Koppula Eshwar | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు. దళితబంధు రెండో విడత ఆర్థిక సాయం చెల్లించాలని ఒక ఎమ్మెల్యేగా అడగడం తప్పా అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది రేవంత్ రెడ్డి రాక్షస పాలన అని విమర్శించారు.
కౌశిక్ రెడ్డి ఆరోగ్యం, భద్రత పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని స్పష్టంచేశారు.
నాడు కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి హుజూరాబాద్‌లోని సుమారు 20 వేల కుటుంబాలను ఆదుకున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తుచేశారు. రెండో విడత దళితబంధు డబ్బులు వారి అకౌంట్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలను ఫ్రీజ్ చేసి దళితులను దగా చేసిందని మండిపడ్డారు. దళిత బంధు రెండో విడత రాని వారంతా వచ్చి తమ దరఖాస్తులు నేరుగా స్థానిక ఎమ్మెల్యే ఇవ్వడం తప్పా అని ప్రశ్నించారు. దళిత సమాజం బాగుపడటం ఈ దయలేని ముఖ్యమంత్రికి ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరున రూ.10 లక్షలకు బదులు రూ.12 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. దళిత బంధు రెండో విడత కోసం 2023-24 బడ్జెట్ లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 17,700 కోట్లు కేటాయించిందని తెలిపారు. తెలంగాణలోని 118 నియోజకవర్గాలలో, ఒక్కో నియోజకవర్గంలో 1100 కుటుంబాలకు ఎంపిక చేసి మొత్తం 1.30 లక్షల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని గుర్తుచేశారు.
దళితుల పక్షాన నిలబడి ప్రశ్నిస్తే అరెస్టులా, ఇదెక్కడి అరాచక పాలన అని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. ఇది ప్రజా పాలన కాదు.. ఇది రేవంత్ రెడ్డి రాక్షస పాలన అని విమర్శించారు. కౌశిక్ రెడ్డి ఆరోగ్యం, భద్రత పట్ల పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని స్పష్టంచేశారు.