Kaleshwaram Project | ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించేందుకు మరో వంద అబద్ధాలు ఆడాలి! అనేక అపచారాలు చేయాలి! ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అదే. నాలుగేండ్ల పాటు యాసంగిలో సైతం చివరి ఆయకట్టు వరకు జీవధారను అందించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ‘కూలిపోయింది.. కుంగిపోయింది.. ఒక్క ఎకరం కూడా పారించలేదు’ అని నోటికొచ్చిన అబద్ధాలాడింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అబద్ధాలను నిజం చేసేందుకు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణను ఎండబెట్టింది కాంగ్రెస్ సర్కారు. తాము చెప్పిన అబద్ధాలను నిజాలు అని నమ్మించే విఫల ప్రయత్నంలో భాగమే.. ‘ఎండలు బాగా కొడుతున్నందున పంటలు ఎండిపోతున్నయి.. గతం కంటే ఈ యాసంగిలో ఎక్కువగా పంటలు సాగుచేయడం వల్లే నీళ్లు చాలడం లేదు’ అనే కొత్త అబద్ధాలు! కేవలం ఎండలవల్లే పంటలు ఎండుతున్నాయా? అన్నదానికి కేసీఆర్ హయాంలో ఎండలు లేవా అని రైతులే జవాబు చెబుతున్నారు. ఇక ఎక్కువ భూముల్లో సాగైయింది అన్నదానికి వచ్చే వడ్లు జవాబు చెప్పడం ఖాయం. కాంగ్రెస్ అబద్ధాల సంగతి ఇట్లా ఉంటే అంతకంటే పెద్ద అపచారం కాళేశ్వరానికి రిపేరు చేయించక పోవడం, బరాజ్‌తో సంబంధం లేకుండా కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోసే వెసులుబాటు ఉన్నా కావాలని ఆపని చేయకపోవడం.
తన నిర్వాకంతో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని కుప్పకూల్చిన ప్రభుత్వం, 17 రోజులైనా మృతదేహాలను బయటికి తీసుకురాలేని ప్రభుత్వం, ఇంత జరిగినా సొరంగాన్ని త్వరలోనే పునరుద్ధరించి, ఏడాదిన్నర, రెండేళ్లలో ఎస్ఎల్బీసీ ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లిస్తమని చెప్తున్నది. మరి కుప్పకూలిన ఎస్ఎల్బీసీని పునరుద్ధరించేవాళ్లు 15 నెలలైనా కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక పిల్లర్‌కు ఎందుకు మరమ్మతులు చేయలేకపోతున్నరు? పిల్లర్ కాదు.. బ్లాక్‌ను కొత్తగా నిర్మించాలన్నా ఏడాదిలో పూర్తయ్యేది కదా! అదెందుకు చేయలేదు?
పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకున్న మధుర క్షణాలు ఇంకా భారతావని కండ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. గత ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన 76 పరుగులు గొప్పవా? చివరలో వచ్చి 18 పరుగులు కొట్టిన హార్దిక్ పాండ్యా, విన్నింగ్ షాట్ కొట్టిన జడేజా ఖాతాలోని తొమ్మిది పరుగులు గొప్పవా? అంటే ఏం చెప్తాం? రోహిత్ చేసిన పరుగులకు తోడు మిగిలిన వారు అవసరానికి అనుగుణంగా, ప్రణాళికాబద్ధంగా చేసిన పరుగులే భారత్‌ను విజయతీరానికి చేర్చాయి. అందుకే రోహిత్ చేసిన 76 పరుగులకు ఎంత విలువ ఉన్నదో.. విజయానికి సరిపడేంతగా హార్దిక్, జడేజా కొట్టిన 18, 9 పరుగులకూ అంతే విలువ ఉన్నది!
