KTR | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తేతెలంగాణ): రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించిన అంబేద్కర్‌ను నాటి నుంచి నేటి వరకు అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్‌పై అక్కసుతోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌లోని మహానుభావుడి 125 అడుగుల విగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని, వర్ధంతి నాడు దండ వేయడం కాదు కదా..? కనీసం శుభ్రం కూడా చేయకుండా వదిలేసి కుసంస్కారాన్ని చాటుకున్నదని నిప్పులు చెరిగారు. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన అంబేద్కర్ మార్గంలో కేసీఆర్ సబ్బండ జనులను ఏకంచేసి ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణను సాధించి పదేండ్లలో అన్నింటా ముందుంచారని, హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల ఎత్తుతో బాబాసాహెబ్ మహా విగ్రహాన్ని నిర్మించి ఆయన మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ సమక్షంలో ఆవిష్కరించారని గుర్తుచేశారు.
తెలంగాణ పాలనా సౌధం సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరుపెట్టి సమున్నతంగా గౌరవించారని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలరాస్తూ పాలనసాగిస్తున్నదని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణీదేవి, పార్టీ ముఖ్యులతో కలిసి బాబా సాహెబ్ చిత్రపటం వద్ద కేటీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై కోపంతోనే సీఎం రేవంత్‌రెడ్డి అంబేద్కర్ జయంతి, వర్ధంతి, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలేదని చెప్పా రు. అక్కడికి వెళ్లి శుభ్రం చేసి నివాళులర్పిద్దామనుకున్న తమపై నిర్బంధం విధించి అడ్డుకుంటుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దళితబంధు అడిగిన వారిపై కేసులు
దళితబంధుకు బదులు అభయహస్తం స్కీం తెస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన రేవంత్‌రెడ్డి, ఏడాదైనా ఎందుకు తేలేదని కేటీఆర్ నిలదీశారు. విద్యతోనే వికాసం వస్తుందని నమ్మి కేసీఆర్ ప్రభు త్వం అంబేద్కర్ ఓవర్సీస్ స్కీం తెచ్చి ఏడువేల మం ది దళితబిడ్డల విదేశీ చదువులకు బాటలు వేసిందని గుర్తుచేశారు. కానీ వారికి రెండో విడుత స్కాలర్షిప్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తున్నదని ధ్వజమెత్తారు. వారు విదేశాల్లో అల్లాడుతుంటే పట్టించుకోని సర్కారు, దళితబంధు అడిగిన వారిపై కేసులు పెడుతున్నదని దుయ్యబట్టారు. ‘ఇదేనా అంబేద్కర్‌కు ఈ సర్కారు ఇచ్చే నివాళి? ఇదేనా దళితులపై మీకున్న ప్రేమ?’ అని నిలదీశారు.
మేం ఎవరెస్ట్ ఎక్కిస్తే మీరు పాడెక్కిస్తున్నరు
నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించే కేసీఆర్ వెయ్యి గురుకులాలను స్థాపించారని, నాడు వారిని ఎవరెస్ట్ శిఖరం ఎక్కిస్తే, నేడు రేవంత్ ప్రభు త్వం పాడెనెక్కిస్తున్నదని కేటీఆర్ నిప్పులుచెరిగారు. 12 నెలల్లో 48 మంది గురుకుల విద్యార్థుల మరణమే ఇందుకు నిదర్శమని చెప్పారు. ‘దళిత పిల్లలు విద్యనభ్యసిస్తున్న గురుకులాలను నిర్లక్ష్యం చేయడమే మీరు అంబేద్కర్‌కు ఇచ్చే నివాళా?’ అంటూ ప్రశ్నించారు. గురుకులాల స్థితిగతులను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్వీ గురుకుల బా టను ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడం, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, విద్యార్థినేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రె స్ ప్రభుత్వ దోపిడీని ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి 12 గంటల పాటు నిర్బంధించిందని దుయ్యబట్టారు.
