ప్రాజెక్టులే మన చేతిలో లేకుంటే, శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి జరుగకపోతే.. సాగర్‌కు నీళ్లొస్తయా? సాగర్‌కు నీళ్లు రాకపోతే ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నడుస్తుందా? సాగర్ ఎడమ కాల్వకు నీళ్లొస్తయా? కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే నల్లగొండ జిల్లాకు తీరని ద్రోహం చేసినట్టే.
– హరీశ్‌రావు
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నాడు ప్రచారంలో అబద్ధాలు వల్లెవేసిన కాంగ్రెస్.. నేడు పాలనలోనూ అసహనం ప్రదర్శిస్తున్నదని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ అదానీ, ప్రధాని ఒక్కటని చెప్పి ప్రచారం చేస్తుంటే.. రాష్ట్రంలో రేవంత్ వారితోనే దోస్తీ కడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోకి అదానీ రాకుండా బీఆర్ఎస్ నిలువరించిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్రంలోకి ఎందుకు ఆహ్వానించిందని ప్రశ్నించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా భువనగిరి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఫిబ్రవరి ఒకటిన గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ సర్కారును నిలదీశారు.
నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే.. కాంగ్రెస్ ఆర్డర్ కాపీలు ఇచ్చి గొప్పలు చెప్పుకొంటున్నదని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారును అక్కడి ప్రజలు తిరస్కరిస్తున్నారని, అక్కడ 25 ఎంపీ స్థానాల్లో నాలుగైదు మాత్రమే వస్తాయంటున్నారని, ఇక్కడ కూడా హామీలను విస్మరించిన కాంగ్రెస్‌కు అదే గతి పడుతుందని అన్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రూ.15వేల కోట్ల అప్పులు చేసిందని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో నోటికొచ్చినట్టు బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రచారం చేశారని, అసలు ఎన్నికల్లో బీజేపీని ఓడించిందే తమ పార్టీ అని చెప్పారు. నాడు ఎమ్మెల్సీ సీట్ల విషయంలో గవర్నర్ అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలను క్షణాల్లో ఆమోదిస్తున్నారని, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
అందరం రామ భక్తులమేనని, బీజేపీ రాష్ర్టానికి చేసిందేమీ లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను బీజేపీ ఏపీకి లాక్కెళ్లిందని, లోయర్ సీలేరు గుంజుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ‘ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు? రూ.4 వేల పింఛన్ దేవుడెరుగు.. 2వేల పింఛన్ కూడా సరిగా ఇస్తలేరు. పోయిన నెల పింఛన్ ఈ నెల ఇచ్చిన్రు. 12 నుంచి 14 గంటల కరెంట్ కూడా ఇవ్వడంలేదు. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతన్నలు మొత్తుకుంటున్నారు. దళితబంధు డబ్బులను ఫ్రీజ్ చేశారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలి. కాంగ్రెస్ 420 హామీలపై గ్రామాలు, తండాల్లో చర్చ పెట్టండి’ అని హరీశ్‌రావు కార్యకర్తలకు సూచించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అహంకారం నెత్తికెక్కిందని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘అధికారం ఉన్నదనే అహంకారం కోమటిరెడ్డిలో కనిపిస్తున్నది. బీఆర్ఎస్ 39 ముక్కలు అవుతుందంటడు. రైతుబంధు అడిగినోడిని చెప్పుతో కొట్టమంటడు. రైతుబంధు ఎప్పుడిస్తరని అడిగినందుకు యాదాద్రి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిని పోలీసులను పెట్టి గెంటించిండు. ఈ అహంకారాన్ని ప్రజలు సంహించరు. తప్పకుండా తగిన గుణపాఠం చెప్తారు. కోమటిరెడ్డికి నిజంగా నల్లగొండ జిల్లాపై ప్రేమ ఉంటే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడంపై మాట్లాడాలి. ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబీకి అప్పగిస్తే నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీరు రాదు.
ప్రాజెక్టులే మన చేతిలో లేకుంటే శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి జరుగకపోతే సాగర్‌కు నీళ్లొస్తయా? సాగర్‌కు నీళ్లు రాకపోతే ఏఎమ్మార్పీ ప్రాజెక్టు నడుస్తుందా? సాగర్ ఎడమ కాల్వకు నీళ్లొస్తయా? కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే నల్లగొండ జిల్లాకు తీరని ద్రోహం జరుగుతుంది. నాడు వెంకట్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు పులిచింతల ప్రాజెక్టు కట్టి ఆంధ్రాకు నీళ్లిచ్చారు. నేడు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తే ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. కోమటిరెడ్డి అసలు దీనిపై మాట్లాడు.’ అని సవాల్ విసిరారు. 2021లో నిర్ణయం తీసుకున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించలేదని, కాంగ్రెస్ పైకి అప్పగించబోమని అంటూనే సంతకాలు పెడుతున్నదని విమర్శించారు.
అధికారం ఉన్నదని రెచ్చిపోతే కాంగ్రెస్ రాజకీయంగా చరిత్రలో కనుమరుగవుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ను బొందపెడ్తామని, జైళ్లో వేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని, కేసీఆర్‌ను అది చేస్తాం.. ఇది చేస్తమని అంటున్నవారు ఒక్కసారి ముట్టుకొని చూడాలని వార్నింగ్ ఇచ్చారు. 20 ఏండ్లలో కోమటిరెడ్డి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలని అనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలు రాజకీయంగా బొంద పెడతారని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.