గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా, మాడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు, యూనిఫాం సహా 24 రకాల వస్తువుల పంపిణీకి రాష్ట్రస్థాయిలో ఏకమొత్తంగా టెండర్లు పిలువడం వివాదాస్పదమవుతున్నది. బడా ఏజెన్సీలకు ఇవ్వడం ద్వారా కమీషన్ల మేతకు బాటలు వేసుకుంటున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్‌లు తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది. సంస్థల వారీ గా, జిల్లాల వారీగా కాకుండా కేంద్రీయ పద్ధతికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రస్థాయిలోనే ప్రొక్యూర్‌మెంట్‌కు రంగం సిద్ధం చేయడంతోపాటు నోటిఫికేషన్‌ను జారీచేసింది.
ఈ విధానంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. బడా కంపెనీలకే లబ్ధి చేకూరనుండటంతో నాణ్యతా ప్రమాణాలకు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. నిధుల స్వాహా కోసమే టెండర్ ప్రక్రియను కేంద్రీకరించారని గురుకుల అసోసియేషన్లు, జిల్లా స్థాయి గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు, నోటిఫికేషన్ విధానం కూడా అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.
మొత్తం టెండర్ల విలువ రూ.880 కోట్లు
రాష్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మాడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ఏటా పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్స్‌లు తదితర 24 రకాల వస్తువులను ప్రభుత్వమే అందిస్తుంది. గతంలో ఏ విద్యా సంస్థకు సంబంధించిన వస్తువులను ఆ విద్యాసంస్థ ద్వారా జిల్లా స్థాయిలోనే కలెక్టర్ల ద్వారా టెండర్లు నిర్వహించి కొనుగోలు చేసేవారు. ఇప్పటివరకు అదే పద్ధతిని పాటించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియకు స్వస్తిపలికింది.
నిరుడు సోషల్వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో అన్ని గురుకుల సొసైటీల కార్యదర్శులతో ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను ఏర్పాటుచేసింది. సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో నిత్యావసర సరుకుల ప్రొక్యూర్మెంట్, ఇతర సరకుల సేకరణపై మార్గదర్శకాలను ఈ పీఎంయూనే నిర్ణయించింది. నిత్యావసర వస్తువులు సరఫరా, సేకరణ, ధరల ఖరారు, టెండర్ ప్రక్రియను ఏకమొత్తంగా నిర్వహిస్తున్నది.
గత సంవత్సరం టెండర్ ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధం కాగా, కోర్టు వివాదాల నేపథ్యంలో అది అటకెక్కింది. తాజాగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీచేసింది. దరఖాస్తుల గడువు 17వ తేదీతో ముగియనున్నది. ఇదిలా ఉంటే మొత్తంగా 24 రకాల వస్తువులకు సంబంధించి జారీచేసిన ఈ టెండర్ విలువ రూ.880 కోట్లు కావడం గమనార్హం. పీఎంయూ ఏర్పాటే నిధుల మేత కోసమని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జీవో ఇచ్చి తుంగలో తొక్కిన కాంగ్రెస్
విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సంబంధించి దుస్తులను తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) ద్వారా కొనుగోలు చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. దాదాపు 24 వేల మంది చేనేత కార్మికుల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని అదే విధానాన్ని కేసీఆర్ ప్రభుత్వం సైతం కొనసాగించింది. బతుకమ్మ చీరలు, ఇతరత్రా ఆర్డర్లు సైతం అదనంగా అందించి చేనేత కార్మికులకు మరింత ఉపాధి కల్పించింది.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సైతం టెస్కో ద్వారా యూనిఫామ్‌లు, వస్ర్తాలు కొనుగోలు చేయాలని గత సంవత్సరం మార్చిలో జీవో-1ను మరోసారి జారీచేసింది. కానీ, ప్రస్తుతం తాము జారీ చేసిన జీవోనే రేవంత్‌రెడ్డి సర్కార్ తుంగలో తొక్కింది. జీవో-1కు విరుద్ధంగా టెండర్ విధానానికి తెరలేపింది. మొత్తంగా రూ.250 కోట్ల విలువైన యూనిఫామ్‌లకు సంబంధించి ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.
ఫలితంగా టెస్కోకు యూనిఫామ్‌ల ఆర్డర్లు దూరమైనట్టేనని భావిస్తున్నారు. బడా కంపెనీలకే టెండర్ దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిబంధనలను సైతం అందుకు అనుగుణంగానే రూపొందించడం గమనార్హం. వెరసి చేనేత కార్మికుల ఉపాధికి మరోసారి ముప్పు ఏర్పడింది.
బడా కంపెనీలకు కట్టబెట్టేందుకే!
ప్రభుత్వం నూతన టెండర్ విధానానికి తెరలేపడానికి ప్రధాన కారణం కమీషన్ల కోసమేనని గురుకుల అసోసియేషన్లు, చిన్న, మధ్యతరహా గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ సంస్థలను టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారని భావిస్తున్నారు. టెండర్ నిబంధనలు సైతం అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ట్రంక్‌బాక్స్ సరఫరా టెండర్లో పాల్గొనాలంటే బ్యాంక్ నుంచి రూ.10 కోట్లకు సాల్వెన్సీ చూపించాలి.
