హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటే ఖబడ్దార్.. అంటూ పోలీసు నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. కాంగ్రెస్ నేతల హామీలు నమ్మి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టిన తమకు.. ఈ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టడం పెద్ద విషయం కాదని హెచ్చరించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పోలీసు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోటిఫికేషన్లు వద్దంటూ నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘ఇన్నేండ్లలో ఎవరు అలా చేశారు? మీ స్థాయికి అవి తగిన వ్యాఖ్యలేనా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా.. ఒక్క భారీ ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ విధానంతో ఇప్పుడు నాలుగేండ్లు తెలంగాణలో చదివినవారు స్థానికులవుతారని, ఇప్పటికే మన ఉద్యోగాలు ఆంధ్రోళ్లకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్న ఆంధ్రప్రాంత ఐపీఎస్ వీవీ శ్రీనివాస్‌రావును అక్కడే కొనసాగించడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని చెప్పారు. జీవో-46 విషయంలో గత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి.. తమను హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిని పోలీసు ఉద్యోగాలకు ఎంపికచేసిన బోర్డు చైర్మన్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్ని పోస్టులు అమ్ముకున్నారో విచారణ చేయించాలని కోరారు.
తెలంగాణ ఉద్యోగాల్లో ఆంధ్రా అధికారుల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే ఉంటే తెలంగాణ బిడ్డలు ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో పోరాటం చేస్తామని హెచ్చరించారు. జీవో-46ను రద్దు చేస్తామని తమకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, మల్లు రవి, అద్దంకి దయాకర్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, రియాజ్, ప్రొఫెసర్ కోదండరామ్, ఆకునూరి మురళి వంటి వారు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. జీవో-46 రద్దు కోసం ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్ కమిటీ ఏమైందని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులను సుప్రీంకోర్టు మెట్లు ఎక్కించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తమ తరఫున న్యాయవాదిని పెట్టాలని డిమాండ్ చేశారు.
తక్షణం 20 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీసు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. వచ్చే నోటిఫికేషన్లలో జీవో-46ను టీజీఎస్పీ నుంచి మినహాయిస్తున్నట్టు ప్రకటించాలని కోరారు. పోలీసు ఫిజికల్ ఈవెంట్లలో మార్పులు చేయాలని, కొలతలు, ఎన్సీసీ, డ్రైవింగ్ వంటి విషయాల్లో ముందే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోలీసు ఉద్యోగాలకు గరిష్ఠ వయో పరిమితిని 35 ఏండ్లకు పెంచాలని, తక్షణం పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్‌ను తొలగించాలని కోరారు. ముఖ్యంగా స్థానికతను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పరిగణించాలని కోరారు. ఈ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్, నవీన్‌పట్నాయక్, వంశీ, శింబునాయక్, రాజు, వెంకట్, రవిప్రకాశ్, చంద్రశేఖర్, శ్రీనివాస్, లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.