ప్రధాన గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్, ఇతర ప్రాజెక్టులకు వరద లేనందునే కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టు అనివార్యమనేది ఆ పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో మొదటగానే పొందుపరిచిన కీలక అంశం. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన 2019 నుంచి నిరుటిదాకా శ్రీరాంసాగర్‌కు వరద ఆశాజనకంగానే ఉన్నది. కానీ ఆయా ప్రాజెక్టుల్లోని నీటి నిల్వ అనేది ఆయకట్టులోని చివరి ఎకరం దాకా కడుపునిండా సాగునీరిచ్చేందుకు సరిపోదు. 2019-2022 వరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతి యాసంగిలో శ్రీరాంసాగర్‌లోని 60-70 టీఎంసీలకు తోడు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 20-30 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకొని పుష్కలంగా సాగునీరు అందించింది. ఒకవేళ శ్రీరాంసాగర్‌కు వరద రాకుంటే అందులోని 60-70 టీఎంసీలను కూడా కాళేశ్వరంతోనే అదనంగా ఎత్తిపోసుకునేవారు. ఎలాగూ జలాశయంలో నిల్వ ఉన్నందున యాసంగి పంటలకు కావాల్సినంత మాత్రమే 20-30 టీఎంసీలను ఎత్తిపోసుకున్నారు. మరి ఎగువ నుంచి వచ్చిన 60-70 టీఎంసీలు గొప్పవా? కాళేశ్వరం నుంచి 20-30 టీఎంసీల ఎత్తిపోతలు అద్భుతమా? అంటే కచ్చితంగా కాళేశ్వరజలాలే అమృతజలాలనేది అక్షర సత్యం.
ఎందుకంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి యాసంగిలోనే లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఇప్పుడు వచ్చిన రెండో యాసంగిలోనూ అన్నదాతల కండ్ల ముందు పైర్లు పశువుల మేతకు పోతున్నయి. నిరుడు గోదావరి పొంగిపొర్లింది. వందా.. రెండు వందలు కాదు! ఏకంగా 4000 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. యాసంగి మొదలయ్యేనాటికి శ్రీరాంసాగర్‌లో సాగుకు సుమారు 64 టీఎంసీల నీళ్లున్నయి. అయినా పంటలు ఎందుకు ఎండిపోతున్నట్టు? అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎత్తిపోసిన ఆ 20-30 టీఎంసీల కాళేశ్వరజలాలే ఇప్పుడు కరువయ్యాయి. శ్రీరాంసాగర్‌లోని 64 టీఎంసీల నిల్వ బూడిదలో పోసిన పన్నీరైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన ప్రణాళిక, అవగాహన లేకపోవడం ఆగ్గికి ఆజ్యం పోసినట్లయి.. నిత్యం తెలంగాణ రైతు ‘సాగునీళ్లు ఇయ్యండి మహాప్రభో’ అని దండం, దస్కాలు పెట్టాల్సిన దుస్థితి వచ్చింది.
కరీంనగర్, మార్చి 11 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి)/జగిత్యాల (నమస్తే తెలంగాణ) : బీడువారిన భూముల్లో నీళ్లు పారించి పచ్చని పంటలతో తెలంగాణను సస్యశ్యామలంగా మార్చేందుకు అపరభగీరథుడై కేసీఆర్ అనతికాలంలోనే కాళేశ్వరాన్ని కట్టించి రైతులకు కరువుతీరా సాగునీటిని అందించారు. వట్టిపోయిన వరప్రదాయిని శ్రీరాంసాగర్‌కు పునర్జీవం కల్పించి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో ఆయువుపోసి ఎస్సారెస్పీ చరిత్రలోనే సరికొత్త చరిత్ర లిఖించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ ఒక్క పిల్లర్ కుంగితే దాన్నే ఎన్నికల అస్త్రంగా మార్చుకున్న కాంగ్రెస్, నానా యాగీ చేసి అధికారంలోకి రాగానే అక్కసుతో నీటి ఎత్తిపోతలను ఆపేసింది. జలాలను ఎత్తిపోసుకునేందుకు పుష్కలమైన అవకాశాలున్నా అడ్డుపుల్లలు వేస్తూ తీవ్ర నిర్లక్ష్యం చేసింది.
