హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): అంతా అనుకున్నట్లే అయ్యింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ సర్కారు మోసపు ముసుగు తొలిగిపోయింది. మోదీపై పోరాటం చేస్తాం, బీజేపీ ప్రభుత్వం మెడలు వంచు తాం అంటూ చేసినవన్నీ ఒట్టి ప్రగల్భాలేనని తేలిపోయింది. నిన్నటిదాకా రిజర్వేషన్ల పెంపునకు ఎంతవరకైనా వెళ్తామని హడావుడి చేసిన కాంగ్రెస్ పెద్దలు, ఇప్పుడు ఢిల్లీలో బేల పలుకులు పలికారు. తమ చేతగానితనాన్ని బయటపెట్టుకున్నారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. వాటిని లోతుగా పరిశీలిస్తే రిజర్వేషన్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదనేది స్పష్టమవుతున్నది. ఒకరేమో కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి బంతిని నెడితే.. మరొకరురాహుల్గాంధీ ప్రధాని పదవికి, బీసీ రిజర్వేషన్లను ముడిపెట్టారు.
ఈ రెండూ ఇప్పట్లో జరిగేవి కావనేది స్పష్టంగా తెలిసిన విషయాలే. కాబట్టి బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ సర్కారు ఆరు నెలలుగా ఆడుతున్నదంతా ఉత్త డ్రామానే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లుగా బీసీలను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి కనిపించడం లేదని, ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడం లేదని మొదటి నుంచీ విమర్శలు ఉన్నాయి. ఈ అంశాన్ని కాంగ్రెస్ సర్కారు రాజకీయ ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను వీలైనంత మేరకు మోసం చేసుకుంటూ, మభ్యపెట్టుకుంటూ కాలం గడుపుతున్నది. చివరికి ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది.
మా పని చేశాం.. ఇక కేంద్రం చేతిలో ఉంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఢిల్లీలో బుధవారం నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల ధర్నాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ‘బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం చేయాల్సిన చట్టబద్ధమైన పనులు పూర్తిచేశాం. పార్లమెంట్లో చర్చ కోసం మన ఎంపీలు పోరాడుతున్నారు. ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం తన పని పూర్తిచేసింది. ఇక కేంద్రమే ఆమోద ముద్రవేయాలి’ అని స్పష్టంచేశారు. జంతర్‌మంతర్ వద్ద చేస్తున్న ధర్నా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిందని, ఇందులో సందేహం లేదన్నారు. రాష్ట్రపతి వద్ద బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు చేపట్టిన ఈ ధర్నా ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలుపుకొంటుందన్నారు.
2029లో మోదీని గద్దె దించుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
రాహుల్ గాంధీని ప్రధానిని చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఢిల్లీ ధర్నాలో బీసీ రిజర్వేష్ల పెంపుపై ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ… ‘నువ్వు చేయి లేదంటే.. రాహుల్‌ను ప్రధానిని చేసి మేమే చేసుకుంటాం’అన్నారు. ‘2029లో మోదీని గద్దె దించి.. రాహుల్‌ను ప్రధానిని చేసి రిజర్వేషన్లు పెంచుతాం’ అన్నారు. రిజర్వేషన్ల కోసం మళ్లీ ఢిల్లీకి రామని స్పష్టంచేశారు. రేవంత్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై చేతులెత్తిసినట్లేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యల ప్రకారం 2029 వరకు బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యంకాదని స్పష్టమైందంటున్నారు. ఈ మాత్రం దానికి హడావిడి ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.