హైదరాబాద్, జనవరి 8(నమస్తే తెలంగాణ): యూరియా కొరత కనిపించకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడుతున్నది. పైకి మాత్రం ఏదో చేస్తున్నట్టు హడావుడి ప్రదర్శిస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఎరువుల దుకాణానికీ ఒక్కో ఏఈవోను, ఇతర అధికారులను ఇన్చార్జులుగా నియమించింది. అదే విధంగా అగ్రికల్చర్ హెడ్ ఆఫీస్‌లో ఉండే ఉన్నతాధికారులను జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఒక్కో అధికారికి నాలుగు ఐదు జిల్లాలను అప్పగించింది. వీరంతా ప్రతి రోజూ వారికి అప్పగించిన జిల్లాల అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ ఉండాలి.
ఎప్పటికప్పుడు యూరియా స్టాక్ వివరాలు తెప్పించుకోవాలి. దీంతో పాటు ఆయా జిల్లాల్లో పర్యటించి పరిస్థితులను చక్కదిద్దాలి. అయితే యూరియా తెప్పించడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం అధికారులకు శాపంగా మారింది. ఓ వైపు కొరత లేదంటూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఒత్తిడి పెంచుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏఈవోల పరిస్థితి మరీ దారుణంగా మారింది. రుణమాఫీ మొదలు రైతుభరోసాలో కోతల నివేదికల దాకా అన్నీ చక్కబెట్టే ఏఈవోలు.. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతుంటే యూరియా కొరత మరింత ఇబ్బందులు పెడుతున్నది. సర్కార్ చేస్తున్న తప్పులపై ప్రజలు ఎక్కడికక్కడ వారిని నిలదీయడమే గాక కొన్నిచోట్ల కొట్టడమే తక్కువనే పరిస్థితి ఉన్నది. ఇలా ఓ వైపు సర్కార్ నిర్లక్ష్యం.. మరోవైపు రైతుల ఒత్తిడితో ఉద్యోగాలు చేయలేకపోతున్నామంటూ ఏఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా మరోవైపు ఉదయం నిద్రలేవడమే ఆలస్యమన్నట్టు వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలతో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు తమకు పలు పనులు అప్పగిస్తూనే మరోవైపు ఆ పనులు చేయనీయకుండా ప్రతిసారీ సమీక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం చెప్పిన పనులు చేయాలా లేక సమీక్షలకు హాజరు కావాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సర్కార్ వైఫల్యాన్ని తమపై రుద్దుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో కేంద్రం నుంచి అవసరమైన యూరియా నిల్వలు తీసుకురాకుండా తీరా సీజన్ మొదలయ్యాక హడావిడి చేస్తే ఏం లాభమంటూ ప్రశ్నిస్తున్నారు. రైతులకు అవసరమైన యూరియా స్టాక్ లేకుంటే.. ఇలా ఎంత హడావిడి చేసినా, తమను ఎంత పరుగెత్తించినా ఏం ప్రయోజనమని నిట్టూర్చుతున్నారు.