Urea Shortage | హైదరాబాద్/సిద్దిపేట, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతులకు యూరియా కొరత తీర్చలేని కాంగ్రెస్ సర్కార్.. దాన్ని కప్పిపుచ్చేందుకు అడ్డదారులు వెతుకుతున్నది. పూటకో డ్రామా తెరపైకి తెస్తున్నది. మొన్న ‘యూరియా యాప్’ అట్టర్‌ఫ్లాప్ కావడంతో ఇప్పుడు మరో నాటకానికి తెరలేపింది. ఇప్పుడు కొత్తగా ‘పంటల నమోదు, సమగ్ర ఎరువుల యాజమాన్య పత్రం’ విధానం తెచ్చింది. ప్రతి రైతుకూ ‘యూరియా కార్డు’ అందించి అది ఉంటేనే యూరియా పంపిణీ చేయనున్నది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నది. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా రైతులకు యూరియా కార్డులు పంపిణీ చేస్తున్నది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు చేస్తున్నది. తద్వారా ఎరువుల దుకాణాల వద్ద రైతుల క్యూలు కనిపించకుండా చేయాలని భావిస్తున్నది. దీంతో పాటు ఎరువుల కొరత లేదని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా రైతులకు యూరియా కార్డుల పంపిణీ మొదలైంది.
గ్రామాల్లో ఏఈవోలు కార్డులు పంపిణీ చేస్తున్నారు. పంపిణీలో సర్కార్ ఆంక్షలు పెడుతున్నది. యూరియా కావాలంటే రైతులు కచ్చితంగా కార్డు తీసుకెళ్లాల్సిందే. లేదంటే పంపిణీ చేసే ప్రసక్తే లేదని అధికారులు చెప్తున్నారు. యూరియా కార్డుతో పాటు పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు తేవాలని ఆదేశాలు జారీచేశారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు రైతులకు ఆ విషయాన్ని చేరవేస్తున్నారు. అయితే చాలా గ్రామాల్లో అధికారులు యూరియా కార్డులు పంపిణీ చేయకుండా రైతులను జిరాక్స్ తెచ్చుకోవాలని సూచిస్తున్నట్టుగా తెలిసింది. యూరియా కార్డు పీడీఎఫ్ ప్రతిని గ్రామాల సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నట్టు సమాచారం. గ్రామాల్లో జిరాక్స్ సెంటర్లు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిరాక్స్‌ల కోసం మళ్లీ పట్టణ ప్రాంతాలకు వెళ్తున్నారు.
యూరియా కోసమే కాదు.. ఇప్పుడు కార్డుల కోసమూ రైతులు పరుగులు పెడుతున్నారు. ప్రతి క్టస్లర్ వద్ద బారులు తీరుతున్నారు. ఒరిజినల్ పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, లింక్ ఉన్న ఫోన్ నంబర్‌ను తీసుకెళ్లి కార్డులు రాయించుకుంటున్నారు. ఒరిజినల్‌తో పాటు జిరాక్స్ పేపర్లు తీసుకురమ్మంటున్నారు. కార్డుకు పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతిని జత చేస్తున్నారు. కార్డు తీసుకున్నాక రైతులు తమ క్లస్టర్ పరిధిలోని దుకాణానికి వెళ్లి తెచ్చుకోవాలి. అక్కడ లేకుంటే మండలంలోని ఏ దుకాణానికైనా వెళ్లి తెచ్చుకోవాలి. ఒక్కసారి యూరియా తీసుకున్నాక సదరు రైతు తిరిగి 15-20 రోజుల తర్వాతే (కార్డులో రాసిన విధంగా బ్యాలెన్స్ ఉంటేనే) రెండో సారి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఫర్టిలైజర్ షాపుల వారు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. యూరియా కోసం పోతే వివిధ రకాల ఫెస్టిసైడ్స్ కొంటేనే యూరియా ఇస్తామని కొర్రీలు పెడుతున్నట్టు రైతులు వాపోతున్నారు. కార్డు విధానం రావడంతో రెండు సార్లు క్యూ కట్టాల్సి వస్తున్నదని, ఇదేం ప్రభుత్వమని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇబ్బందుల్లేకుండా యూరియా సరఫరా చేసినట్టుగానే ఇప్పుడూ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు తాము సాగు పనులు చేసుకోవాలా? యూరియా కోసం వ్యవసాయాధికారుల చుట్టూ, ఫరిలైజర్ దకాణాల చుట్టూ తిరగాలా? అని నిలదీస్తున్నారు.