తీరా ఇప్పుడు యాసంగిలో కాళేశ్వరం నీళ్లందక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే చోద్యం చూస్తున్నది. కేసీఆర్ కట్టించాడన్న కారణంతో కాళేళ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసు వెల్లగక్కుతూ నిరుపయోగంగా మార్చడం రైతుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి అన్నదాతలు అల్లాడుతుంటే కాళేశ్వరం జలాలు అందించకుండా కాంగ్రెస్ తన అహంకార ధోరణిని ప్రదర్శిస్తున్నది. ఈ ప్రాజెక్టు పరిధిని పంటలను కాపాడాలంటే ఏప్రిల్ చివరి వరకు నీళ్లివ్వాల్సిన అవసరమున్నది. రైతులపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వారి కష్టాలు, కన్నీళ్లను తుడిచేందుకు ఇకనైనా కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం పంటలకు అనుగుణంగా కాళేశ్వరం జలాలను తరలించింది. ఎల్ఎండీ దిగువన కాకతీయ కా లువ గరిష్ఠ ప్రవాహం 8500 క్యూసెక్కు లు. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ 4 వేల క్యూసెక్కులకు మించి నీటిని విడుదల చేసిన దాఖలాల్లేవు. కేసీఆర్ హ యాంలో కాలువ 0 కిలో మీటర్ నుంచి 146వ కిలోమీటర్ వరకు రూ.100 కోట్లతో, ఎల్ఎండీతో పాటు స్టేజీ-2లోనూ రూ.774 కోట్లతో పనులు పూర్తి చేసి కాలువను బలోపేతం చేసి 6100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టుకూ నీరందించారు.
1985లో దిగువమానేరు జలాశయం ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటివరకు ఏ యాసంగి సీజన్లోనూ 52 టీఎంసీల నీటిని దిగువకు వదిలిపెట్టలేదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు యాసంగి సీజన్లలో 52 టీఎంసీల నీటిని దిగువకు పంపించింది.
నెలన్నర పాటు ఎల్ఎండీ దిగువన కాకతీయ కాలువకు నీటిని నిరంతరంగా గతంలో ఏనాడూ విడుదల చేయలేదు. కానీ, బీఆర్ఎస్ హయాంలో 146 రోజుల పాటు కొనసాగింది.
ఎస్సారెస్పీ స్టేజీ-2 అంటే 284వ కిలోమీటర్ నుంచి 348వ కిలోమీటర్ పరిధిలో ఉన్న మొత్తం 767 చెరువులు నిం డాయి. సూర్యాపేట జిల్లా చివరి ఆయక ట్టు వరకు నీటిని అందించడమే కాకుం డా ఈ పరిధిలో చెరువులనూ నింపింది.
ఎస్పారెస్పీ చరిత్రలో స్టేజీ-2 పరిధిలోని ఆయకట్టుకు గత ప్రభుత్వాల హయాం లో ఒకట్రెండు టీంఎసీలు కూడా వెళ్లలేదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం పలు సీజన్లలో దాదాపు 24 టీఎంసీలకుపైగా నీటిని అందించింది.
కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన త ర్వాత 2022లో వానకాలం, యాసంగి కలిపి ఏకంగా 24,30,753 లక్షల ఎకరాలు సాగవడం ఎస్సారెస్పీ చరిత్రలోనే రికార్డు. గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం కల్పించిన ఘతన కేసీఆర్‌కే దక్కింది.
పోతారం శివారులోని హన్మంతరావుకుంటలోకి ఎస్సారెస్పీ నీళ్లు రాక దాని కింద ఉన్న గిడికుంటలోకి కూడా నీళ్లు రాలేదు. దీంతో భూగర్భజలాలు తగ్గి బావులు అడుగంటి కుంట కింద సాగు చేసుకుంటున్న రైతులంమంతా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నం. నేను రెండు ఎకరాల్లో పొలం వేస్తే సాగునీరందక నెర్రెలు బారుతున్నది. రూ. లక్షా 20 వేలతో నెల కింద బావి తవ్విస్తే నీళ్లు పడక ప్రయోజనం లేకుండా పోయింది. పొలానికి పెట్టిన రూ.60 వేల పెట్టిబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకొని కుంటలో నీళ్లు నింపాలె. మా పంటలు ఎండిపోకుండా చూడాలె.
– సుర్వి సుగుణ, రైతు, పోతారం, సారంగాపూర్ మండలం, జగిత్యాల జిల్లా