హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ఎరువుల షాపుల ఎదుట బారులు తీరుతున్న రైతులపై ప్రతాపం చూపే చర్యలకు ఉపక్రమించింది. అన్ని ఎరువుల దుకాణాల వద్ద పోలీసులను మోహరించాలని నిర్ణయించింది. యూరియా కోసం వస్తున్న రైతులను నిలువరించేందుకు ప్రతి ఎరువుల షాపు వద్ద ఇద్దరు పోలీసులను, మరో ఇద్దరు రెవెన్యూ అధికారులను మోహరించాలని కలెక్టర్లకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఎరువుల షాపుల వద్ద పోలీసులను, రెవెన్యూ సిబ్బందిని పెట్టి యూ రియా విక్రయాన్ని స్ట్రీమ్‌లైన్ చే యాలని చెప్పారు. వర్షాలు, పం టల సాగు, సీజనల్ వ్యాధులు, రేషన్‌కార్డుల పంపిణీపై కలెక్టర్లతో సోమవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
రాష్ట్రంలో ప్రస్తు తం యూరియా స్టాక్ ఉన్నదని, అవసరమైన బఫర్ స్టాక్ కూడా ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆగస్టుకు సరిపోకుంటే కేంద్రం నుంచి తెచ్చుకుంటామని తెలిపారు. టీవీలు, పేపర్లలో చాలా మంది రైతులు యూరియా కోసం క్యూలైన్లలో నిలబడినట్టు ఫొటోలు, వీడియోలు పెడుతున్నారని చెప్పారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎరువులు దొరకడం లేదని రైతులను భయపెడుతున్నారని వివరించారు. తద్వారా ఉదయం 10 గంటలకు ఎరువుల షాపు తెరుస్తుంటే రైతులు 7గంటలకే వచ్చి క్యూలో ఉండేలా చేస్తున్నారని, లేదంటే రైతులతో చెప్పులు పెట్టించి ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారని చెప్పారు.
ప్రతి ఎరువులు షాపు వద్ద కచ్చితంగా నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. షాపులో ఎంత స్టాక్ ఉన్నది? ఆ రోజున ఎంత మంది రైతులకు, ఎంత స్టాక్ పంపిణీ చేస్తారో వివరాలను నోటీస్ బోర్డులో పొందుపర్చాలని సూచించారు. జిల్లాలో ఎన్ని ఎరువుల షాపులున్నాయో? వాటి యజమానుల ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఇక సబ్సిడీ యూరియా వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని, జిల్లాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు తప్పకుండా పాల్గొనాలని ఆదేశించారు. ఇక కలెక్టర్ల పనితీరుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి కలెక్టర్ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని స్పష్టంచేశారు. దీంతో పాటు ఇకపై కలెక్టర్లు రోజువారీగా చేసే కార్యక్రమాలపై మరుసటి రోజునివేదిక ఇవ్వాలని ఆదేశించారు.