కోతలు కామన్
యూరియా పంపిణీలో కోత పెట్టేందుకు తెచ్చిన యాప్ అట్టర్‌ఫ్లాప్ అయింది. దీంతో అదే స్థానంలో ప్రభుత్వం యూరియా కార్డు తెచ్చింది. అయితే ఈ రెండింటిలో ఎలాంటి మార్పూ లేదు. పేరు, రూపం మారిందే తప్ప! యూరియా కోతలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. యూరియా కార్డుల ద్వారా రైతుల నుంచి సవాలక్ష వివరాలను సేకరించనున్నారు. రైతుల పేరు, ఊరు, ఫోన్ నంబర్, ఆధార్, పట్టాదార్ పాస్ పుస్తకం నంబర్, రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు? ఏ పంటను ఎన్ని ఎకరాల్లో వేశారు? సాగు ప్రకారం రైతులకు ఎన్ని బస్తాల యూరియా ఇవ్వాలి? రైతులు ఎన్ని బస్తాల యూరియా తీసుకెళ్లారు? ఎరువుల దుకాణం పేరు, డీలర్ పేరు ఇలా అన్ని వివరాలను యూరియా కార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. చివరికి రైతులు యూరియా కార్డుల్లో సంతకం చేసి యూరియా బస్తా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొరత, క్యూలు కనిపించొద్దనే!
యూరియా పంపిణీ కోసం కాంగ్రెస్ సర్కారు నిన్న యాప్ తీసుకొచ్చినా, నేడు కార్డు తెచ్చినా రెండింటిదీ ఒకే ఉద్దేశం! ఎరువుల దుకాణాల ముందు రైతుల క్యూలు కనిపించొద్దు, యూరియా కొరత కనిపించొద్దు! ఇందుకే సర్కార్ నానా తంటాలు పడుతున్నది. యూరియా కొరత తీర్చి రైతులకు మేలు చేయాల్సింది పోయి కొరత, క్యూలను కప్పిపుచ్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెడుతున్నది. ఇందులో భాగంగానే పూటకో నాటకం ఆడుతున్నది. కాంగ్రెస్ వచ్చాక యూరియా కొరత తీవ్రమైంది. ఒక్క బస్తా యూరియా కోసం రైతులు యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వానకాలం, యాసంగి తేడా లేకుండా రైతులు యూరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా, ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. కుటుంబమంతా పనులు వదులుకొని యూరియా బస్తాల కోసం క్యూ కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. మొన్నటి వానకాలంలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం యాసంగికైనా యూరియా కష్టాలు తీరుతాయోమోనని భావించారు. కానీ రెట్టింపవుతున్నాయి. నాటి కష్టాలకు తోడు ఇప్పుడు యాప్, కార్డులు అంటూ సర్కార్ కొత్త కష్టాలను జత చేస్తున్నది. ఓవైపు యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులను ప్రభుత్వం కార్డు పేరిట తిప్పలు పెట్టడమే కాకుండా ఖర్చులు కూడా పెట్టిస్తున్నది.
మాకు ఎందుకీ గోస?
మునుపు కేసీఆర్ ఇచ్చినట్టే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు యూరియా ఇయ్యాలె. మొన్న ఫోన్ యాప్ అన్నరు. ఇప్పుడు కార్డుల మీద రాసి యూరియా బస్తాలు ఇస్తున్నరు. ఈ ప్రభుత్వం మా రైతులను ఇంత గోస ఎందుకు పెడుతున్నదో అర్థమైతలేదు. ఫోన్ యాప్, యూరియా కార్డు లేకుండా రైతులకు సరిపడా యూరియా ఇయ్యాలె.
-రంగన బోయిన బాగయ్య,రైతు, మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా
20 గుంటలున్నోళ్లు ఏంగావాలె?
ఎకరం భూమున్న రైతులకు యూరియా కార్డుల మీద వరికి మూడు యూరియా బస్తాలిస్తే 20 గుంటల భూమి ఉన్నోళ్లకు ఏ విధంగా ప్రభుత్వం యూరియా ఇస్తదో చెప్పాలె. కేసీఆర్ ఇచ్చినట్టుగా పాత లెక్కనే రైతులకు యూరియా ఇచ్చి ఇబ్బందుల్లేకుండా చూడాలె. ఫోన్ యాప్, యూరియా కార్డులు అంటే రైతులు తిప్పలు పడుతరు. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా ఇయ్యాలె.
– మద్దెల లక్ష్మయ్య, రైతు,మిరుదొడ్డి, సిద్దిపేట జిల్లా