మొన్న స్వచ్ఛ్ బయో!.. నిన్న గోడి ఇండియా!.. నేడు ఊరూపేరూ లేని ఉర్సా!
ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బండారం బద్దలవుతున్నది. పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. వాటికి బలం చేకూర్చేలా మరో అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత జనవరిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న ‘ఉర్సా క్లస్టర్స్’ ఉత్త బోగస్ కంపెనీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Congress Govt | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందానికి మూడు నెలల ముందే సదరు ఉర్సా కంపెనీ పురుడు పోసుకోవడం, అమెరికాలో రిజిస్టర్ అయిన ఆ సంస్థలో ఇద్దరు తెలుగు వ్యక్తులే డైరెక్టర్లుగా ఉండటం, అటు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం.. ఇటు తెలంగాణలోని రేవంత్ సర్కార్ రెండూ ఊరూపేరూ లేని ఉర్సా కంపెనీతో రూ.వేలకోట్ల ఒప్పందాలు కుదుర్చుకోవడం సందేహాలకు తావిస్తున్నది. కేవలం రూ.10 కోట్ల షేర్క్యాపిటల్ ఉన్న కంపెనీ.. రూ.5,000 కోట్లు పెట్టుబడి పెడ్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకోగా.. ఏపీలో రూ.5,700 కోట్ల పెట్టుబడికి బాబు సర్కార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఉనికే లేని ఉర్సా క్లస్టర్ సంస్థకు బాబు సర్కారు విశాఖలో ఏకంగా 59 ఎకరాలు కట్టబెట్టడం వివాదాస్పదమవుతున్నది.
ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా సదరు కంపెనీ తెలంగాణలో 100 మెగావాట్ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 24న ఈ ఒప్పందం జరుగగా, అప్పటికి ఆ కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించనేలేదు. కేవలం ఒప్పందానికి మూడునెలల ముందు.. గత సెప్టెంబర్ సెప్టెంబర్ 27న ఆ సంస్థ యూఎస్‌లో రిజిస్టరైంది. ఇవన్నీ సంస్థపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. యుఎస్‌లో కంపెనీ రిజిస్టర్ అయిన అడ్రస్‌లో కంపెనీకి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లూ లేవని, కనీసం ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ కూడా లేవనే ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ వేళ సమర్పించిన వివరాల ఆధారంగా చూస్తే.. ‘సింగిల్ట్రీ సిటీ ప్లెసాంటన్, సీఎఫ్-94588-యూఎస్ఏ’ అడ్రస్‌లో ఓ 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ట్రిపుల్ బెడ్రూం ఇల్లు మాత్రమే ఉన్నది. అక్కడ కనీసం పదిమంది ఉద్యోగులు కూడా లేరనే విమర్శలున్నాయి. అంతేకాదు, ఉర్సా ఎల్ఎల్సీ అండ్ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయని, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ మధ్యనే ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన బోర్డు సమావేశంలో ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ షేర్లు బదలాయించినట్లు రికార్డులు చెప్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఈ రెండు కంపెనీలకు కనీసం ఒక ఫోన్ నంబర్ కానీ, ఈ-మెయిల్ ఐడీ కానీ లేవు. దీంతోపాటు ఈ రెండు కంపెనీలు ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలూ లేవు. ఇన్నివేల కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కనీసం సరైన ఆఫీస్ కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అయితే సంస్థ వివరాలేవీ చూడకుండా ప్రభుత్వాలు ఒప్పందానికి వెళ్లడం అనుమానాలకు తావిస్తున్నది.
