Congress | హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ)/మహబూబ్‌నగర్, మార్చి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి రెండు రోజుల్లో జరిగిన పైరెండు ఘటనలే నిదర్శనం. నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వం ఒకో పార్టీతో ఒకో విధంగా వ్యవహరిస్తుండటంపై రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతున్నది. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వస్తే పోలీసులతో ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది.
కనీసం మంత్రి, అధికారులను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. టన్నెల్ లోపలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. కాని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో వచ్చిన ఆ పార్టీ బృందానికి రాచమర్యాదలతో ఆహ్వానం పలికారు. ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచి ఏకంగా సొరంగంలోకి అనుమతిచ్చింది. బీజేపీ ప్రతినిధి బృందానికి దగ్గరుండి వివరించారు.
బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని ఎందుకు అడ్డుకున్నట్టు, బీజేపీ నేతలకు సకల ఏర్పాట్లు ఎందుకు చేసినట్టు? అని చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపాయన్న ప్రచారానికి తాజా ఘటన మరింత ఆజ్యం పోస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపీ ప్రతినిధి బృందం లోపలికి వస్తున్నదన్న సమాచారం తెలియగానే మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి సమీక్ష సమావేశాన్ని ఆపి మరీ బీజేపీ బృందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బీజేపీ బృందం పర్యటనతో కాంగ్రెస్, బీజేపీ ఒప్పందం బయటపడిందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందాన్ని టన్నెల్లోకి వెళ్లనివ్వకుండా, బీజేపీ నేతలనే అనుమతించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీలు ఒక్కటే అనేందుకు ఉదాహరణ ఇదే అన్నారు.
ఫిబ్రవరి 27: మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిశీలనకు వెళ్తే ప్రభుత్వం అడ్డుకున్నది. నేతలపై పోలీస్ కేసులు నమోదు చేసింది.
మార్చి 1: బీజేపీ నేతలు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రాగానే ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచి ఆహ్వానించింది. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు దగ్గరుండి వివరించారు.