గజ్వేల్, ఫిబ్రవరి 7: సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో నాడు బాధితులను రెచ్చగొట్టిన రేవంత్‌రెడ్డి నేడు అధికారంలోకి రాగానే ముఖం చాటేశాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా పరిహారం, ప్యాకేజీ ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామం ఏటిగడ్డ కిష్టాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రాధాకృష్ణశర్మ పాల్గొన్నారు.
ప్రచారానికి ముంపు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండేండ్లు అయినా రూపాయి పరిహారం ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నాడు మీరు చేసిన త్యాగం చాలా గొప్పది.

మీ వల్లే నేడు లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు అందుతున్నాయి. ప్రతి ఒక్క రైతూ మీ త్యాగాన్ని తలుచుకోని రోజు ఉండదు’ అని కొనియాడారు. ముంపు గ్రామాల్లో బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కానీ, ముంపు గ్రామాల ప్రజలు ఎంతో ఆదరించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారని అన్నారు.
ముంపు గ్రామాల ప్రజల పక్షాన రెండు రోజులు దీక్ష చేసిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వస్తే పరిహారం రెట్టింపు ఇస్తామని ఇచ్చిన మేరకు ప్రతి కుటుంబానికీ తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన స్థానిక నాయకులు ఎక్కడున్నారని వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్కు వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక బయటి నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయి బీఆర్ఎస్ ప్రచార రథంపై ఫ్లెక్సీలు చింపేశారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ముంపు గ్రామాల్లోని ఆరు స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుందని ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.