హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అత్తమీద కోపం దుత్త మీద తీసినట్టుంది ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల వ్యవహారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, ఆ కోపాన్ని తమ కాలేజీలలో చదువుకున్న విద్యార్థులపై చూపిస్తున్నాయి ప్రైవేటు అటానమస్ కాలేజీ యాజమాన్యాలు. తమకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించేంత వరకు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ప్రొవిజనల్ మార్కుల వివరాలను జేఎన్టీయూకు పంపించే ప్రసక్తే లేదని మొండికేస్తున్నాయి. దీంతో కాలేజీల నుంచి విద్యార్థుల డాటా రాకపోవడంతో యూనివర్సిటీ వాళ్లు ఒరిజినల్ డిగ్రీ పట్టాలు రూపొందించలేకపోతున్నారు. ఈ పరిణామాల మధ్య విద్యార్థులు నష్టపోతున్నారు. ఫీజులకు, ఒరిజినల్ సర్టిఫికెట్లకు లింకు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. త్వరలో జరుగనున్న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో తాము డిగ్రీ పట్టాలు అందుకొనే అవకాశం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
30 వేల మంది విద్యార్థులపై ప్రభావం
అటానమస్ ఇంజినీరింగ్ కాలేజీల మొండివైఖరి దాదాపు 30 వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు రాష్ట్రంలో జేఎన్టీయూ పరిధిలో దాదాపు 90 వరకు ప్రైవేటు అటామస్ కాలేజీలు ఉన్నాయి. అవి పరీక్షలు సొంతంగా నిర్వహించి, ఫలితాలు విడుదల చేస్తాయి. విద్యార్థులకు ప్రొవిజనల్ మార్కుల మెమోలు సైతం కాలేజీ యాజమాన్యాలే రూపొందిస్తాయి. అనంతరం ఆ వివరాలను జేఎన్టియూకి పంపించాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ప్రైవేటు కాలేజీలు ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు, విద్యార్థుల మార్కుల మెమోలకు ముడిపెట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేది ఎప్పుడు? ఉత్తీర్ణత సాధించిన వారి వివరాలు యూనివర్సిటీకి పంపించేది ఎప్పుడోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
విద్యార్థుల డాటా తెప్పించండి..
ప్రైవేటు అటానమస్ ఇంజినీరింగ్ కాలేజీల నుంచి విద్యార్థుల ప్రొవిజనల్ మార్కులు వివరాలు తెప్పించి, తమకు డిగ్రీ పట్టాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జేఎన్టీయూ స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకుడు దిలీప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థులు జేఎన్టీయూ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల డాటాను తెప్పించేందుకు చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ వారికి హామీ ఇచ్చారు.