కాగజ్‌నగర్, నవంబర్ 19: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని మొట్లగూడ, రావులపల్లి గ్రామాలకు చెందిన 30 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. కాగజ్‌నగర్‌లోని ప్రాణహిత నిలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో గ్రామీణ అభివృద్ధి కుంటుబడిందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలోనే పల్లెల అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారని తెలిపారు.