ప్రభుత్వం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. అక్కడున్న తెలుగువారితోనే ఒప్పందాలు చేసుకుంటుండటం గమనార్హం. కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్సైట్ వివరాల ప్రకారం ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా సరిగ్గా రెండు నెలలక్రితం 2025 ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. రూ.10 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్‌తో ఇద్దరు డైరెక్టర్లతో ఈ కంపెనీ రిజిస్టర్ చేశారు. ఇందులో డైరెక్టర్లుగా కౌశిక్ పెందుర్తి, సతీశ్ అబ్బూరి ఉన్నారు. కౌశిక్ పెందుర్తి ప్రస్తుతం ‘టాలస్ పే’ అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తుట్టు ఆయన లింక్డిన్ అకౌంట్ తెలియజేస్తున్నది. అంటే కౌశిక్ అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ స్థాయిలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి అని తెలుస్తున్నది. ఇక సతీశ్ అబ్బూరి ‘ఎల్సీయం అనలిటిక్స్’కు వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతోపాటు యూఎస్‌లో రిజిస్టర్ అయిన ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీలోనూ ఈ ఇద్దరే డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ లయబిటీ కంపెనీని కూడా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తరువాత, అంటే 2024 సెప్టెంబర్ 27న రిజిస్టర్ చేశారు. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకొంటూ ఇండియా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను 2025 ఫిబ్రవరి 19న రిజిస్టర్ చేశారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అడ్రస్‌గా ‘ఫ్లాట్ నంబర్-705, ఏక్తా బాసిల్ హైట్స్, కొత్తగూడ, హైదరాబాద్’ చిరునామాతో ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌ను చూపించారు. కాగా, అకడ కూడా ఎటువంటి కార్యాలయం లేకపోగా.. ఈ మూడు బెడ్రూమ్ల ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటుండటం గమనార్హం. కేవలం 2 నెలల వయసున్న, కనీసం ఒక ఆఫీస్, ఫోన్‌నంబర్, వెబ్సైట్ కూడా లేని కంపెనీతో ఇటు తెలంగాణ, అటు ఏపీ రాష్ర్టాలు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకోవడం, ఏపీ ప్రభుత్వం రూ.వందల కోట్ల విలువ చేసే భూములను కంపెనీకి కేటాయించడం సందేహాలకు తావిస్తున్నది.
రూ.10 కోట్ల క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్‌తో మొదలైన కంపెనీ రెండు తెలుగు ప్రభుత్వాలతో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుకోగలిగిందన్నది అందరినీ విస్మయపరుస్తున్నది. దీనివెనుక ఎవరున్నారనేది ఆసక్తిగా మారింది. ఒప్పందాలు జరగడానికి కొద్దిరోజుల క్రితమే కంపెనీలు రిజిస్టర్ కావడం, అందులో డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరూ తెలుగువారే కావడం, రెండు తెలుగు రాష్ర్టాలతో ఒప్పందాలు చేసుకోవడం పలు సందేహాలకు తావిస్తున్నది. అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ దావోస్‌లో పెట్టుబడుల కోసం పోటాపోటీగా ప్రయత్నించినట్టు అప్పట్లో ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేసుకున్నాయి. ఆ సందర్భంగా ప్రకటించిన పెట్టుబడుల్లో నిజాయితీ ఎంతని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తూ వచ్చాయి. షెల్ కంపెనీలతో పెట్టుబడుల దోబూచులాట జరుగుతున్నదన్న అనుమానాలనూ అవి వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలో రూ.5,728 కోట్ల ప్రాజెక్టు విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈనెల 10న జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశంలో 17 సంస్థలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, ఆయా పరిశ్రమల స్థాపనకు వివిధ జిల్లాల్లో భూముల కేటాయింపునకు చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 59 ఎకరాల భూమిని కేటాయించింది. మారెట్ ధర ప్రకారం ఆ భూమి విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటు తెలంగాణ ప్రభుత్వంతో రూ.5,000 కోట్ల ఒప్పందం చేసుకున్న కంపెనీతోనే ఏపీ సైతం ఒప్పందం చేసుకోవడం గమనార్హం.
దావోస్ సదస్సు సందర్భంగా జరిగిన ఒప్పందాల్లో చాలావరకు ఇటువంటి కంపెనీలే అని పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గోడి ఇండియా, స్వచ్ఛ్ బయో కంపెనీలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ పరిస్థితుల్లో ఉర్సా సంస్థ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఊరూపేరూ లేని కంపెనీలు పెట్టుబడి పెడ్తామంటూ ముందుకురావడం, వాటిని గొప్పగా చెప్పుకుంటూ ప్రభుత్వం వందలకోట్ల విలువైన భూమిని వాటికి కేటాయించడం.. అంతా లోపాయికారి వ్యవహారంలా కనిపిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటిస్తున్న పెట్టుబడుల్లో పారదర్శకత ఉన్నదా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలిసారి 2024 జనవరిలో రూ.40వేల కోట్లు, 2025లో రూ.1.79 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినట్టు రేవంత్ సర్కార్ గొప్పలకు పోయింది. అయితే ఆ పెట్టుబడుల్లో ఏ ఒక్కటీ ఇంతవరకు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చిన దాఖలాల్లేవు.