నెలరోజులు అసెంబ్లీ నిర్వహించాలి
చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని కాంగ్రెస్‌కు నమ్మకముంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలను నెలరోజులు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్ల ఘటన మొదలుకొని రైతుల ఆత్మహత్యలు, 420 హామీల వైఫల్యం, వ్యవసాయ రంగ సంక్షోభం ఇలా ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ‘రేవంత్‌రెడ్డీ..మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కారుకూతలు మానకుంటే ముఖ్యమంత్రి పదవికి గౌరవం కూడా ఇవ్వబోం’ అంటూ తేల్చిచెప్పారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ తరహాలో ఆయనకు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు.
12 కూల్చివేతలు.. 24 అణచివేతలు : సిరికొండ
‘కాంగ్రెస్ ఏడాది పాలనలో 3 తిట్లు.. 6 శాపనార్థాలు.. 12 కూల్చివేతలు, 24 అణచివేతలు.. 420 హామీల ఎగవేతలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీలేదు’ అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణను సాధించిన కేసీఆర్.. ఆ మహనీయుడి స్ఫూర్తితో పదేండ్లు అద్భుతంగా పాలించి ప్రజల కలలను సాకారం చేశారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి తెలంగాణ సెక్రటేరియట్‌కు ఆయన పేరుపెట్టి గౌరవించారని పేర్కొన్నారు. కానీ, ఏడాది కిందట గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి అంబేద్కర్ సెక్రటేరియట్లో కూర్చొని ఆయనను స్మరించడం లేదని తప్పుబట్టారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని చేతబట్టుకొని నీతి ప్రవచనాలు చెప్తున్నారని, తెలంగాణలో హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న తమ పార్టీ సర్కారును మాత్రం వెనకేసుకొస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దూదిమెట్ల బాలరాజు, నాయకులు సుశీలారెడ్డి, కిషోర్‌గౌడ్, తుంగ బాలు పాల్గొన్నారు. ‘కేసీఆర్ కట్టిన సచివాలయంలో, పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సమీక్షిస్తూ, ఫ్లై ఓవర్లను, యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభిస్తూ… కేసీఆర్ ప్రతిష్ఠించిన అంబేదర్ విగ్రహానికి మాత్రం నివాళులు అర్పించకుండా నిర్బంధిస్తారా? ఇది దళితుల మీద కక్షా, మహనీయుడు అంబేదర్ మీద వివక్షా?’ అని కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. జాగో తెలంగాణ జాగో అని ప్రజలకు సూచించారు.
‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు నిర్బంధిస్తున్నది ప్రశ్నించిన వారినో, హక్కులు అడిగిన వారినో కాదు! భారతరత్న బాబాసాహెబ్‌ను.. విశ్వవిఖ్యాతి గాంచిన మహానుభావుడి విగ్రహాలను హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీల్లో పెట్టి గౌరవిస్తుంటే.. కనీసం విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకపోవడం ఆయన కురుచబుద్ధికి నిదర్శనం.. 125 అడుగులున్న అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక నీ ఉద్దేశమేంది? ఆ మహానేత ఆలోచనా విధానాలను వ్యతిరేకిస్తున్నవా? లేక గతంలో పీవీ నర్సింహారావును కించపరిచిన కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలతోనే ఇలా చేసినవా?
-కేటీఆర్
రాజ్యాంగ పరిరక్షకుడిలా పోజులు కొట్టే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.. ఆ పార్టీ పాలిత రాష్ట్రంలో జరుగుతున్న హక్కుల హననాన్ని ఎందుకు పట్టించుకోవడంలేదు? ఉత్తరప్రదేశ్‌లో అడ్డుకున్న పోలీసులపై ఉక్రోశం వెళ్లగక్కిన రాహుల్.. అదే హోదాలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు, శాసనసభాపక్షనేతలను పోలీసులు అడ్డుకుంటున్నా ఎందుకు నోరు మెదపడం లేదు?
-కేటీఆర్