హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ విలీనంపై నాడు కేసీఆర్ ఇచ్చిన గెజిట్‌ను అమలు చేయలేక.. ఆర్టీసీ కార్మికులకు అపాయింటెడ్ డే ప్రకటించలేక.. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలపై అబద్ధాలు చెబుతూనే ఉన్నది. నాడు కేసీఆర్ వేసిన కమిటీనే సాకుగా చూపి ఆర్టీసీ విలీనం, యూనియన్ల పునరుద్ధరణపై తప్పించుకునేందుకు సిద్ధమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, యూనియన్లను పునరుద్ధరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక జేఏసీ ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ విలీనంపై కమిటీ వేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ పదేపదే చెప్పి, సమస్యల పరిష్కారం నుంచి తప్పించుకుంటుండటంతో ఆర్టీసీ కార్మిక జేఏసీ సూటిగా ప్రశ్నించింది.
ఆర్టీసీ విలీనంపై వేశామన్న కమిటీకి చైర్మన్ ఎవరు? సభ్యులు ఎవరు? అని నిలదీయడంతో మంగళవారం మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అందులో తాము కొత్త కమిటీ అంటూ వేయలేదని తెలిపింది. ప్రస్తుత కమిటీతోనే చర్చలు జరుగుతున్నాయని మంత్రి విడుదల చేసిన ప్రకటనలో ఉన్నది. ఆర్టీసీ విలీనంపై ఆ కమిటీ ఎన్నిసార్లు సమావేశమైంది? ఎక్కడ చర్చలు జరిగాయి? చర్చల్లో తీసుకున్న నిర్ణయాలు ఏంటి? అనే ప్రశ్నలకు మాత్రం వారి దగ్గర సమాధానం లేదు.
ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సెప్టెంబర్, 2023న కమిటీ ఏర్పాటుచేసిందని, ఆ కమిటీ చైర్మన్‌గా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, సభ్యులుగా కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ సెక్రటరీ, రోడ్డు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ ఉన్నారని మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటనలో స్పష్టంగా ఉంది. వారి చేతగానితనాన్ని దాచిపెట్టేందుకు ఎన్నికల షెడ్యుల్‌కు 10 రోజులకు ముందు విలీన అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని ఆ ప్రకటనలో పచ్చి అబద్ధాలు వల్లెవేశారు.
బీఆర్ఎస్ చేయలేని ఆర్టీసీ విలీనాన్ని తాము పూర్తి చేస్తామని 2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి నాడు కార్మికులను రెచ్చగొట్టారు. కమిటీ ఏర్పాటైన 10 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలై, నవంబర్ 30న ఎన్నికలు జరిగి, డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయని మంత్రి కార్యాలయం చెబుతున్నది. డిసెంబర్ 7, 2023న ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కుదురుకొక ముందే, 2024న మార్చి 16న లోకసభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో జూన్ 6 వరకు సుదీర్ఘంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని వివరించారు. 2024 జూన్ నుంచి నేటి వరకు దానిపై ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోగా, విలీనంపై ప్రతిసారీ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నాడు రాష్ర్టాభివృద్ధిలో కీలకంగా నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను.. ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 మే నుంచే విలీన కార్యాచరణ ప్రారంభించిన విషయం కార్మికులకు సైతం తెలుసు. అదే ఏడాది ఆగస్టులో అసెంబ్లీ సమావేశాల్లో కచ్చితంగా విలీనం పూర్తిచేయాలనే లక్ష్యంతో జూన్, జూలైలో నాటి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో చర్చించి విలీన అంశాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చింది.
అదే ఆగస్టులో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించిన కేసీఆర్.. ఆ బిల్లును గవర్నర్‌కు పంపించారు. ఆ సంచలనాత్మక ప్రకటనపై మొదట్లో నాటి గవర్నర్ తమిళిసై కొన్ని అభ్యంతరాలు తెలిపినా.. బీఆర్ఎస్ పోరాటం, కార్మికుల ఆందోళనలతో బిల్లుకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో 2023 సెప్టెంబర్ 30న కార్మికులకు అపాయింటెడ్ డే ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయలేక, వారి చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నదని కార్మికులు పేర్కొంటున్నారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మెపై నిర్ణయాన్ని కార్మిక జేఏసీ నేతలు వెనకి తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిషారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు ప్రభుత్వ పరిధిలో ఉన్నాయని, ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ పని చేస్తున్నదని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు సమస్యలు చెప్పుకొనేందుకు తలుపులు తెరిచే ఉన్నాయని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవలే ఆర్టీసీ ఉ ద్యోగులకు 2.1 శాతం డీఏ ప్రకటించామ ని తెలిపారు. పీఆర్సీ అంశం కూడా ఆలోచిస్తున్నామని పేరొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు.