రంగారెడ్డి, జూన్ 5 (నమస్తే తెలంగాణ): దినదినం భూ సేకరణ గండం అన్నట్టుగా తయారైంది రంగారెడ్డి జిల్లా రైతుల పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భూసేకణకు తెరలేపింది. వరుసగా భూ సేకరణ నోటిఫికేషన్లు జారీచేస్తున్నది. దీంతో భూములు కోల్పోతున్న రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఎన్నో ఏండ్ల క్రితం ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములను ఇప్పుడు భూసేకరణ పేరుతో తీసుకోవడం తగదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఒకవైపు ఫార్మాసిటీ, గ్రీన్‌ఫీల్డ్‌రోడ్డు, ఇర్విన్ రిజర్వాయర్‌కు సంబంధించిన భూసేకరణలపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్నప్పటికీ, అవేవీ పట్టించుకోని ప్రభుత్వం తాజాగా మొయినాబాద్ మండలంలో గోశాల పేరుతో భూసేకరణకు నిర్ణయించింది. ఇలా వరుసగా వెలువడుతున్న భూ సేకరణ నోటిఫికేషన్లతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది.
కొన్నిచోట్ల ప్రభుత్వ భూములను తీసుకుంటుండగా, మరికొన్ని చోట్ల పట్టా భూములను సైతం ప్రభుత్వం సేకరిస్తున్నది. అయితే, భూసేకరణ సందర్భంగా ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. యాచారం మండలంలోని ఫార్మా అనుబంధ గ్రామాల రైతులకు ఇండ్ల స్థలాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీలను నెరవేర్చకుండానే భూముల చుట్టూ ఫెన్షింగ్ వేస్తుండటంతో రైతులు అడ్డుకున్నారు. దీంతో పలు గ్రామాల్లోని రైతులపై ప్రభుత్వం కేసులు నమోదుచేసింది. అలాగే, ఫ్యూచర్‌సిటీ కోసం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు కోసం సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ, పట్టా భూములను ప్రభుత్వం సేకరించే పనులను ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో రైతులు ఎక్కడికక్కడే అడ్డుకోగా, పోలీసుల అండతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వేను చేపట్టారు. అభిప్రాయ సేకరణ నిమిత్తం వస్తున్న అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం తమ భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. మరోవైపు, మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామంలో నిర్మించనున్న రిజర్వాయర్ కోసం భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ప్రభుత్వం ఆయా భూములకు ఎకరాకు రూ.8 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తుండటంతో రిజర్వాయర్ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
మొయినాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికెపల్లి గ్రామంలో గోశాల ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం గతంలో రైతులకు ఇచ్చిన భూములను తిరిగి భూసేకరణ ద్వారా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నది. అయితే, గోశాల పేరుతో తమ భూములను లాక్కోవద్దని రైతులు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు ఆయా భూములను పరిశీలించి గోశాల ఏర్పాటు కోసం వాటిని సేకరిస్తామని స్పష్టంచేశారు.
ప్రభుత్వం యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామంలో రైతులకు గతంలో ఇచ్చిన ప్రభుత్వ భూములను పరిశ్రమల ఏర్పాటు పేరుతో తీసుకోవడానికి నోటిఫికేషన్ కూడా జారీచేసింది. దీంతో అక్కడి రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మొండిగౌరెల్లిలో 40 ఏండ్ల క్రితం ప్రభుత్వం పేదలకు పట్టాలిచ్చిందని, వాటిని వెనక్కి తీసుకోవడం ఏమిటని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గురువారం రెవెన్యూ సదస్సుకు హాజరైన ఇబ్రహీంపట్నం ఆర్డీవోను తమ భూముల వద్దకు తీసుకెళ్లిన రైతులు.. వాటిని వెనక్కి తీసుకోవద్దని వేడుకున్నారు.
40 ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం భూములు లేని పేదలకు ప్రభుత్వ భూములపై అసైన్డ్ పట్టాలు ఇచ్చిందని రైతులు గుర్తుచేస్తున్నారు. ఆ భూములనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ భూములు తమవే అని ఇన్నాళ్లూ గర్వంగా చెప్పుకున్నామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం తమను భూముల నుంచి వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నదని రైతులు వాపోతున్నారు. తమ భూములను బలవంతంగా లాక్కొని తమను వీధిలో పడేయొద్దని కోరుతున్నారు.