హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామన్న జీవనభృతిపై కదలిక లేదు.. వారి కోసమే ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డు ఊసే లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే యాప్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ధ్యాసే లేదు. ప్రమాదబీమా సదుపాయం కల్పించాలన్న కనీస స్పృహ లేనేలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి 28 నెలలు గడిచినా ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒక్కహామీని అమలు చేయలేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటో కార్మిక కుటుంబాలు దుర్భరమైన బతుకులు గడుపుతున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా నష్టపోతున్న తమకు న్యాయం చేస్తామని, ఏటా రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని ఆనాడు కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని.. తీరా అధికారంలో వచ్చిన తర్వాత తమను అడ్డంగా మోసగించారని ఆవేదన చెందుతున్నారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత సుమారు 160 మంది వరకూ ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసి.. తమను నట్టేట ముంచుతారా? అని ఆటోడ్రైవర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం తమనెందుకు విస్మరిస్తున్నదని, 160 మంది ఆటో డ్రైవర్లవి ప్రాణాలు కావా? అని బాధిత కుటుంబాలు, ఆటో కార్మికులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం జీనవభృతి ఇస్తుందని, కార్పొరేషన్ ద్వారా ఆదుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నాడు ఆశలు కల్పించారని కార్మికులు చెప్తున్నారు. ఆ హామీ ఇచ్చి రెండున్నరేండ్లు గడిచినా నేటికీ ఆ దిశగా ప్రక్రియ చేపట్టడమే లేదని మండిపడుతున్నారు. పదుల సంఖ్యలో ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆటో కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్న కార్పొరేషన్ ఎక్కడ? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎందరో ఆటో డ్రైవర్లను ఆత్మహత్యల వైపు నడిపించిన పాపం ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. ‘మాపై ప్రభుత్వం ఎందుకు కనికరం చూప డం లేదు? ఇంకా ఎంతమంది చనిపోవాలి? ఎంతమంది చనిపోతే ఈ ప్రభుత్వానికి కనికరం కలుగుతుంది?’ అని ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసినట్టే తమనూ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఉచిత బస్సు ప్రయాణంతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికీ ప్రభుత్వం ఏటా రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. అవి ఎటూ సరిపోవని, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం కనీసం రూ.20 వేల చొప్పున జీవనభృతి ఇవ్వాలని నాటి నుంచీ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. 2023 డిసెంబర్ నుంచి ఇస్తామన్న రూ.12 వేల భృతిని ఏ ఒక్కరికీ ఇవ్వలేదు. ప్రభుత్వ లెకల ప్రకారమే తెలంగాణలో 5,10,265 ఆటో డ్రైవర్లు ఉన్నట్టు లెక్కలు తేల్చారు. ఏటా వీరికి రూ.12 వేల చొప్పున లెక్కగడితే సుమారు రూ.612.31 కోట్ల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం వచ్చి 28 నెలలు అవుతుండగా.. ఇప్పటివరకు ఆటో డ్రైవర్లకు రూ.1,714 కోట్లు ప్రభుత్వం బాకీపడింది. ఆటో డ్రైవర్లకు ఏటా ఇస్తామన్న రూ.12 వేలను 28 నెలలైనా ఎందుకివ్వలేదని బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.