హైదరాబాద్, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ) : గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కనీసం పాలను కూడా సరిగా అందించకుండా కాంగ్రెస్ సర్కార్ వారి కడుపుకొడుతున్నది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పాల కొరత పట్టి పీడిస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఈ సమస్య ఉ న్నా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. ఆయా కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు రోజు వారీగా అందిం చే పాలు సరఫరా కావడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే దుస్థితి నెలకొన్నది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) కోసం సమృద్ధిగా నిధులున్నా పాల కొరత పీడిస్తుండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి.
అంగన్వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు రోజూ 200 ఎంఎల్ పాలను అందిస్తారు. ఇందుకోసం అంగన్వాడీ కేంద్రాలకు ప్రతి రెండు నెలలకోసారి పాలు సరఫరా చేస్తారు. లీటర్ పరిమాణంలో ఉండే టెట్రా ప్యాక్ విధానంలో పాలను అందజేస్తారు. కేం ద్రాల్లో పాల ప్యాకెట్లు ఒడవక ముందే ఆయా కేంద్రాలకు మళ్లీ పాలు సరఫరా అవుతాయి. ఈ ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలో సాఫీగా సాగింది. కాంగ్రెస్ వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు కష్టాలు మొదలయ్యా యి.
ఇండెంట్ పెట్టి నెల రోజులు గడిచి, మళ్లీ ఇండెంట్ పెట్టే వరకు పాలను సరఫరా చేయడం లేదని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. ఒక్కోసారి నెల రోజులు కూడా పాలు అందివ్వలేని పరిస్థితి నెలకొంటున్నదని చెప్తున్నారు. ఈ ఏడాది సగటున 30 శాతానికి పైగా పాల కొరత ఏర్పడినట్టు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత డిసెంబర్లో మొత్తం 27.47 లక్షల లీటర్ల పాల సరఫరా చేయాల్సి ఉన్నదని, ఇప్పటి వరకు కేవలం 4.16 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేశారని లెక్క లు చెప్తున్నాయి. డిమాండ్లో కేవలం 15 శాతమే సరఫరా చేయడం సర్కారు తీరుకు అద్దం పడుతున్నది.
వాస్తవానికి అంగన్వాడీ కేంద్రాలు ఇండెంట్ సమర్పించిన 15- 20 రోజుల్లోనే పాలు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒక్క సంగారెడ్డి జిల్లా పరిధిలోనే దాదాపు 100 కేంద్రాల్లో 15 రోజుల నుంచి బాలింతలు, గర్భిణులకు పాలు అందించడం లేదని తెలిసింది. పాల సరఫరాపై మంత్రి సీతక్క పేరుకే సమీక్షలు చేస్తున్నారు తప్ప ఆచరణలో అడుగు ముందుకు పడింది లేదని అంగన్వాడీ టీచర్లే విమర్శిస్తున్నారు.
(నోట్ : 12 నెలల్లో డిమాండ్, సప్లయ్ మధ్య సగటు కొరత 30 శాతం కంటే అధికంగా ఉన్నది)
అంగన్వాడీ కేంద్రాలకు పాల సరఫరా విషయంలో లోపాలు వాస్తవమే. ఈ విషయంపై ఇప్పటికే మంత్రి సీతక్క కూడా అధికారులతో సమీక్ష నిర్వహించారు. సకాలంలో పాల సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో నెల రోజుల గడువు విధించాం. ఆ తర్వాత కూడా సకాలంలో పాలు సరఫరా చేయకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ కాంతి వెస్లీ