Government Land | రంగారెడ్డి/అబ్దుల్లాపూర్‌మెట్, నమస్తే తెలంగాణ 17: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై బాటసింగారం పండ్ల మార్కెట్ పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ భూమిపై కాంగ్రెస్ నాయకుల కన్ను పడింది. ఈ భూమిని ఎలాగైనా కాజేయాలని భావించిన సదరు నేతలు అందుకు స్కెచ్ గీశారు. అందులో భాగంగా తొలుత ఆ భూమిలో గుడి నిర్మించి, ఆ తర్వాత భూమిని హస్తగతం చేసుకోవాలని నిర్ణయించారు.
ఇందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని అడ్డం పెట్టుకోవాలని భావించారు. మల్రెడ్డి రంగారెడ్డి కాలనీ పేరుతో ప్రభుత్వ భూమికి ఒక కమాన్ ఏర్పాటు చేశారు. తాజా మాజీ ఎంపీటీసీ ఈ పథక రచన చేసినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు.
బాటసింగారం గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన కొత్తగూడెం గ్రామంలోని సర్వే నంబర్ 10/95లో సుమారు రెండెకరాల భూమి ఉంది. భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం గతంలో ఇక్కడ పట్టాలు ఇచ్చింది. కొంత భూమిని ఇందిరమ్మ ఇండ్ల కోసం కేటాయించింది. అయితే, అసైన్డ్ పట్టాలు పొందినవారిలో కొందరు తమ భూమిని విక్రయించగా, ప్రభుత్వం పీవోటీ కింద స్వాధీనం చేసుకున్నది. సర్వే నంబర్ 10ని సబ్ డివిజన్‌గా మార్చి అసైన్డ్ పట్టాలు ఉన్న వారికి కేటాయించారు. అందులో భాగంగానే సర్వే నంబర్ 10/95లో ఉన్న భూమికి కూడా విక్రయాలు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో దానిని కూడా పీవోటీ కింద స్వాధీనం చేసుకోవడానికి నోటీసులు ఇచ్చింది. అయితే, గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఒకరు అసైన్డ్ పట్టా ఉన్న వ్యక్తి నుంచి భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం భూమిని 100 గజాల చొప్పున ప్లాట్లు చేశారు. అనంతరం లేఅవుట్ తయారుచేసి ఒక్కోప్లాట్ను రూ. 3 నుంచి రూ. 4 లక్షలకు విక్రయించినట్టు తెలిసింది. అయితే, ముందుగానే ప్లాట్లు విక్రయించినట్టు తెలిస్తే బండారం బయటపడుతుందని, అధికారులు అడ్డుకుంటారని భావించి ఈ స్థలంలో గుడి నిర్మాణం చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలను తీసుకొచ్చి భూమి పూజ చేయించారు. అదే రోజు దీనికి మల్రెడ్డి రంగారెడ్డి కాలనీగా నామకరణం చేసి కమాన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి ఆలయ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. అదే సమయంలో లేఅవుట్లు కూడా తయారుచేసి గుట్టుచప్పుడు కాకుండా ప్లాట్ల అమ్మకాలు కూడా మొదలుపెట్టినట్టు తెలిసింది.
ప్రభుత్వ భూమిలో మల్రెడ్డి రంగారెడ్డి పేరుతో కాలనీ ఏర్పాటు చేయడం అసైన్డ్ చట్టానికి విరుద్ధమని రెవెన్యూ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీచేశారు. కానీ, వాటిని బేఖాతరు చేస్తూ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ. 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా అధికారులు మౌనం వహిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తగూడెం సర్వేనం 10/95, 96లోని ప్రభుత్వ భూమిలో వెలసిన అక్రమ కట్టడాలను తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం జేసీబీ సహాయంతో కూల్చివేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో ప్రభుత్వ భూమి అని బోర్డులను ఏర్పాటుచేశారు. సదరు భూమిలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లాలో ఇండ్ల స్థలాల కేటాయింపు పై నిషేధం ఉన్నప్పటికీ కొత్తగూడెం గ్రామంలో మాత్రం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేరుతో కొత్తగా కాలనీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా మార్చి ఎమ్మెల్యే పేరు పెట్టుకొని చట్టబద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నారు. 2006లో మల్రెడ్డి రంగారెడ్డి మలక్‌పేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొత్తగూడెంలో ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు ఇప్పించారు. ఆ ప్లాట్లు పొందినవారు ఎమ్మెల్యే రంగారెడ్డి కాలనీగా నామకరణం చేసుకున్నారు. ఇప్పుడు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ప్రభుత్వ భూమిని కాజేసేందుకు సర్వే నంబర్ 10/95లో కాలనీ ఏర్పాటు చేశారు. చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన ఈ కాలనీలో ఇప్పుడు గుడి కూడా నిర్మిస్తున్నారు.