Gurukul Schools | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన గురుకులాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నినట్టు తెలుస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలలను డే స్కాలర్స్‌గా మార్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఆ దిశగా ప్రభుత్వం అనుకూల ఉపాధ్యాయ సంఘాలతో గుట్టుగా అభిప్రాయ సేకరణకు పూనుకున్నట్టు గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర అట్టడుగువర్గాల పేదలకు విద్యను అందించడమే లక్ష్యంగా కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,023 గురుకులాలు ఏర్పాటుచే సింది. 5వ తరగతి నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఇంటర్మీడియట్ వరకు విస్తరిస్తూ వచ్చింది. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలనూ నెలకొల్పింది. వీటి ద్వారా దాదాపు ఏటా 6.50 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయి. అంతేకాదు వేలాదిమంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నతస్థానాలు చేరుకునేందుకు బాటలు వేశాయి. ఈ క్రమంలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గురుకులాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. పూటకో నిర్ణయంతో నిర్వీర్యం చేస్తున్నది. పలుచోట్ల గురుకులాలు, గ్రూప్‌లను రద్దు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నది.
వీటిపై వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నది. రోజుకో చోట కలుషిత ఆహార ఘటనలు జరుగుతుండటంతో క్రమంగా గురుకుల విద్య మసకబారుతున్నది. ఇప్పుడు ఏకంగా గురుకుల వ్యవస్థనే రద్దు చేసేందుకు సర్కార్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. గురుకులాలను డేస్కూల్గా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవలే వాట్సాప్‌లో ‘ఆర్టీఏ (రెసిడెన్షియల్ టీచర్స్ అసోసియేషన్) ఉద్యోగుల గౌరవ మేస్త్రీగా రేవంతన్న’ పేరిట ఒక గ్రూప్ ఏర్పాటైంది. అందులో ప్రధానంగా ‘గురుకులాలను డే స్కూల్స్‌గా మార్చడం కోసం టీచర్స్ అసోసియేషన్ తరఫున గ్రూప్ లో చేరడమే మీ అంగీకారం, మద్దతు, సంతకాల సేకరణ’ అని పేర్కొన్నారు. మొత్తంగా గు రుకుల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు గుట్టు గా పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయంలో ఆయా గురుకుల సొసైటీల పరిధిలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్నది. కొద్దిమంది అనుకూల ఉపాధ్యాయ సంఘాలను ముందు పెట్టి ప్రభుత్వమే సంతకాల సేకరణ చేపట్టిందని ప్రచా రం జరుగుతున్నది. ఉపాధ్యాయుల నుంచే డి మాండ్లు వచ్చాయనే పేరిట గురుకులాలను డే స్కాలర్స్‌గా మార్చే కుట్రలకు తెరలేపారని ఆయా సొసైటీల్లో చర్చ కొనసాగుతున్నది.
ప్రస్తుతం ప్రభుత్వం కనుసన్నల్లోనే సంతకాల సేకరణ ప్రారంభమైందనే చర్చ కొనసాగుతున్నది. అదీగాక గురుకుల వ్యవస్థపై సీఎం రేవంత్‌రెడ్డే స్వయంగా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 2024 జూన్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ‘ఈ మధ్యకాలంలో ఒక స్టడీ రిపోర్ట్ చూసిన. దానిని లోతుగా విశ్లేషించాల్సి ఉన్నది. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చాయి. అవి విద్యను పెంచడానికి పనికివచ్చినా, వాటిలో చిన్న పిల్లలను చేర్చడం వల్ల తల్లిదండ్రుల మధ్య కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని స్టడీ రిపోర్టు వచ్చింది. అమ్మఒడియే ప్రథమ పాఠశాల. అక్కడే చాలా నేర్చుకునే అవకాశముంటుంది. కాబట్టి తల్లిదండ్రుల దగ్గరే పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి పిల్లలకు కావాల్సిన వసతులు కల్పించే విషయాన్ని మా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి గురుకులాలను డే స్కూల్స్‌గా మార్చనున్నట్టు స్పష్టంగా తెలుస్తున్నది.
రెసిడెన్షియల్స్‌తో బంధాలు దెబ్బతింటున్నాయ్ రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినయ్. అవి విద్యను పెంచడానికి పనికివచ్చినా, వాటిలో చేర్చడం వల్ల పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఓ స్టడీ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి తల్లిదండ్రుల దగ్గరే పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి పిల్లలకు కావాల్సిన వసతులు కల్పించే విషయాన్ని మా ప్రభుత్వం పరిశీలిస్తున్నది’
-2024 జూన్‌లో జరిగిన విద్యాశాఖ కార్యక్రమంలో రేవంత్