రామాయంపేట రూరల్, మే 10: గతంలో రైతు వేదికలు (Rythu Vedika) రైతులతో కళకళలాడుతూ ఉండేవి. వ్యవసాయ శాఖ ఏఈవోలు ప్రతి రోజులు రైతు వేదికలకు వచ్చి అక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసుకునే వారు. కానీ నేడు ఆ కళ లేకుండాపోయి రైతు వేదికల నిర్వహణ అస్థవ్యస్తంగా మారింది. వాటి నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో విస్తరణ అధికారులు(ఏఈవో)లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు సైతం సరిగ్గా లేకపోవడంతో రైతు వేదికలకు వచ్చే రైతులు అసౌకర్యానికి గురవుతున్నారు. కొన్ని చోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోవడంతో కనెక్షన్లు సైతం తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. మౌళిక వసతులు సరిగ్గా లేకపోవడంతో ఏఈవోలు సైతం వెళ్లలేని పరిస్థితి. మెదక్ జిల్లాలోని రామాయంపేటతోపాటు రాయిలాపూర్, కాట్రియాల, అక్కన్నపేట గ్రామాల్లో రైతు వేదిక క్లస్టర్లు ఉన్నాయి.
ఉన్నత లక్ష్యాలతో..
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నత లక్ష్యాలతో రైతు వేదికలను నిర్మించింది. రైతులకు సలహాలు, సూచనలు, శిక్షణ తరగతులు, నూతన వంగడాలు,రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాల గురించి అవగాహన కల్పించడం కోసం ఈ రైతు వేదికలను నిర్మించింది. ప్రతి 5వేల మంది రైతులకు రెండు నుంచి నాలుగు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసింది.
అంతటా ఒకే నమూనాగా నిర్మించడం కోసం రూ.22లక్షల వ్యయంతో అంచనాలు రూపొందించింది. ఇందులో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.12లక్షలు, ప్రభుత్వం రూ.10లక్షలు మంజూరు చేసి నిర్మించారు. అప్పట్లో రైతు వేదికల నిర్మాణం పట్ల రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారు.
మౌళిక వసతులు కరువు
చాలా రైతు వేదికల్లో మంచినీటి సౌకర్యంలేదు. వేదికలు శుభ్రంగా ఉంచడానికి స్వీపర్లను సైతం నియమించలేదు. తాగునీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సరాఫరా, మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు అవసరమవుతాయి. గతంలో అంతా సక్రమంగా నడిచింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క రూపాయి కూడా రైతు వేదికలకు కేటాయించలేదు. దీంతో వాటి నిర్వహణ ఏఈవోలకు తలనొప్పిగా మారింది. రైతులకు అవగాహనతో పాటు వీడియో కాన్సరెన్స్ సమావేశాలు ఏర్పాటు చేసే సమయంలో అయ్యే ఖర్చులు సైతం సొంతంగా భరించుకోవాల్సి వస్తోంది. తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల రైతులు కూడా రావడానికి ఆసక్తి చూపడం లేదు.
నాటి కళ తప్పింది..
మొదట్లో రైతు వేదికలో సమావేశాలు అంటే ఎంతో ఉత్సాహంగా ఉండేదని అక్కన్నపేటకు చెందిన రైతు ఎల్లగారి రాజు అన్నారు. చాలా మంది రైతులు వచ్చి పంటల గురించి మాట్లాడుకునేటోళ్లం. అధికారులు కూడా ఉదయం పూట వచ్చి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. వ్యవసాయ పనులు పూర్తికాగానే వేదికలకు వచ్చి మాట్లాడుకునే వాళ్లం. ఎవరు ఏ పంట వేశారు. ఏదైనా పంటకు చీడపీడలు వస్తే ఏ మందులు వాడుతున్నామనేది ఒకరినొకరు అడిగి తెలుసుకునే వాళ్లం. ఇప్పుడు రైతు వేదికలకు ఒక్కరు కూడా రావడం లేదు. అధికారులు కూడా అందుబాటులో ఉండటంలేదు.
రైతు వేదికలు ఉన్నాయా అనిపిస్తోంది..
మొదట్లో రైతు వేదికలో మీటింగ్ ఉందంటే ఉత్సాహం ఉండేదని ఝాన్సీలింగాపూర్కు చెందిన చాకలి పోచయ్య అన్నారు. ప్రతి రోజు వ్యసాయ పనులకు, ఊరికే పరిమితమైన మాకు గ్రామంతో పాటు చుట్టు పక్కల రైతులను కలుసుకునే మంచి వేదిక. ఆ రోజులు ఇప్పుడు కనిపించడం లేదు. మీటింగ్‌లు ఉన్నా, శాస్త్రవేత్తలు, ఉన్నత అధికారులు వచ్చిన రైతుల వెళ్లడానికి ఇష్టం చూపడం లేదు. ఎందుకంటే తాగునీరు ఉండదు, మరుగుదొడ్లు ఉండవు. శుభ్రం చేసేవారు లేక దుమ్ము, ధూళితో నిండిపోతున్నాయి. రైతు వేదికలకు పూర్వ వైభవం తేవాలి. రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలన్నారు.