అప్పు తీసుకొని ఎగ్గొట్టాలనుకున్నవాడు వాయిదాలు పెడుతూపోతాడు. అప్పిచ్చినవాడు ఎడతెగని ఆ వాయిదాలకు విసిగి వేసారి ఇస్తావా లేదా అని గట్టిగడిగితే ‘నా వద్ద లేవయ్యా.. ఏం చేసుకుంటావో చేస్కో!’ అని మొండికేస్తాడు. చివరికి ఈ మాట వినవస్తుందని అప్పుదారు ఊహించడు. మన ప్రభుత్వం వైఖరి, మన రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా వీరి లాగే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చదు. ఇంకెప్పుడని ముఖ్యమంత్రిని ప్రజలు నిలదీస్తే రాష్ట్రంపై ఇంత అప్పు ఉందని ముఖ్యమంత్రి అయ్యాకే తెలిసింది అని మాయ మాటలు చెప్పి, గత ప్రభుత్వాన్ని తిట్టిపోసి దాటేస్తున్నారు.
ప్రతిపక్ష నాయకులు హామీల గురించి మాట్లాడితే వ్యక్తిగత విషయాలెత్తి వారిని అవమానిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు నిలదీస్తే ‘ఎక్కడా అప్పు పుట్టడం లేదు. అందరు అనుమానంగా, దొంగలా చూస్తున్నారు. నన్ను ముక్కలుగా కోసినా రాష్ట్ర ఆదాయం పెంచలేను. వచ్చే సొమ్మును మీకే అప్పగిస్తాను. ఎలా సర్దుబాటు చేస్తారో చేయండి. ఏ సంక్షేమ పథకాన్ని ఆపి మీకు చెల్లించాలో చెప్పండి?’ అని మన ముఖ్యమంత్రి ఎదురు ప్రశ్నిస్తూ చేతులెత్తేస్తున్నారు.
తమను ప్రభుత్వ ఉద్యోగుల లెక్కల్లోకి చేర్చుకోకపోతే సమ్మెకు వెళ్తామని టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చిన నోటీసుకు పరోక్షంగా ఆయన మే నెలలో ఈ మాటలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, ఇతర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులకే కాకుండా రిటైరీలకు కూడా ఈ మాట వర్తిస్తుంది. ఎంత బకాయి పడినా అభ్యర్థనలు, హెచ్చరికలు చేయడమే తప్ప ఎలాంటి కార్యాచరణకు దిగే సాహసం ఉద్యోగ సంఘాలు చేసే పరిస్థితి లేదు. ‘జనాభాలో 2 శాతం ఉన్న ప్రజా సేవకులు.. పన్నుల ద్వారా తమకు జీతాలు చెల్లించే ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తారా?’ అని ముఖ్యమంత్రి నీతి మాటలు చెప్తున్నారు. అదే మాట హామీ ఇచ్చిన పార్టీలకు, వ్యక్తులకు కూడా వర్తిస్తుందని విషయాన్ని ప్రభుత్వం గ్రహించడం లేదు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కల్యాణలక్ష్మి తులం బంగారం ఎప్పుడిస్తారని ఒక వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావును అడిగితే ‘ఇంకెక్కడి లక్ష్మీరా నాయనా.. తులం బంగారం లక్షన్నర అయింది. యాడికెళ్లి ఇస్తాం?’ అని సమాధానమిచ్చారు. పోయిన డిసెంబర్లో ఉన్న ధర ప్రకారం ఎంత బంగారం వస్తే అంత ఇస్తాం అని ఓ నేత అన్నారు. తులం బంగారం సంగతి కూడా తేలిపోయింది. ఆడబిడ్డకు చీర పెట్టడానికి కూడా ఈ సర్కారుకు వాయిదాలు కావాలి. గ్రామ సర్పంచ్ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండటంతో చీరల పంపిణీ ముందుకు జరిగింది. సోనియమ్మ బర్త్ డే డిసెంబర్ 9 నుంచి ఈ ముహూర్తం ఇందిరమ్మ జయంతి నవంబర్ 19కి మారింది. 65 లక్షల మహిళా సంఘాల సభ్యురాళ్లకే చీరలు ఇస్తామన్న మాట పోయి గత ప్రభుత్వం మాదిరే కోటి మంది మహిళలకు ఇస్తామని చెప్పక తప్పడం లేదు. సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా అందులో మరో తిరకాసు పెట్టారు. మొదటి దశలో డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేపట్టి, నగర మహిళలకు వచ్చే సంవత్సరం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఖరారు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో మహిళల ఓట్ల ఆకర్షణకు ఈ చీరలను వాడుకుంటారన్నమాట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోటి మంది ఆడపడుచులకు ఏడాదికొక చీర బతుకమ్మ పండుగకు అందగా, రేవంత్ పాలనలో ఐదేండ్లకో చీర అని కూడా గ్యారెంటీ లేకుండా పోయింది.
కాంగ్రెస్ పార్టీ హామీలు ఎక్కడివక్కడే పడి ఉన్నాయని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రతిపక్షాలు చెప్పినా గెలుపు తమదే కావడంతో రేవంత్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. హామీలు అమలుచేయకున్నా పర్వాలేదు, ప్రజలు వాటిపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదనే ధీమా కూడా ఏర్పడవచ్చు. జూబ్లీహిల్స్ విజయాన్ని రెండేండ్ల పాలనకు మొత్తం రాష్ట్ర ప్రజల తీర్పుగా భావిస్తే తప్పులో కాలేసినట్టే. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం పాప ప్రక్షాళన జరిగినట్టు సంతోషంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ విజయం వెనుక కాంగ్రెస్ గొప్పతనమేమీ లేదు. స్థానిక అభ్యర్థి అంగ అర్థబలం, ఎంఐఎం తోడ్పాటు, బీజేపీ అనాసక్తి కలిసి జూబ్లీహిల్స్ కప్‌ను కాంగ్రెస్ చేతిలో పెట్టాయి.
ఈ విషయాన్ని కాంగ్రెస్ దాచినా, నవీన్ యాదవ్ కుటుంబం మాత్రం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నది. నవీన్ యాదవ్ తండ్రి స్వయంగా ఎంఐఎం ఆఫీసుకు వెళ్లి అసదుద్దీన్ ఒవైసీని సత్కరించి ఎన్నికల్లో గెలుపునకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయన శివసేన నేతను కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ గెలుపు కాంగ్రెస్‌కు ఒక శాసనసభ్యున్ని ఇవ్వటమే కాకుండా స్థానిక దాదాలకు కొత్త బలాన్నిచ్చింది. నవీన్ యాదవ్ తండ్రి ఒక బీఆర్ఎస్ శాసనసభ్యుని పేరు ఎత్తుకొని నోటికొచ్చినట్టు మాట్లాడిన ఇంటర్వ్యూ వీడియో ఒకటి బయటికి వచ్చింది.
బీసీల రిజర్వేషన్లు తేల్చకుండానే స్థానిక ఎన్నికలకు వెళ్లడం మరో దగా. ఆసరా పింఛన్లు పెంచకుండానే స్థానిక ఎన్నికలను దాటే అవకాశం కూడా ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదు కాబట్టి గెలిచినవారికి పార్టీ కండువా కప్పి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని తప్పించుకోవచ్చు. ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే ప్రజలను మభ్యపెట్టే విద్యలో కాంగ్రెస్ ఆరితేరుతున్నది.
-బద్రి నర్సన్