తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపమైన బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎంగిలిపూల నుంచే ఎక్కడా సౌకర్యాలు లేకుండానే వేడుకలు మొదలయ్యాయి. ఉత్సవాలకు రూ.12 కోట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించినా అది ఉత్తమాటేనని తేలింది. ఊరూరా వీధిదీపాలు వెలగక చిమ్మచీకట్లలోనే ఆడబిడ్డలు బతుకమ్మ ఆడాల్సి వచ్చింది. ప్రభుత్వం పైసా ఇవ్వకుండా వసతులు ఎలా కల్పిస్తామంటూ పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ అధికారులు చేతులెత్తేశారు. బతుకమ్మ, దసరా ఏర్పాట్లకు దాతలు ముందుకు రావాలని గూడూరు కార్యదర్శి వాట్సాప్లో పెట్టిన పోస్టు సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పట్టింది.
వరంగల్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘పోయిన సంవత్సరం బతుకమ్మ, దసరా పండుగలను మా సొంత ఖర్చులతో చేసినం. ఆ డబ్బులే ఇప్పటివరకు రాలేదు. మా వద్ద ఇప్పుడు పైసల్లేవు.. ఈ పరిస్థితిలో పండుగలకు ఏర్పాట్లు ఎట్ల చేయాలె?’ అని రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు నిస్సహాయతను వ్యక్తంచేస్తున్నారు. గడచిన 20 నెలలుగా సర్కారు నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాక క్షేత్రస్థాయిలో కార్యదర్శులు తీవ్ర అవస్థలు పడుతూ వస్తున్నారు. నిరుడు ఆగస్టు నుంచే చెక్కులు పాస్ కావడం ఆందోళన చెందుతున్నారు. ఫ్రీజింగ్ ఉన్నదని, ఎంతకాలం దాటవేస్తారని ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎంపీడీవో, డీపీవో మొదలుకొని రాష్ట్ర పంచాయతీ సెక్రటరీ దాకా ఎన్ని అర్జీలు పెట్టుకున్నా తమ ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ అస్తిత్వ ప్రతీక, రాష్ట్ర పండుగైన బతుకమ్మ వేడుకలకు గ్రామాల్లో కనీసం పాడై‘పోయిన’ లైట్ల స్థానంలో కొత్తగా వీధి దీపాలు కూడా పెట్టుకోలేని దుస్థితి నెలకొన్నదని కార్యదర్శులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో 30 శాతం నుంచి 40 శాతం వరకు వీధి దీపాలు పనిచేయడం లేవని, పండుగొస్తే కనీసం లైట్లు కూడా పెట్టరా? అని ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నా తామేమీ చేయలేని నిస్సహాయ స్థితుల్లో ఉన్నామని చేతులెత్తేశారు. పండుగ ఏర్పాట్లు చేయకపోతే క్షేత్రస్థాయిలో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే ‘లోకల్ లీడర్ల సాయంతో ఏర్పాట్లు చేసుకోండి’ అని ఉచిత సలహాలు ఇస్తున్నారని ఉదహరిస్తున్నారు.
నిధులివ్వరు కానీ, విధులు మాత్రం నిర్వహించాలంటే ఎట్లా? అని పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బ్లీచింగ్ పౌడర్, వీధి దీపాల ఏర్పాట్లు, ట్రాక్టర్ మరమ్మతులు, డీజిల్, మోటర్ మెకానిక్లకు సహా ఇతర పనులకు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి నడిపిస్తున్నామని, ఇక తాము ఖర్చు పెట్టుకునే స్థితిలో లేమని తేల్చి చెప్తున్నారు. చిన్న గ్రామ పంచాయతీ అయితే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు, పెద్ద పంచాయతీ అయితే రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా కార్యదర్శులు అప్పులు తెచ్చి నడిపిస్తున్నారని, తానే రూ.4 లక్షల అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నానని ఓ గ్రామ కార్యదర్శి తన అనుభావాన్ని వివరించడం గమనార్హం.
‘బతుకమ్మ ఏర్పాట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.12 కోట్లు విడుదల చేస్తున్నాం. ఇందులో జిల్లాకు రూ.30 లక్షల చొప్పున ఖర్చు చేస్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న ప్రకటించింది. అది ఉత్త ప్రకటనేనని క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ‘ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే.. ఖర్చు చేయడానికి మాకేమి ఇబ్బంది.. బ్రహ్మాండంగా పండుగలకు ఏర్పాట్లు చేస్తాం’ అని పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కార్యదర్శులు ఆదివారం కలిశారు. తమ గోడు వెల్లబోసుకున్నారు. బతుకమ్మ, దసరాకు ఏర్పాట్లు చేయలేకపోతున్నామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయనకు తెగేసి చెప్పారు. ఈ మేరకు వారు ఆయనకు ఒక వినతిపత్రం కూడా సమర్పించడం గమనార్హం.