కొండమల్లేపల్లి, మార్చి 18 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోఎక్కడా లేని విధంగా ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం ప్రవేశపెట్టి ఎకరానికి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేసేవారు. రైతుబంధు పేరిట కేసీఆర్ ఎకరానికి రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించి అన్నదాతల ఓట్లతో అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి నుంచి రైతు భరోసా ఊసేలేదు. 2023 డిసెంబర్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేయాల్సిన యాసంగి విడత రైతు భరోసాను ఎకరానికి రూ.5 వేల చొప్పున, ఆ తర్వాత చాలా రోజులకు విడుదల చేసింది ప్రభుత్వం. అనంతరం మాట మార్చి నిధుల్లేవని, అందుకని తాము హామీ ఇచ్చిన రైతుభరోసా రూ.15 వేలు కాకుండా ఎకరానికి రూ. 12 వేలు మాత్రమే ఇస్తామని, అది కూడా సాగు చేసే భూములకు మాత్రమే సీజన్‌కు రూ.6 వేల చొప్పున ఇస్తామని చెప్పి మాట తప్పింది. ఆ తరువాత రైతుభరోసా ఇచ్చింది లేదు.. రైతులు తీసుకున్నది లేదు.
ప్రచారమా.. నిజమా..
రైతు భరోసా అమలుపై మరో ప్రచారం జరుగుతోంది. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి మూడు, నాలుగు దఫాలుగా ఫేక్ ప్రచారాలకు తేర లేపిన సర్కార్ తాజాగా మరోసారి తేదీలను ఖరారు చేసినట్లు ప్రకటనలు సోషల్ మీడియోలో వస్తున్నాయి. ప్రస్తుతం వరి పంట పొట్ట దశ నుంచి కోత దశకు చేరకున్న క్రమంలో రైతు భరోసా సాయం ఇస్తామంటూ ప్రచారం జరుగుతుండటంపై రైతులు అయోమయానికి గురవుతున్నారు. తాజా ప్రచారం మేరకు రైతు భరోసా మొదటి విడత నిధులను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలి విడతలో ఎకరం వరకు, రెండో విడత 20 రోజుల తర్వాత, మూడో విడత ఏప్రిల్ నెలాఖరులోగా విడుదల చేస్తారని చెబుతున్నారు.
అరిగోస పడుతున్న రైతులు
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐదు సీజన్ పంట కాలాలు పూర్తవుతుండగా, ఇందులో పూర్తి స్థాయిలో కేవలం 2 సీజన్లలోనే రైతు భరోసా అమలైంది. మూడు సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టారు. ఇస్తానని చెప్పిన ఎకరానికి రూ.15 వేలను రూ.12 వేలకు కోత పెట్టినప్పటికీ ఇది కూడా సరిగా అమలు చేయలేదు. సాగు భూములకే పెట్టుబడి సాయం చేస్తామన్నారు. ఆ తర్వాత 5 ఎకరాల్లోపు ఉన్న వారికే వర్తింపజేస్తామని చెప్పారు. ఏ విధానాన్ని సరిగా అమలు చేయక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి పూటకో మాట మాట్లాడుతూ అన్నదాతలను గందరగోళంలో పడేస్తున్నారు.
కోత దశలో పెట్టుబడి సాయమా..?
పెట్టుబడి సాయం పంట సాగు సమయంలో అందించాల్సి ఉండగా కోత దశలో రైతులకు అందిస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ చెబుతుండటంపై సర్వత్రా అగ్రహం వ్యక్తమవుతోంది. ప్రచారం మినహా నిజాయితీగా రైతు భరోసా అందించిన దాఖలాలు లేకపోవడంతో రైతులు నమ్మకం వదులుకున్నారు. బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం వచ్చేంత వరకు విశ్వాసం లేదంటూ రైతులు చెబుతున్నారు. వచ్చినప్పుడు చూద్దాంలే.. అంటూ ఏ గ్రామంలో చూసినా రచ్చబండ వద్ద రైతులు చర్చించుకుంటున్నారు.
రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్నాం
మా మండలంలో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. వీరంతా ఈ యాసంగిలో వరి వేశారు. అయితే ఇంతవరకు రైతు భరోసా అందలేదు. దీంతో పంటలు కాపాడుకునేందుకు అప్పులు తేవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా ఇచ్చేలా కన్పించడంలేదు.
– గుండాల యాదయ్య యాదవ్, రైతు, దొనియాల
భరోసా అందక ఇబ్బందులు..
ప్రభుత్వం యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. యాసంగిలో పంట పెట్టుబడి కోసం అప్పులు చేశాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీజన్ ప్రారంభం కాగానే రైతుబంధు రైతుల ఖాతాల్లో జమచేసే వారు.
–రమావత్ సక్రూ నాయక్, రైతు గౌరికుంట తండా
ప్రభుత్వం రోజుకో మాట..
యాసంగి సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతునా ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. దీంతో రైతులు పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. వడ్డీ వ్యాపారుల వద్ద పెట్టుబడి సాయం తెచ్చుకున్నా పంట సాగుకు యూరియా కష్టాలు తప్పడం లేదు.
– కేసాని లింగారెడ్డి, రైతుబంధు మాజీ మండల అధ్యక్షుడు