Jagadish Reddy | ప్రజా సమస్యల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు జగదీశ్ రెడ్డి అన్నారు. ఎంత తప్పించుకున్నా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజలపై పడిందని విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేసిందని మండిపడ్డారు. మూసీ సుందరీకరణ పేరుతో బడాబాబులకు దోచిపెట్టే కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. లగచర్ల రైతులపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తోందని తెలిపారు. జైలులో ఉన్న లగచర్ల గిరిజన రైతులపై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారని అన్నారు. లగచర్ల ఘటనపై చర్చకు కోరితే ప్రభుత్వం పారిపోయిందని తెలిపారు.
అసెంబ్లీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కాదన్న విషయం గుర్తించాలని జగదీశ్ రెడ్డి సూచించారు. స్పీకర్ మా నోరు నొక్కుతున్నారని తిట్లు తిట్టేవారికే అవకాశం కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు. లగచర్ల రైతుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిపై ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలన నుంచి పారిపోతోందని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.