హైదరాబాద్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన పెసర రైతులకు కాంగ్రెస్ సర్కారు మరింత నష్టం చేస్తున్నది. చేతికొచ్చిన కొద్ది పంటను కూడా కొనుగోలు చేసేందుకు ససేమిరా అంటున్నది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి చేతులు దులుపేసుకున్నది. కేంద్రం అనుమతిస్తే కొనుగోలు చేస్తాం.. లేదంటే లేదనేలా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ తీరుతో రాష్ట్ర వ్యాప్తంగా పెసర రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 65 వేల ఎకరాల్లో పెసరు సాగు కాగా సుమారు 20 వేల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంటల దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించిన సర్కారు ఇప్పటి వరకు పరిహారం ప్రకటించలేదు. కనీసం వర్షాలకు పోగా మిగిలిన కాస్త పంటనైనా కొనుగోలు చేస్తుందా అంటే అదీ లేదు. అంతేకాకుండా తడిసిన, రంగుమారిన పంటను కొనుగోలు చేయబోమ ని మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి నాణ్యతలేని, తడిసిన, రంగుమారి న పంటను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కానీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవే టు వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగో లు చేసి రైతులను నిలువునా దోచుకుంటున్నా రు. ఈ విధంగా రైతులను కాంగ్రెస్ సర్కారు అన్ని రకాలుగా నష్టం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మద్దతు ధర లేదు.. మార్క్‌ఫెడ్ కొనదు
మార్కెట్లో పెసర ధర భారీగా పడిపోయింది. మద్దతు ధర క్వింటాలుకు రూ. 8,768 ఉండగా మార్కెట్లో రూ. 3,500 నుంచి రూ. 4 వేలు మాత్రమే పలుకుతున్న ది. సగానికి సగం ధర పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని వాపోతున్నారు. వాస్తవానికి మార్కెట్లో మద్దతు ధర కన్నా ధర తక్కువగా ఉంటే మార్క్‌ఫెడ్ ద్వారా పంట కొనుగోలు చేయాలి. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే ప్రైవే టు వ్యాపారులు సైతం దారిలోకి వస్తారు. కానీ మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం తో ప్రైవేటు వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నిలువునా దోచుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా పరోక్షంగా ప్రైవేటు వ్యాపారులకు మేలు చేస్తూ రైతులను ముంచుతున్నదనే ఆరోపణలున్నాయి.
చేతులెత్తేసిన రాష్ట్రం.. కేంద్రంపైనే ఆధారం
పెసర పంట కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. కొనుగోలు భారాన్ని కేంద్ర ప్రభుత్వంపై మోపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దయతలిస్తే రైతులు ఈ కష్టాలు, నష్టాల నుంచి బయటపడతారు. లేదంటే అంతే సంగతి. ఈ మేరకు పెసర పంట కొనుగోలుకు సంబంధించి మార్క్‌ఫెడ్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. పదిహేను రోజుల క్రితమే ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు రాలేదు. కేంద్రం నుంచి అనుమతి రాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేయాలి. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికే రైతులు నష్టానికే పంటను విక్రయిస్తున్నారు. ఒకవేళ మార్క్‌ఫెడ్ పెసర కొనుగోలు ప్రారంభిస్తే దాదాపు 5 వేల టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని అంచనా. అంటే మహా అయితే రూ. 40-45 కోట్లు ఖర్చవుతుంది. కానీ కాంగ్రెస్ సర్కారు రైతుల కోసం ఆ మాత్రం కూడా ఖర్చు చేసేందుకు వెనుకంజ వేస్తుండడం గమనార్హం.
ముగ్గురు మంత్రులున్నా ప్రయోజనం సున్నా
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు పెసర పంటను విక్రయించేందుకు యుద్ధమే చేస్తున్నారు. మార్కెట్లలో పంటను పోసి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అక్కడి అధికారులు తమకు పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, తాము కొనలేమని తేల్చి చెప్తున్నారు. దీంతో రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు కాస్తున్నారు. వర్షాలకు పంట తడుస్తున్నా.. మళ్లీ ఆరబెడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఖమ్మం జిల్లాకు కీలకమైన ముగ్గురు మంత్రులున్నారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉండగా మరీ ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం. ఇలా కీలకమైన ముగ్గురు మంత్రులున్నప్పటికీ కనీసం రైతుల పెసర పంట కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొన్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
క్వాలిటీ లేదు..పెసర్లు కొనలేం
వర్షాలకు పెసర పంట పూర్తిగా పాడైంది. ఎఫ్ఏక్యూ ప్రకారం లేదు. క్వాలిటీ లేదు. తడిసిన, రంగుమారిన పంటను కొనుగోలు చేయలేం. కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాం. ఒకవేళ అనుమతి వస్తే కొనుగోలు చేస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్