస్తే తెలంగాణ’ ముందే పసిగట్టి చెప్పింది. ఈ నెల 23న జరిగిన క్యాబినెట్ సమావేశంలోనే ఢిల్లీ రాజకీయ నాటకానికి తెరలేపి రక్తి కట్టించాలని నిర్ణయించిందని పాఠకుల ముందు పెట్టింది.
కాళేశ్వరం ప్రాజెక్టు మీద వ్యూహం లేకుండా తడబడ్డామని, కేసీఆర్ లక్ష్యంగా తప్పటడుగు వేశామని, ప్రాజెక్టు కూలిపోయిందని, ఇక పనికి రాదని, రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పొరపాటు చేశామని మంత్రుల సమావేశంలో అంతర్మథనం చెందిన విషయాలను, సుప్రీంకోర్టుకు వెళ్లడం కంటే మోదీ కోర్టుకు వెళ్లి రాజకీయ డ్రామా నడిపిద్దామని ఆ రోజున మంత్రులు చేసిన నిర్ణయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఒడిసిపట్టుకొని పాఠకుల ముందు పెట్టింది.