బెంగళూరు, మార్చి 18: సాంస్కృతిక కార్యక్రమాలు, మతపరమైన ఊరేగింపుల్లో చెవులు చిల్లులు పడేంత బిగ్గరగా సంగీతాన్ని, ఐటం సాంగ్స్‌ను ప్లే చేసే డీజేలను నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నది. బ్యాన్ విధించటంపై బీజేపీ సహా ఇతర విపక్షాల మద్దతు కోరింది. ఇలాంటివి మన సంస్కృతికి ఎంతమాత్రమూ మంచిది కాదని, డీజే మ్యూజిక్, ఐటెం సాంగ్స్‌పై నిషేధం విధించేందుకు తమ ప్రభుత్వం అనుకూలంగా ఉందని కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడగి బుధవారం అసెంబ్లీలో తెలిపారు.
ఈ అంశాన్ని కార్మికమంత్రి సంతోశ్ లాడ్ లేవనెత్తుతూ, డీజేలపై నిషేధం విధించాలని కోరారు. ‘జయంతి ఉత్సవాల్లో డీజేలు ఒక పెద్ద సమస్యగా మారాయి. దీనిపై సభ తప్పకుండా చర్చించాలి. ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో మన దేవుళ్లు డీజే, ఐటెం సాంగ్ లేకుండా ముందుకు కదలటం లేదు. ఇది మన సంస్కృతికి ఎంతమాత్రమూ మంచిది కాదు’ సంతోశ్ లాడ్ అన్నారు. బ్యాన్ విధించటంపై విపక్షాలు ప్రభుత్వానికి మద్దతు తెలుపాలని మంత్రి శివరాజ్ తంగడగి బీజేపీని కోరారు.