సూర్యాపేట, జనవరి 14(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో ఎస్సారెస్పీ కాలువలు అధ్వానంగా మారాయి. పొదలు, కంప చెట్లతో పూడుకుపోయి పంట పొలాల్లోకి నీళ్లు చేరక రైతులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. సాఫీగా పారాల్సిన గోదావరి జలాలు ఇలా కదల్లేక కదులుతున్న దుస్థితి ఎక్కడో కాదు.. స్వయంగా నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా సూర్యాపేటలోనే. బీఆర్ఎస్ హయాంలో ఖర్చుకు వెనుకాడకుండా ఏటా రూ.కోట్లు విడుదల చేయడమే గాక ఉపాధి హామీ పథకం కింద ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రం చేసేవారు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన రెండేండ్లలో నయాపైసా విదిల్చకుండా గాలికొదిలేసింది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మోటర్లు ఆన్ చేయడంతో ఈ నెల 7 నుంచి వారం పాటు నీటిని విడుదల చేసినా కాల్వలు అధ్వానంగా ఉండడంతో 60శాతం పంట పొలాల్లోకి చేరలేదు. ఈ వానకాలంలో కాస్త వర్షాలు బాగానే పడడంతో ప్రస్తుతానికైతే రైతులకు నీళ్ల డిమాండ్ లేకపోయినా మార్చి, ఏప్రిల్‌లో మాత్రం మళ్లీ పంటలు ఎండిపోవడం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశానికి వెన్నెముక అయిన రైతులను ఆదుకోవడమే ప్రభుత్వాల ముందుండే అత్యంత ప్రధాన లక్ష్యం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారితే.. ఆంధ్రా ప్రాంతం మాత్రం అన్నపూర్ణగా వెలుగొందింది. వేలాది టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా పాలకులు కనీసం పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయంలో వేల కోట్లు వెచ్చించి ఆర్భాటంగా శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టు కింద అక్కడక్కడా కాలువలు తవ్వారు తప్ప వాటిలో చుక్క నీటిని పారించలేదు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై మేడిగడ్డ వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించడంతో పాటు జిల్లాలోని బ్యాలెన్స్ కాలువలు తవ్వడంతో జిల్లా మొత్తం సస్యశ్యామలమైంది. 2017 వరకు ఎడారిగా ఉన్న గోదావరి జలాల ఆయకట్టులో 17వేలకు మించి వరి సాగు కాకపోగా తదనంతరం 2.70 లక్షల ఎకరాలు పచ్చని మాగాణమైంది. కానీ కాంగ్రెస్ పాలనలో గోదావరి జలాల ఆయకట్టు రైతులకు మళ్లీ పాతరోజులు దాపురించాయి. రెండేండ్లుగా వరి పంటలు రికార్డు స్థాయిలో ఎండిపోతుండడం తెలిసిందే.
ఓ వైపు నీళ్లు సరిపడా రాక వరి ఎండిపోతుంటే కాలువల్లో పూడిక పేరుకుపోతుండడంతో దిగువకు నీళ్లు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో మేజర్ కాలువలకు లైనింగ్, రెగ్యులేటర్లు, టన్నెల్, తూములు తదితరాల కోసం నాటి ప్రభుత్వం సుమారు నాలుగేండ్లలో రూ.120 కోట్లు మంజూరు చేసింది. దీంతో డీబీఎం-70, 71 కాలువలకు చాలావరకు లైనింగ్ పూర్తి చేయడంతో పాటు టన్నెళ్లను పూర్తి చేయడం, రెగ్యులేటర్లు, తూములకు షట్టర్లు బిగించింది. అంతేగాక ఏటా నాటి జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చొరవతో ఉపాధి హామీ పథకంతో కాలువల్లో పూడుకుపోయిన చెట్లు తొలగించి, 56కిలోమీటర్ల మేర పునరుద్ధరించడంతో చివరి ఆయకట్టు వరకు సాఫీగా నీళ్లు చేరాయి. ప్రస్తుతం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఇలాంటి గడ్డు పరిస్థితి ఉండడం గమనార్హం. ఈ యాసంగి కోసం గోదావరి జలాల విడుదలకు షెడ్యూల్ ప్రకటించగా తొలి విడత ఈ నెల 7నుంచి వారం పాటు నీటి సరఫరా కొనసాగింది. కానీ చివరి ఆయకట్టుకు నీటి చుక్క చేరలేదు. పెన్‌పహాడ్, మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు అసలే నీళ్లు చేరకపోగా ఇతర మండలాల్లో కూడా చివరి ఆయకట్టుకు చేరలేదు. వానకాలంలో వర్షాలు బాగానే పడడంతో ప్రస్తుతానికి బావులు, బోర్లలో కొంతమేర నీళ్లు ఉండి గోదావరి జలాలు చేరకున్నా ఇబ్బందులు కలుగలేదని, మార్చి, ఏప్రిల్ నాటికి ఇదే పరిస్థితి ఉంటే ఈసారి కూడా పంటలు ఎండిపోవడం ఖాయమని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలువల్లో పెరుగుతున్న పిచ్చి చెట్లతో పాటు పొదలను తొలగించి అవసరమున్న ప్రతిచోటా మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే.. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కనికరం చూపిస్తలేదు. ఆ నాడు గోదావరి జలాలు వద్దనేదాకా వస్తే రెండేండ్ల నుంచి పంటలు ఎండుడు తప్ప చుక్క నీరూ వస్తలేదు. వారం కింద నీళ్లు వదిలిండ్రంట. కానీ ఇప్పటివరకు మాకు రానేలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాల్వల్లో పూడిక తీయించి చివరి దాకా నీళ్లియ్యాలె.