హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ) : సర్కారీ కొలువు కోసం ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీ పట్టిన యువత ఆశలు ఇక గల్లంతు కాబోతున్నాయా?.. అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లిలో తీసుకున్న పోటీ పరీక్షల శిక్షణ అంతా వృథాయేనా? 12 ఏండ్లుగా అహోరాత్రులు పడ్డ శ్రమ బుడిదలో పోసిన పన్నీరు కాబోతున్నదా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఒకేసారి 12 ఏండ్ల వయోపరిమితి సడలింపు తొలగిపోనున్నది. ఇక నుంచి గరిష్ఠ వయోపరిమితి 34ఏండ్లే అమలుకానున్నది. జనరల్ క్యాటగిరీ 34 ఏండ్లు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలు మరో నాలుగేండ్లు అంటే 39 ఏండ్లలోపుంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీపడాలి. లేదంటే ఆశలు వదులుకోవాల్సిందే.
ఉద్యోగాల భర్తీలో గత కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన 10 ఏండ్లు, రేవంత్‌రెడ్డి సర్కార్ ఇచ్చిన రెండేండ్ల వయోపరిమితి సడలింపుల గడువు పరిమితి ముగిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో పదేండ్ల సడలింపునిచ్చి, రెండేండ్ల పాటు అమలవుతుందని అప్పట్లో స్పష్టంచేసింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పాత పదేండ్లకు తోడు మరో రెండేండ్ల సడలింపునిస్తూ 2024లో జీవోను విడుదల చేసింది. దీనికి రెండేండ్ల కాల పరిమితిని విధించగా ఆ గడువు ముగిసింది. దీంతో ప్రస్తుతం గరిష్ఠ వయోపరిమితి 34 ఏండ్లకు తగ్గింది. వయో పరిమితిని పొడిగించకపోవడంతో టీజీపీఎస్సీ జనవరి నెలలోనే సర్కార్‌కు లేఖ రాసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మార్చి నెలాఖరు వచ్చినా సర్కార్ ఒక నిర్ణయానికి రాకపోవడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ షాక్ తగిలినట్లయ్యింది. దీనికంతటికీ ప్రధాన కారణం కాంగ్రెస్సేనని నిరుద్యోగులు ఆగ్రహిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వయోపరిమితిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పొడిగించింది. ఉమ్మడి ఏపీలో నిరుద్యోగులకు న్యాయం జరగకపోవడం, యువత తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడంతో గరిష్ఠ వయోపరిమితిని ఏకంగా పదేండ్లకు పెంచింది. ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏండ్లు, దివ్యాంగులకు 54 ఏండ్ల గరిష్ఠ వయోపరిమితి అమలయ్యింది. ఇది రెండేండ్ల పాటు అమలు కాగా, ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభు త్వ ఉద్యోగాలకు 18 నుంచి 54 ఏండ్లవారు పోటీపడే అవకాశం వచ్చింది. ఒక్క నిర్ణయంతో ఇంటిల్లిపాది ఉద్యోగాలకు పోటీపడే వెసులుబాటు కలిగింది. ఆ తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండేండ్లు వయోపరిమితి సడలింపునిచ్చింది. దీంతో గరిష్ఠ వయోపరిమితి 46 ఏండ్లకు పెరిగింది. ఈ గడువు ముగియడంతో ఇప్పుడు 34 ఏండ్లకు పడిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సడలింపు కూడా వృథాయే అయ్యింది. రెండేండ్లు వయోపరిమితి ఉత్తదే అయ్యింది. సడలింపు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ రెండేండ్ల గడువుతో ఎవరికైనా ప్రయోజనం కలిగిందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రెండేండ్ల కాలంలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిందీ లేదు. ఉద్యోగాలను భర్తీచేసిందీ లేదు. ఈ రెండున్నరేండ్ల కాలంలో కీలకమైన పోలీసుశాఖలో, అటవీశాఖలో ఒక్క పోస్టును కూడా భర్తీచేయలేదు. గ్రూప్స్ పోస్టుల భర్తీని చేపట్టలేదు. చెప్పుకోదగ్గ పోస్టులను భర్తీచేసిన దాఖలాల్లేవు. వయోపరిమితి ముగియడం, సడలింపు లేకపోవడంతో నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ సర్కారే అడ్డంకులు సృష్టిస్తున్నది. రోజుకో తిరకాసుతో తప్పించుకుంటున్నది. తొలుత ఎస్సీ ఉప కులాల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వివాదం ముగియగానే బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎజెండాగా రాజకీయాలు చేసింది. ఆ తర్వాత తాజాగా గరిష్ఠ వయోపరిమితి సడలింపు అంశాన్ని పెండింగ్‌లో పెట్టింది. మరోసారి పొడిగించాలంటూ ఫిబ్రవరిలోనే టీజీపీఎస్సీ సర్కార్‌కు లేఖ రాసింది. అవకాశం దొరికినప్పుడల్లా ఇదే అంశంపై ఆరా తీస్తున్నది. ఈ అంశానికి ముగింపు పలికితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇంజినీరింగ్ వంటి 13శాఖల్లో 3,500పోస్టులను భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీ సమాయత్తమవుతుంది. కానీ ఉద్యోగాలు భర్తీచేయడం ఇష్టంలేని, నియామకాలు చేపట్టేందుకు సుముఖంగా లేని సర్కార్ దీనిని ఎటూ తేల్చడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా ప్రతిసారీ ఒక్కో అంశాన్ని తెరపైకి తేవడం, వాటికి పరిష్కారాలు చూపకుండా పెండింగ్‌లో పెడుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదని జేఏసీ నేతలు మండిపడుతున్నారు.