హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): హైడ్రా కూల్చివేతలతో పేదల గూడు చెదరగొట్టిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది. టీడీఆర్ (ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్) పేరిట ఎర వేస్తున్నది. చెరువు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ని ర్మించుకున్న ఇండ్లకు అనుమతులున్నా చూడకుండా అవన్నీ అక్రమ కట్టడాలేనంటూ కూల్చివేతలతో ఏడాదిన్నరగా విధ్వంసం సృష్టించిన రేవంత్ ప్రభు త్వం… ఇప్పుడు అదే భూములకు పరిహారం చెల్లించేందుకు కొత్త దుకాణం మొదలుపెట్టింది. ఇప్పటికే హైదరాబాద్లోని చెరువులను జీహెచ్ఎంసీ నుంచి హస్తగతం చేసుకునేందుకు సిద్ధమైన హైడ్రా.. ఆ చెరువుల వెంబడి ఉన్న నిర్మాణాలను కూల్చితే టీడీఆర్ రూపంలో పరిహారం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది.
గతంలో భూసేకరణతో భూములు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ ప్రభుత్వం టీడీఆర్ బాండ్ల రూపంలో పరిహారం చెల్లించింది. కోల్పోయిన భూమికి మూడింతల విలువతో కూడి న బాండ్లను తొలుత జీహెచ్ఎంసీ పరిధిలో అమలు చేసింది. దీనికి అనూ హ్య స్పందన రావడంతో భూసేకరణ సమస్యలు తలెత్తకుండా ప్రాజెక్టులు సజావుగా మొదలయ్యాయి. కానీ, ఆ టీడీఆర్ బాండ్లలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడు అదే పాలసీని ఇతర ప్రాజెక్టులకు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నది. టీడీఆర్ బాండ్లను జారీచేసి మౌలిక వసతుల ప్రాజెక్టులతోపాటు చెరువుల వెంబడి నిర్మించిన ఇండ్లు, ప్లాట్లను స్వాధీనం చేసుకునేందుకు స న్నాహాలు చేస్తున్నది. తద్వారా కూల్చివేతల ముద్రను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నది. తొలుత ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని 6 చెరువుల పరిసరాల్లో ఉండే ప్లాట్లు, ఇండ్లకు బాండ్లను ఇవ్వాలని సమాలోచన చేస్తున్నది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో సంప్రదింపులు జరుపుతున్న ప్రభు త్వం.. త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
అన్ని అనుమతులతో నిర్మించుకున్న వందల ఇండ్లను బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చిన రే వంత్ సర్కారు.. వాటిలోని పేద, మ ధ్యతరగతి వర్గాలను ఎన్నడూ ఆదుకోలేదు. ‘అక్రమం’ అని తేల్చిన ఇండ్లు, ప్లాట్లకు ఇప్పుడు కొత్తగా పరిహారం అంశాన్ని తెరమీదకు తీసుకురావడం వెనుక కాంగ్రెస్ నేతల ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా పరిగణిస్తున్న మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసుకునేందుకే టీడీఆర్ బాండ్ల పేరిట గూడుపుఠాణీ చేస్తున్నారని, ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్లున్న రేవంత్ సోదరుల్లాంటి బడా బాబుల కు పరిహారం పేరిట ప్రభుత్వ సొమ్ము ను పంచిపెట్టేందుకు కుట్ర జరుగుతున్నదని అభిప్రాయపడుతున్నారు.