కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 17: మైనార్టీ యువతకు ఉపాధి కల్పనలో కాంగ్రెస్ సర్కారు (Congress) మొండి చేయి చూపుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వస్తే వంద శాతం సబ్సిడీతో ఉపాధి కల్పన పథకాలు ప్రవేశపెడుతామంటూ మేనిఫెస్టోలో ప్రకటించి, ఓడ దిగినంక బోడ మల్లన్న అన్నట్టుగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు సబ్సిడీ పథకాలు (Subsidy Loans) ఎప్పుడు అందుతాయంటూ అధికారుల చుట్టూ నిరుద్యోగ యువకులు కాల్లరిగేలా తిరుగుతున్నా తమకు భరోసా కానరావడం లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న నమ్మకంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే తమను పట్టించుకోకపోవటం దారుణమని వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేలాది మందికి వంద శాతం సబ్సిడీపై ఉపాధి పథకాలు మంజూరు చేసి వెలుగు నింపగా, ప్రస్తుతం వాటిని కూడా అర్థాంతరంగా నిలిపివేయడం శోచనీయమంటూ మండిపడుతున్నారు.
పాలన పగ్గాలు చేతబట్టి 15 నెలలు గడుస్తున్నా, ఇచ్చిన హామీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించటం పట్ల మైనారిటీ యువకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేండ్ల క్రితం నుంచి గతేడాది వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. వందల కోట్ల నిధులు కేటాయించి, సబ్సిడీతో కూడిన అనేక పథకాలు అమలు చేశారు. యువతకు నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే క్రమంలో ఉచిత శిక్షణ శిబిరాలు కూడా నిర్వహించారు. ప్రధానంగా ముస్లిం మహిళల కోసం అల్లికలు కుట్లు, కాస్మెటిక్స్ రంగం, ఇతర ఉపాధి అవకాశాల్లో శిక్షణ అందించి, సబ్సిడీతో కూడిన రుణాలు పంపిణీ చెందారు. 2018-19లో చిన్నతరహా ఉపాధి పరిశ్రమల ఏర్పాటుకు వంద శాతం సబ్సిడీతో వందలాది మందికి ₹50వేల చొప్పున గత ప్రభుత్వం అందజేసింది.
అలాగే, గతేడాది కూడా వందశాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పథకాలు మంజూరు చేశారు. జిల్లాలో 8వేలకు పైగా దరఖాస్తులు రాగా, నాలుగు వేల చిలుకు దాకా పరిశీలించి, అర్హులను ఎంపిక చేసి, మూడు విడుతల్లో అందచేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మొదటగా 174 మందికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున సబ్సిడీ రుణాలు పంపిణీ చేశారు. రెండో విడుతలో మరికొంత మందికి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పంపిణీకి తాత్కాలిక బ్రేక్ పడింది. ఎన్నికల అనంతరం రుణాలు విడుదల చేస్తామంటూ గత ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, అంతకు రెండింతల రుణం వందశాతం సబ్సిడీతో తాము అందజేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇప్పటివరకు మైనార్టీలకు ఉపాధి కల్పనపై నోరు విప్పకపోవడంతో మైనార్టీ యువత మండిపడుతోంది. కనీసం గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కూడా కొనసాగించకుండా నిలిపివేయడం పట్ల నిరసన తెలుపుతున్నారు. నాంకి వాస్తేగా కుట్టు మిషన్లు మాత్రం అందించి చేతులు దులుపుకోవటంపై వారి నుంచి తీవ్ర అసంతృప్తి వెలువడుతున్నది. ప్రభుత్వం స్పందించి వెంటనే ఇచ్చిన మాట నిలుపుకునేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ సర్కారు మైనార్టీల అభివృద్ధి కోసం చేసిన కృషిని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని మీర్జా అస్మత్ అలీ బేగ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో వందలాది మంది మైనార్టీలు సబ్సిడీ రుణాలు తీసుకొని ఉపాధి పొందుతున్నారు. అంతకు రెట్టింపు రుణాలు ఇస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో హామీలిచ్చి, గెలిచాక చేతులెత్తేయడం సరికాదని చెప్పారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా యువతకు వందశాతం సబ్సిడీతో కూడిన రుణాలిచ్చి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై తమలో వ్యతిరేకత మొదలైందని గమనించిన కాంగ్రెస్, తమ కుటుంబాల్లోని మహిళలకు కుట్టుమిషన్లు మాత్రమే ఉచితంగా అందజేస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అవేమీ తమకు వద్దని, స్వయం ఉపాధి పథకాలు మాత్రమే వర్తింపజేయాలన్నారు.