హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా సాగునీటి పంపకాలు, ప్రాజెక్టుల గురించి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏ ర్పాటు చేయాలని కేంద్రాన్ని కాంగ్రెస్ ప్ర భుత్వం ఎందుకు కోరడం లేదు? అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. అపెక్స్ సమావేశం ఏర్పాటు చేయకుంటే ప్రాజెక్టులకు అనుమతులెలా వస్తాయి? అని నిలదీశారు. సాగునీటి విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాలని కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీకి సాగునీటిని తరలించుకు పోయే ప్రయత్నాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తున్నదని మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించిన తర్వాతే బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిందని, అఖిలపక్ష సమావేశంలో రాజకీయాలు మాట్లాడటం వల్లే బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమావేశం నుంచి బయటకు వచ్చారని తెలిపారు.
ప్రతి అంశంలో తెలంగాణను కించపరిచి, హేళన చేసి మాట్లాడటం సీఎం రేవంత్‌కు తగదు. ఆయనకు ఏదో మానసిక రుగ్మత ఉన్నట్టు అనిపిస్తున్నది. అఖిలపక్షంలో ప్రతిపక్ష పార్టీలకు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలి గాని.. అధికారుల ముందు రాజకీయాలు ఎలా మాట్లాడతరు? కృష్ణా బేసిన్‌కు కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని తరలించాలన్న ఆలోచన కేసీఆర్‌కు ఉన్నది. తెలంగాణ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన ప్రాంతాలకు నీరిస్తామనే కేసీఆర్ అన్నరు.
-మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
సచివాలయంలో బుధవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజును కించపరిచినట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారని నిరంజన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎంకు ఈ విషయంలో ఏదో పాండిత్యం ఉన్నట్టు మాట్లాడారని ఎద్దేవాచేశారు. రాష్ర్టానికి ఏదో సాధించినట్టు సీఎం రేవంత్‌రెడ్డిని బీజేపీ ఎంపీలు తెగ పొగడటం విడ్డూరమని విమర్శించారు. కేంద్ర అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలనే ఒప్పందంగా చిత్రీకరించడం రేవంత్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని దెప్పిపొడిచారు.
కేంద్ర అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలనే ఒప్పందంగా చిత్రీకరించడం సీఎం రేవంత్‌రెడ్డి అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. ఆ సమావేశంలో ఎవరు ఏం మాట్లాడినా రికార్డ్ చేస్తారన్న విషయం తెలియకపోవడం విడ్డూరంగా ఉన్నది. బనకచర్ల ప్రాజెక్టును కచ్చితంగా అడ్డుకొని తీరుతామని అఖిల పక్ష సమావేశంలో సీఎం రేవంత్ ఎందుకు స్పష్టంగా చెప్పలేదు?
-మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
అఖిల పక్ష సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టును కచ్చితంగా అడ్డుకొని తీరుతామని ఎందుకు చెప్పడం లేదని నిరంజన్‌రెడ్డి నిలదీశారు. పాలమూరు కరువును రూపుమాపే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందని, మిగిలిన పనులు పూర్తి చేసి వెంటనే నీటి కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే భాష ఆయనకు అందంగా అనిపించవచ్చు గాని ముఖ్యమంత్రి హోదాకు అది తగదని నిరంజన్‌రెడ్డి సూచించారు. సీఎం మాట్లాడే భాష తన వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నదని విమర్శించారు. కృష్ణా నీళ్ల విషయంలో తెలంగాణ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిందని, తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం జరిగిందని గుర్తుచేశారు. ఏపీలో కేవలం తెలుగు గంగకే నీటి కేటాయింపు ఉన్నదని, కానీ ఏపీలో 300 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించుకున్నారని తెలిపారు. ప్రస్తుతం కృష్ణా నదిలో తగినంత నీరు అందుబాటులో లేదని వివరించారు.
కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ తేకుంటే.. రేవంత్‌రెడ్డి ఎకడ ఉండేవారు అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రతి అంశంలో తెలంగాణను కించపరిచి అవహేళన చేసి మాట్లాడటం ఆయనకు తగదని హితవు పలికారు. అఖిల పక్ష సమావేశంలో రాజకీయాలు ఎలా మాట్లాడతారని నిలదీశారు. కృష్ణాబేసిన్‌కు కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని తరలించాలన్న ఆలోచన కేసీఆర్‌కు ఉన్నదని, తెలంగాణ ప్రయోజనాలు, ఇకడి అవసరాలు తీరిన తర్వాతే మిగిలిన ప్రాంతాలకు సాగునీరిస్తామని కేసీఆర్ అన్నారని, దీనికి తాను ఎన్నటికీ కట్టుబడే ఉంటానని స్పష్టంచేశారు.
ఏ ప్రాజెక్టు, ఏ నది నుంచి ఎన్ని నీళ్లు వస్తాయో పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్‌ను వదులుకున్నామని తెలంగాణ రైతులు ఇప్పుడు బాధపడుతున్నారని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి ఈ రాష్ట్ర సాగునీటి అవసరాల గురించి ఏ మాత్రం అవగాహన లేదని, మీడియా సమావేశంలో రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతుంటే మంత్రులు వారించరా? అని నిలదీశారు. నిజంగా రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డ అయితే.. ఇన్నేళ్లూ తాము సాగునీళ్లు కోల్పోయినం.. ఇకనైనా నీళ్లను కేటాయించాలని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కేంద్రానికి లేఖ రాయాల్సింది కదా? అని నిలదీశారు.
