కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతుంటే.. లిఫ్ట్ చేసే అవకాశం ఉండీ రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఈ నిర్లక్ష్యమే శాపంగా మారుతున్నది. లిఫ్ట్-1లో నాలుగు బాహుబలి మోటర్లను బిగించి 8 నెలలైనా నేటికీ వాటిని ప్రారంభించలేదు. వాటిని వాడుకొని ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుకు ఎంతోకొంత ఊపిరి పోసినట్టయ్యేది.
వనపర్తి జిల్లాలో నీళ్లందక పొలాలు ఎండుతున్నాయి. పొట్టదశలో ఉన్న పంటలను కాపాడుకోవడం కోసం రైతులు చేస్తున్న ప్రయత్నం అంతాఇంతా కాదు. కొందరు ట్యాంకర్లతో నీళ్లు పెడుతుంటే.. ఆర్థికంగా అంత లేనివారు పంటలను అలా వదిలేస్తున్నారు. పెద్దగూడెం తండాలో నీళ్లు లేక 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాలు ఎండింది. ఆ పంటను బర్రెలు, గొర్రెలు మేస్తున్నాయి.
PRLIS | కొల్లాపూర్, మార్చి 14: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాకు నీటిని అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం 2015లో ఈ పథకం పనులను ప్రారంభించింది. కేసీఆర్ ప్రభుత్వమే దాదాపు 90% పనులను పూర్తి చేసింది. మిగిలిన 10% పనులను పూర్తిచేయడంలో రేవంత్‌రెడ్డి సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిజానికి, పాలమూరు ప్రాజెక్టులో నాలుగు బాహుబలి మోటర్లు నది నీటిని ఏ క్షణమైనా ఎత్తిపోసేందుకు సిద్ధంగా ఉన్నాయి. రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉన్నా, కృష్ణానదిలో నీళ్లు ఉన్నా మోటర్లు ఖాళీగా ఉన్నాయి.
గతంలో కేసీఆర్ ప్రారంభించిన మోటర్-1 నుంచి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి 2 టీఎంసీలు ఎత్తిపోశారు. ప్రస్తుతం ఆ నీళ్లే అక్కడ ఉన్నాయి. తర్వాత రేవంత్ ప్రభుత్వం చుక్కనీరు కూడా లిఫ్ట్ చేయలేదు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో కర్ణాటక నుంచి కృష్ణానదికి భారీగా వరదలు వచ్చాయి. అయినా నీటిని ఒడిసిపట్టడంలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యం కొట్టిచ్చినట్టు కనబడుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, ప్రియదర్శిని జూరాల డ్యాం నుంచి భారీగా నీటిని దిగువకు వదిలారు. అలాగే తుంగభద్ర నదిపై కర్ణాటకలో ఉన్న టీబీ డ్యాం, సుంకేశుల డ్యాం నుంచి వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు విడుదల చేశారు.
ఒక్క జూరాలకు 1,122 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. 1,075 టీఎంసీలు దిగువకు వదిలారు. ఈ ఏడాది మొత్తం 82 రోజులు డ్యాం గేట్లు ఓపెన్ చేశారు. అయితే, ఈ నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎత్తిపోతల ద్వారా పంపింగ్ చేసిన నీటితో రిజర్వాయర్లను నింపారు. కానీ, అన్ని చెరువులు, కుంటలకు మళ్లించలేదు. దీంతో ఈసారి వేసవి ప్రారంభంలోనే చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోయింది. ఇక పాలమూరు ప్రాజెక్టు 90% పనులు పూర్తయినా మిగితా పనులపై ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. ఎంజీకేఎల్ఐ, నెట్టెంపాడు మినహా మిగితా చిన్న ఎత్తిపోతలతో పెద్ద మొత్తంలో నీటిని ఎత్తిపోసుకోలేని దుస్థితి నెలకొన్నది.