రూ.10 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి. టై, బెల్ట్, సూల్ బ్యాగ్ సరఫరా టెండర్ దకాలంటే బ్యాంకు నుంచి రూ.50 కోట్ల సాల్వెన్సీ కలిగి ఉండడంతోపాటు రూ.20 కోట్ల టర్నోవర్ ఉండాలి. నోట్ బుక్పేపర్లో కూడా వాటర్ మార్ ఉండాలంటూ నిబంధనలు విధించింది.
దానికి బ్యాంక్ నుంచి రూ.40 కోట్ల సాల్వెన్సీతోపాటు, టర్నోవర్ రూ.150 కోట్లు ఉండాలి. షూస్ కాంట్రాక్టు కోసం రూ.20 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలి. టెండర్ దక్కిన 45 రోజుల్లోనే వస్తువులను సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కోట్లాది రూపాయలు ఈఎండీలుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నిబంధనలన్నీ బడా కంపెనీలు, ఏజెన్సీలకే అనుకూలం. జిల్లా స్థాయిలో ఉన్న గుత్తేదారులు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు ఆ నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశం ఏమాత్రం ఉండబోదు. మొత్తంగా కొంత మంది బడా కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడమే లక్ష్యంగా నిబంధనలు రూపొందించారనే విమర్శలొస్తున్నాయి.
బండా సంస్థల నుంచి కమీషన్లు దండుకుని టెండర్లు కట్టబెట్టేందుకే ఈ విధానం తెచ్చారని జిల్లా స్థాయి గుత్తేదారులు ఆరోపిస్తున్నారు. వెరసి రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది చిన్న కాంట్రాక్టర్లతోపాటు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
నాణ్యతకూ తిలోదకాలే!
బడా ఏజెన్సీలకు ఏకమొత్తంగా కట్టబెట్టడం నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలివ్వడమేనని గురుకుల అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. జిల్లా స్థాయిలోనే ఎంపిక చేసి, స్థానిక కంపెనీలకే అవకాశమివ్వడం వల్ల నాణ్యతతోపాటు జవాబుదారీతనం కూడా ఉండేదని చెప్తున్నారు. ముందుగానే ఎక్కడికక్కడ శాంపిల్స్‌ను తనిఖీ చేసే అవకాశం ఉండేదని గురుకుల అసోసియేషన్లు వివరిస్తున్నాయి. కానీ, ప్రస్తుత కేంద్రీకృత వ్యవస్థలో నాణ్యత తనిఖీకి ఎక్కడా ఆస్కారమే లేదని, బడా ఏజెన్సీలకు జవాబుదారీతనం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.
బడా ఏజెన్సీలు ఇచ్చే నమూనా వస్తువులే నాణ్యతా ప్రమాణాలకు అనుకూలంగా ఉంటాయని, సరఫరాలో డూప్లికేటే ఎక్కువని వివరిస్తున్నారు. నిరుడు కేంద్రీకృత విధానంలోనే గుడ్ల సరఫ రా టెండర్లు ఖరారు చేశారు. సరఫరా చేయాల్సిన ఒక్కో గుడ్డు 50 గ్రాములు ఉండాలి. కా నీ, ప్రస్తుతం 40 గ్రాములకు మించి ఉండ కపోగా, చాలాచోట్ల కుళ్లిన గుడ్లు సరఫరా అవుతున్నాయి.
రాష్ట్ర పరిశ్రమలకు కాంగ్రెస్ అవమానం
పరిశ్రమల ఏర్పాటుతోపాటు వాటి విస్తరణను ఏ ప్రభుత్వమైనా ప్రోత్సహిస్తుంది. మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడేందుకు కావాల్సిన రక్షణ కల్పిస్తుంది. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్‌లో జాతీయ సంస్థలకే టెండర్ దక్కేలా నిబంధనలు రూపొందించి రాష్ట్ర పరిశ్రమలను దెబ్బకొట్టింది. పరిశ్రమల ఉత్పత్తులు, శక్తి సామర్థ్యాలను సైతం ప్రభుత్వ పెద్దలు అవమానిస్తుండటంపై గుత్తేదారులు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమదారులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
ఓపెన్ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఇటీవల పలువురు పరిశ్రమల యజమానులు, చేనేత సంఘాల నేతలు, కాంట్రాక్టర్లు ప్రభుత్వ పెద్దలను కలిశారు. ప్రభుత్వ పెద్దలు కనీసం భరోసా ఇవ్వకపోగా అ వమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే వీరు పెద్దమొత్తంలో, నిర్ణీత గడువులోగా సరఫరా చేయలేరని, స్థానిక ఉత్పత్తుల నాణ్యత ఏమాత్రం ఉండటం లేదంటూ వ్యాఖ్యానించారని పరిశ్రమదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.