బనకచర్ల ప్రాజెక్టు కోసం నాగార్జున సాగర్ కాలువలను ఏపీ సర్కారు వెడల్పు చేస్తున్నదని, ఇది రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకమని, ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎకడా నిలదీయడం లేదని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి ఫీజిబులిటీ లేకున్నా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగానే రూ.82,000 కోట్లు ఖర్చయ్యే పథకానికి ఏకంగా 50 శాతం భరిస్తామని హామీ ఇవ్వడం దేనికి నిదర్శనమని, తెలంగాణ మీద బీజేపీకి ఉన్న కక్షకు ఇది నిదర్శనం కాదా? అని మండిపడ్డారు. ఇది తెలంగాణకు గొడ్డలిపెట్టు అని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో కనీసం తెలంగాణను సంప్రదించాలన్న ఉద్దేశం కూడా కేంద్రానికి లేదని, నదుల అనుసంధానం కింద ఇది ఇంటిగ్రేట్ అవుతుందని ఏపీ సర్కారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించుకున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం మీద తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల మీద దృష్టి లేదని ఫైర్ అయ్యారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.32,500 కోట్లు ఖర్చు చేసింది. ఇకడ కేవలం 172 ఎకరాలను మాత్రమే సేకరించాల్సి ఉన్నది. ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. పాలమూరు కరువును శాశ్వతంగా రూపుమాపే పథకం డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపింది. మిగిలిన పనులు పూర్తి చేసి వెంటనే నీటి కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు.
-మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి మీద, నీటి ప్రాజెక్టుల మీద, పరివాహక ప్రాంతాల మీద కనీస అవగాహన, చిత్తశుద్ధి లేదని నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘పదేండ్లలో పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి చెప్పుమిని అడుగుతున్నారు కదా ? అసలు తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేసిందే కేసీఆర్ ప్రభుత్వం.. పాలమూరులో నాలుగు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కాంగ్రెస్ పార్టీ అనేక అడ్డంకులు వేసినా రూ.32,500 కోట్లతో పనులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం’ అని స్పష్టంచేశారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా రేవంత్‌రెడ్డి ఏడాదిన్నరగా కాలయాపన చేస్తున్నారని, పాలమూరు ఎత్తిపోతల పనులను ఏ కారణం చేత ఎందుకు ఆపారో ? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నీళ్లు లేని చోట కొడంగల్ ఎత్తిపోతల చేపట్టారని మరి దాని భవిష్యత్తు ఏమవుతుందో వేచిచూడాలని అనుమానం వ్యక్తంచేశారు. ప్రభుత్వం చేతగానితనాన్ని, ఏపీకి అనుకూలంగా ఉన్న తమ ప్రభుత్వ వైఖరిని కప్పిపుచ్చుకొనేందుకు కేసీఆర్‌పై, మాజీ మంత్రి హరీశ్‌రావుపై నెపం నెడుతున్నారని, రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులూ హర్షించరని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాలకే బీఆర్ఎస్, కేసీఆర్ కట్టుబడి ఉన్నారని స్పష్టంచేశారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ పాల్గొన్నారు
‘గోదావరి నుంచి బనకచర్లకు నీటిని తీసుకుపోతున్న నేపథ్యంలో ఇప్పటికే కృష్ణా నుంచి నీళ్లను తరలించుకుపోతున్నందున ఇక మీదట కృష్ణా నీళ్లు తీసుకుపోవద్దని చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు లేఖ రాయడం లేదు ? ప్రభుత్వానికి ఒక విధానం అంటూ ఏదీ లేదా? ఇప్పటి వరకు తీసుకువెళ్తున్న నీళ్లను బంద్ పెట్టాలని ఎందుకు అడగడం లేదు?’ అని నిరంజన్‌రెడ్డి నిలదీశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని, నిజంగా ఉరితీయాల్సి వస్తే కాంగ్రె స్ ప్రభుత్వాన్నే ఉరితీయాలని విరుచుకుపడ్డారు.
ఎన్నికల హామీలు ఎగ్గొట్టినందుకు, పచ్చబడ్డ తెలంగాణను ఎండబెట్టినందుకు, రూ.15 వేల రైతు భరోసాకు ఎగనామం పెట్టినందుకు, రూ.4000 వేల పింఛన్ ఇవ్వనందుకు, క్వింటాకు రూ.500 బోనస్ ఎగ్గొట్టినందుకు కాం గ్రెస్ ప్రభుత్వాన్నే ఉరితీయాలని ఆగ్ర హం వ్యక్తంచేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోగా ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు.. ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఉరితీయాలని, సూటీలు ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు విద్యార్థినులు ఈ ప్రభుత్వాన్ని ఉరితీయాలని తూర్పారబట్టారు.