వరద జలాలను ఒడిసిపట్టి పాలమూరు వసలను శాశ్వతంగా నివారించేందుకు దేశంలో ఎక్కడ వాడని సాంకేతిక పరిజ్ఞానంతో కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మొత్తం ఐదు లిఫ్ట్‌లను నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ వద్ద ఏర్పాటుచేశారు. ఇక్కడ పంప్‌హౌస్‌లో 145 మెగావాట్ల బాహుబలి మోటర్లను నీటిని ఎత్తిపోసేందుకు ఉపయోగించారు. రేగుమాన్గడ్డ నుంచి మొదటి లిఫ్ట్ ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ను ఎత్తిపోసేందుకు 9 బాహుబలి మోటర్లను ఏర్పాటుచేశారు.
ఇందులో ఒకటి స్టాండ్‌బైగా ఉండగా, మిగిలిన 8 మోటర్లు ఒక్క రోజులో రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోయగలవు. ఎదుల, వట్టెం వద్ద కూడా స్టాండ్‌బై మోటర్లతో కలిపి పది బహుబలి మోటర్లు ఉన్నాయి. తొమ్మిది మోటర్ల ద్వారా రోజుకు 2 టీఎంసీలకుపైగా నీటిని తోడివేయొచ్చు. అలాగే ఉద్దండాపూర్ వద్ద 5 మోటర్లు ఉన్నాయి. అన్ని చోట్ల దాదాపు 85 నుంచి 90% పనులు పూర్తయ్యాయి. దీంతో మొదటి లిఫ్ట్‌లో పంప్-1 నుంచి కేసీఆర్ నీటి పంపింగ్ ప్రారంభించారు. తర్వాత పనులు చేపట్టకుండా, నీటిని ఎత్తిపోయకుండా రేవంత్ సర్కారు నిర్లక్ష్యం వహించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దక్షిణ తెలంగాణకు సాగునీరు, జీహెచ్ఎంసీకి తాగునీటితోపాటు పరిశ్రమల అవసరాల కోసం రెండు నెలల పాటు కృష్ణానది వరద జలాలను వాడుకునేలా డిజైన్ చేసిన పాలమూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాది నదిలో పుష్కలంగా నీళ్లున్నా వాడుకోలేని దుస్థితి దాపురించింది. కేసీఆర్ తెచ్చిన ప్రాజెక్టు ద్వారా నీళ్లు వస్తే రైతులు బాగుపడుతారన్న అక్కసుతోనే పనులను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. 120 టీఎంసీలను తీసుకోవడానికి అవకాశం ఉన్నా, ఆ వైపు ప్రభుత్వం ఆలోచన చేయలేదు.
ఇప్పటికైనా నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కురుమూర్తిరాయ రిజర్వాయర్ వరకు నీటిని తోడుకునే అవకాశం ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అత్యంత కీలమై న మొదటి నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి వట్టెం వరకు నదీ నీటిని తరలించడంలో ప్రధానంగా 10% పనులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. 3వ ప్యాకేజీలో 15 లక్షల క్యూబిక్ మీటర్ల పని పూర్తి చేస్తే వెంకటాద్రి రిజర్వాయర్ వరకు 1/3వ వంతు నీటిని నిల్వ చేసే అవకాశం ఉన్నది.
పాలమూరు మొదటి లిఫ్ట్‌లో నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నా కృష్ణానీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మొదటి రిజర్వాయర్‌లో నీళ్లు నిల్వ ఉంటే కొల్లాపూర్ ప్రాంతానికి సాగు, తాగునీటికి ఢోకా ఉండదు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నా, కొల్లాపూర్ వాసి మంత్రిగా ఉన్నా నీళ్లను లిఫ్ట్ చేయకుండా పంటలను ఎండబెట్టే కుట్ర చేస్తున్నారు. వెంటనే మొదటి లిఫ్ట్ నుంచి నీటిని పంపింగ్ ప్రారంభించాలి.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే